AP News : బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతూ.. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే ఏపీలో ఇంతే!

పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఓ వ్యక్తిని నగ్నంగా తిప్పుతూ.. లాఠీతో వెంబడిస్తున్న ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Written By: Dharma, Updated On : January 9, 2024 8:26 am
Follow us on

 

ఏపీలో కొందరు పోలీసుల వైఖరి తీవ్ర విమర్శలకు గురవుతోంది. సామాన్యులకు సైతం ఇబ్బందులకు గురి చేస్తోంది. కొంతమంది పోలీసులు రాజకీయ అవతారం ఎత్తి చేస్తున్న అతి మొత్తం పోలీస్ శాఖ కి మాయని మచ్చగా నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోతో పోలీస్ శాఖ ఇంతకు దిగజారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఓ వ్యక్తిని నగ్నంగా తిప్పుతూ.. లాఠీతో వెంబడిస్తున్న ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డిసెంబర్ 31 రాత్రి విడపనకల్లు మండలం చీకలగూరి గ్రామానికి చెందిన సచివాలయం ఎదుట ఉన్న వైసీపీ జెండాను తొలగించి.. జాతీయ జెండాను ఎగురవేయాలని గ్రామానికి చెందిన చంద్రమోహన్ కోరాడు. దీనిపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు జెండాను దించకపోతే.. నేనే దించి తగుల బెడతానని చంద్రమోహన్ హెచ్చరించాడు. అయితే ఆ మరుసటి రోజు జెండాను చంద్రమోహన్ తగులుబెట్టాడని వైసీపీ నేతలు పాల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రమోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు స్టేషన్ కు తీసుకెళుతున్నారు అంటూ అతడు ప్రశ్నించాడు. తమకు ఎదురు ప్రశ్న వేస్తావా అంటూ పోలీసులు ఆయనపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా దుస్తులు ఊడదీయించి, బూటు కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. స్టేషన్ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతూ.. వెంటాడుతూ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం చంద్రమోహన్ బెయిల్ పై బయటకు వచ్చాడు. కానీ పోలీసు దెబ్బలతో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడంతో పోలీస్ ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. దీనిపై ఆరా తీశారు. అయితే తాము దాడి చేయలేదని.. కేసు నమోదు చేసి జైలుకు పంపామని పాల్తూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు.