BJP covert: తెలంగాణ బీజేపీలో ఇవిగో చేరికలు.. అవిగో చేరికలు అన్నారు. కానీ చివరికి ఉన్న వారు కూడా జంపయ్యే పరిస్థితి కనిపించడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బండి సంజయ్ ఎవరూ వెళ్లవద్దని .. వెళ్లిపోయిన వాళ్లు రావాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత కలహాలను ఇప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బీజేపీలో టెన్షన్ మొదలైంది. బీజేపీలో అసంతృప్త, వలస నేతల్ని రేవంత్ ఆహ్వానిస్తున్నారు. ఈటల రాజేందర్ లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ సరైనదని సందేశం పంపుతున్నారు. ఆయనను మాత్రమే కాదు మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌తోపాటు విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. వీరి లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదని.. రేవంత్ అంటున్నారు.

వలస నేతలకు గాలం?
నిజానికి వీరంతా బీజేపీలోకి వలస వచ్చినవారే. ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గడిపేస్తున్నారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా రేవంత్ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారని.. బీజేపీపీలో చేరిన వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌కు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అసలే బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చాలా పెద్ద మిషన్ పెట్టుకుని పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు. ఈ లోపు రేవంత్‌రెడ్డి ఉన్న నేతల్ని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూండటంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్రమత్తమయ్యారు.
తిరిగి రావాలని పిలుపు..
విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీని వీడిన వారు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కొత్త వారు కూడా రావాలని ఆయన కోరుతున్నారు. నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక.. తనకు ప్రాధాన్యత లేదని విజయశాంతి ఫీలవుతున్నారు. ఈ భావన తొలగించడానికి ఆయన విజయశాంతి కార్యక్రమాన్ని హాజరయ్యారు. బీజేపీలో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇక చేరడమే తరువాయి అనుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. రివర్స్‌లో కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటే బీజేపీ ఇప్పటి వరకూ తెచ్చుకున్న హైప్ పూర్తిగా కోల్పోతుంది. రేసులో లేకుండా పోతుంది.
కోవర్టులపై హైకమాండ్ నజర్..
ఒకవైపు కాంగ్రెస్ ఆకర్ష్ మంత్రం.. మరోవైపు కేసీఆర్ కోవర్టులు తెలంగాణ బీజేపీని టెన్షన్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ రంగంలోకి దిగింది. అన్ని పార్టీల్లోలాగే బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్‌తో కాషాయదళాన్ని కలవరానికి గురిచేశాయి. ఈటల మాటల్లో వాస్తవం లేకపోలేదన్న అభిప్రాయం హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. కేసీఆర్ కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు ఏయే స్థాయిలో ఉన్నారు..? వారిని ఎలా గుర్తించాలనే దానిపై పార్టీలో కూడా చర్చ జరుగుతోంది.
గుర్తించే పనిలో కమలం పెద్దలు..
కోవర్టుల విషయంలో అలర్ట్ అయిన బీజేపీ ముఖ్యులు వారిని గుర్తించి, కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టిసారించారని తెలుస్తోంది. కోవర్టులను పక్కా ఆధారాలతో గుర్తించి కట్టడి చేయాలని.. అవసరమైతే అలాంటి నేతలను పక్కనపెట్టాలన్న ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం. వాస్తవానికి ఈ కోవర్టుల వ్యవహారం మునుగోడు ఉపఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చింది. బీజేపీ తరఫున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమికి కూడా కోవర్టులే కారణమనే ఆరోపణలు పెద్దఎత్తునే వచ్చాయి. బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలన్నీ కోవర్టులే.. గులాబీ పార్టీకి చేరవేశారనే టాక్ కూడా నడిచింది. అప్పట్లో కొందరు నేతలు బీఆర్‌ఎస్ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. తాజాగా.. ఈటల నోట కూడా కోవర్టులు, ఇన్‌ఫార్మర్ల వ్యాఖ్యలు రావడంతో ఇదంతా అక్షరాలా నిజమే అని తేలిపోయింది. అయితే.. బీజేపీలో దూకుడుగా ఉన్న ఈటల జాతీయ నాయకత్వం దృష్టిలో ఉండటంతో.. రాష్ట్ర నాయకత్వంలోని కొందరికి మింగుడు పడటం లేదని పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోందట.
లక్ష్మణ్ హాట్ కామెంట్స్..
ఈ కోవర్టుల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ కీలకనేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కోవర్టులు బీజేపీలో ఉండి చేసేదేమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని స్పష్టం చేశారు. బీజేపీ చేరికలపై ఆధారపడదని.. తెలంగాణపై ప్రధాని మోదీ, అమిత్ షాలకు ప్రత్యేక వ్యూహముందని లక్ష్మణ్ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారని కూడా తెలిపారు. మోదీ, అమిత్‌షా, నడ్డా నెలకోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారని చెప్పారు.
ముందస్తు కాదు.. జమిలికి రెడీనా..?
ఇక మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలు, కేంద్ర నిధులపై చేసిన కామెంట్స్‌పై కూడా లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. లోకసభకు ముందస్తు ఎన్నికలు కాదు.. జమిలి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌కు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తే ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కలుస్తాయని ఎంపీ జోస్యం చెప్పారు. కేంద్ర నిధులపై బీఆర్‌ఎస్ ఎంపీలతో పార్లమెంట్‌లో చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మంత్రి కేటీఆర్ సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ సమస్యలపై బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా రాజ్యసభలో ప్రస్తావిస్తానని తెలిపారు.