Vedanta Foxconn Project : ఢిల్లీకి రాజైన ఓ తల్లికి కొడుకే అంటారు. కానీ దేశాన్ని పాలించమని పంపించిన ఆ కొడుకు తన తల్లిలాంటి సొంత రాష్ట్రాన్నే నెత్తిన పెట్టుకుంటే ఏమనాలి? ఇప్పుడు దేశానికి ప్రధాని అయినా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ పై అలాంటి వల్లమాలిన ప్రేమనే కనబరుస్తున్నాడు.. దేశంలోని పవర్ ఫుల్ వ్యక్తులు ఇద్దరూ గుజరాతీలే.. దేశంలో వేరే ఏ ప్రాంత నేతలూ లేనట్టూ ఈ ఇద్దరే పరిపాలిస్తారు. ఇది అనైతికం అయినా మెజార్టీ వారిది.. సంసారం వారిది.. ఎవరూ కాదని పరిస్థితి. అయితే మంచి చేస్తే పొగడడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న పనికి మాత్రం విమర్శలు కొనితెచ్చుకుంటున్నారు.

సొంత రాష్ట్రం గుజరాత్ పై మోడీ-షాల అవాజ్య ప్రేమకు మహారాష్ట్ర బలైంది. మహారాష్ట్ర నోట్లో మట్టి కొట్టి సొంత గుజరాత్ కు ప్రతిష్టాత్మకమైన లక్షన్నర కోట్ల భారీ ప్రాజెక్టు తరలిపోయింది. దీనిపై గట్టిగా మాట్లాడడానికి కూడా మహారాష్ట్ర నేతలకు నోరు చాలడం లేదు. ఎందుకంటే అక్కడున్నది ఇటీవలే ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వమే. అందుకే సొంత పార్టీ అధినేతలపై కక్కలేక మింగలేకపోతున్నారు.
‘సెమీ కండక్టర్ల’ ప్రాజెక్ట్. భవిష్యత్ అంతా దీనిదే. ఎందుకంటే ఏటీఎం చిప్ నుంచి మొబైల్స్, స్మార్ట్ టీవీలు, కార్లు, విమానాలు, ఇలా ఒక్కటేంటి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు నడవాలన్నా కూడా ఈ సెమీ కండక్టర్ చిప్ లే కావాలి. కరోనా వేళ ఈ చిప్ ల కొరతతో ఎన్ని ఆగిపోయాయో చూశాం. కార్ల కొరత వేధించింది. ఈ సెమీ కండక్టర్ల పరిశ్రమ ఎక్కువగా చైనా, తైవాన్ లలో ఉంది. ఇప్పుడు తైవాన్ కు చెందిన అతిపెద్ద కంపెనీ ‘ఫాక్స్ కాన్’ భారత్ లో తొలిసారి ‘వేదాంత’ గ్రూప్ తో కలిసి సెమీ కండక్టర్ల పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది. ఏకంగా లక్షన్నర కోట్ల భారీ పెట్టుబడి.
ఇది మొదట మహారాష్ట్ర లోని శివసేన ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి వేదాంత-ఫాక్స్ కాన్ దాదాపు ఓకే చెప్పింది. ఇక ఎంవోయూ, ప్లాంట్ ఏర్పాటే తరువాయి అనుకున్నారు. కానీ మహారాష్ట్రలో శివసేన సర్కార్ కూలి రెబల్ ఏక్ నాథ్ షిండే సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
అంతపెద్ద ప్రాజెక్ట్ మహారాష్ట్రకు వెళుతుంటే గుజరాత్ కే చెందిన మోడీ షాల సర్కార్ కు ఎందుకో మనసు రాలేదు. వెంటనే చక్రం తిప్పడం.. గుజరాత్ ప్రభుత్వంతో వేదాంత-పాక్స్ కాన్ ఒప్పందం చేసుకోవడం.. ఎంవోయూ సంతకాలు పూర్తి అయ్యి 1000 ఎకరాలు కూడా ఈ ఫ్యాక్టరీకి కేటాయించారు.
ఇది చూసి మహారాష్ట్ర నేతలు, ప్రజలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తమకు రావాల్సిన ప్రాజెక్టును ఇలా సొంత రాష్ట్రానికి తరలించడం ఏంటని మండిపడుతున్నారు. కానీ బీజేపీ పెద్దలే కావడంతో ఆ అధికార పార్టీ నేతలు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.
ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. తెలంగాణకు కేటాయించిన ఖాజీపేట్ లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారు. 21వేల కోట్లతో ఈ ఎలక్ట్రిక్ కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణకు కేటాయించిన కొన్ని ప్రాజెక్టులను గుజరాత్ కే వెళ్లిపోయాయి.
ఇవే కాదు.. అమరావతి లాంటి రెండు నగరాలు ధోలెలా, గిఫ్ట్ సిటీల పేరుతో గుజరాత్లో నిర్మిస్తున్నారు. వీటి కోసం దేశంలో భారీ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ గుజరాత్ కే పంపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా సొంత రాష్ట్రం కోసం ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రాకుండా.. వచ్చినవి తరలించుకుపోతున్న గుజరాతీ పెద్దమనుషుల తీరుపై అందరూ రగిలిపోతున్న పరిస్థితి నెలకొంది. ‘వేదాంత-ఫాక్స్ కాన్’ ప్రాజెక్ట్ మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు వెళ్లడాన్ని మాత్రం ఎవరూ జీర్ణించుకోవడం లేదు. దేశంలో మరే రాష్ట్రం లేనట్టు సొంత రాష్ట్రానికి ఇలాంటి ప్రాజెక్టులను మోడీషాలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.