Statue of Equality త్రిదండి చినజీయర్ స్వామీజీ.. పరిచయం అక్కరలేని పేరు. ఏడాది క్రితం వరకు ఈయన సీఎం కేసీఆర్‌కు దైవంతో సమానం. ఏ పనికి అయినా ఆయన సలహాలేనిదే ముఖ్యమంత్రి మొదలు పెట్టేవారు కాదంటే అతిశయోక్తి కాదు. పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు, నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా ఏవైనా ఆయన సలహా తీసుకోవాల్సిందే. స్వామి వారు ముహూర్తం పెట్టాల్సిందే. వీలైతే ప్రత్యక్షంగా ఆయన కార్యంలో పాల్గొనాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరి గుట్ట ప్రస్తుత యాదాద్రి ఆలయ నిర్మాణానికి కర్త, కర్మ ఆయనే. కానీ ప్రస్తుతం క్రియలో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకుండానే యాదాద్రి నూతన ఆలయం మహాకుంభ సంప్రోక్షణ పూర్తైంది. యాదగిరికి యాదాద్రిగా నామకరణం చేసి, యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేసిన చిన జీయర్‌స్వామి ఈ ఓపెనింగ్ సెర్మనీలో ఎక్కడా కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఇక స్వామీజీకి స్వస్తి పలికినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇక తనకు జీయర్ స్వామికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మీరే సృష్టిస్తున్నారని కేసీఆర్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు చినజీయర్ స్వామి సైతం ఇదే మాట అన్నాడు. కానీ వీరి మాటలను ఎవరూ నమ్మలేదు. చినజీయర్ వల్ల ముచ్చింతల్‌లో తనకు జరిగిన అవమానానికి కేసీఆర్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఇప్పుడా సమయం వచ్చినట్టే కనిపిస్తోంది.
తాజాగా చినజీయర్ స్వామి సారథ్యంలోని స్టాచ్చూ ఆఫ్ ఈక్వాలిటీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. సమతామూర్తి సన్నిధిలో విక్రయించే ప్రసాదం ప్యాకెట్లపై తయారీ, గడువు తేదీలు లేవని ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు అధికారులు వేగంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మోడీ ప్రారంభించిన ఈ సమతామూర్తి ఆలయంపై ఏకంగా దాడులు నిర్వహించి కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టడం సంచలనమైంది.
సమతామూర్తి ప్రారంభోత్సవానికి కేసీఆర్ ను పిలవకుండా మోడీని పిలిచినప్పుడే గులాబీ దళపతి ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ స్వామీజీపై చర్యలకు దిగితే విమర్శలు వస్తాయని ఇప్పటివరకూ వేచిచూసినట్టు తెలుస్తోంది. తాజాగా ఓ సామాజిక కార్యకర్త పేరుతో సమతామూర్తి సన్నిధిలోని నాణ్యత లేని పదార్థాలపై ఫిర్యాదు రాగానే తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ ప్రతీకారంలో ఇది భాగం అని అందరూ అనుకుంటున్నారు. లేదంటే స్వామీజీ సన్నిధిపై కేసులు పెట్టేంత దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంటుంది.? కేసీఆర్ నజర్ పెడితేనే సమతామూర్తిలోని లోపాలు బయటపడుతున్నాయని.. నిర్వాహకులపై కేసులు నమోదవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది ఓ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు పెట్టిన మామూలు కేసు అనేవారు లేకపోలేదు. కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నంత వరకూ చినజీయర్ స్వామిపై ఈగ వాలలేదు. ఇప్పుడు కేసు పెట్టేంత వరకూ కూడా వచ్చిందంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. మొత్తానికి మునుపు ఉన్నంత స్వేచ్ఛా గౌరవాలు చినజీయర్ స్వామికి ఇప్పుడు లేవు అనడానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు.