CM YS Jagan – AP Debts : ఎట్టకేలకు ఏపీపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. అప్పుడెప్పుడో చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటును తీర్చమంటే.. ఇప్పుడు స్పందించింది. ఏకంగా రూ.10 వేలు కోట్లు జగన్ సర్కారు చేతిలో పెడుతోంది. ఇంకేమి అని వైసీపీ సర్కారు సంబరాలు చేసుకుంటోంది. ఈ మొత్తంతో పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల వద్ద మార్కులు కొట్టేయ్యాలని భావిస్తోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని చేపట్టి బిల్లుల కోసం వేచిచూస్తున్న సొంత పార్టీ నేతల కళ్లల్లో ఆనందం నింపాలని చూస్తోంది. అయితే కేంద్రం రూ.10 వేల కోట్ల నిధుల విడుదల వెనుక చాలారకాల హామీలు, షరతులు ఉన్నట్టు తెలియడం ఆందోళన కలిగిస్తోంది.
రాజకీయ ప్రతికూలతలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ నిధులు రావడం ఉపశమనమే. అయితే ఇది గుప్తంగానే ఉండేది. హఠాత్తుగా ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇలా ఎందుకు ఇచ్చారా అని ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ సర్కారు చాలారకాలుగా పూచీకత్తులు, హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు, పథకాలకు నిధులు అడగమని రాసిచ్చికేంద్రం నుంచి రూ.10 వేల నిధులు పొందినట్టు తెలుస్తోంది. అంటే వన్ టైమ్ సెటిల్మెంట్ అన్న మాట. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి నిధులు తెచ్చుకున్నారన్న మాట. ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు కూడా.
కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలన్నింటినీ ఇక వదులుకోవాల్సిందే. చివరకు రాజ్యాంగబద్ధ చెల్లింపులకు సైతం ఎటువంటి ఆస్కారం లేదు.పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఇక నిధులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును పడకేశారు. రాజధానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వరు. ఎలా చూసినా మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటిపై కూడా హక్కులను వదులుకున్నట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో మనం అంతర్భాగమే. కానీ ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ వదులుకున్నట్టే లెక్క.
వైసీపీ సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచి ఇదే లెక్క. అప్పు తేవడం, బటన్ నొక్కడం. దానికి సంక్షేమం అనే ట్యాగ్ తగిలించడం. అయితే రాజకీయాలు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. రాష్ట్రం శాశ్వతం అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. తన రాజకీయం కోసం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. వచ్చే పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ బటన్ నొక్కుడుకు ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పరిశ్రమలు లేవు. అంతకు మించి ప్రజలకు ఉపాధి లేదు. పాలకుడిలో చిత్తశుద్ధి లేకుంటే అచ్చం ఏపీ మాదిరిగా ఉంటుందన్న అపవాదును జాతీయ స్థాయిలో వ్యాపించింది. అయితే దీనికి అంతిమంగా మూల్యం చెల్లించుకునేది ప్రజలే.