Homeఎంటర్టైన్మెంట్Telugu Film Producer Council Elections : దిల్ రాజు మెయిన్ విలనైతే.. వీళ్ళు సైడ్ విలన్సా?

Telugu Film Producer Council Elections : దిల్ రాజు మెయిన్ విలనైతే.. వీళ్ళు సైడ్ విలన్సా?

Telugu Film Producer Council Elections Controversy : పైకి చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం ఆ బూతులు అన్న సామెతను టాలీవుడ్ కు అన్వయించవచ్చు అని కొందరు సినీ క్రిటిక్స్ సెటైర్లు వేస్తున్నారు. నిర్మాతలందరూ ఒక్కటే.. తమదంతా ఒకటే కులం అని బయటకు చెప్పుకునే ఈ నిర్మాతలకు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ‘అపరిచితుడు’లోన జొచ్చుతాడు. ఆ తర్వాత చంద్రముఖిలా మీడియా ముందట వీరంతా వికటట్టహాసం చేస్తారు. ఎవరికి వారే యమునా తీరే. ఆధిపత్యం కోసం ఎంతకైనా దిగజారే టాలీవుడ్ పెద్దలను చూస్తే .. ఇప్పుడు ఈ నిర్మాతల మండలి ఎన్నికల రచ్చను తరిచిచూస్తే ఇదే అందరికీ అనిపిస్తోంది..
 ఆదివారం టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ప్రస్తుత ప్రెసిడెంట్ సి కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలో.. ఈ ఎన్నికల్లో తన పాత్ర ఏమిటో తెలియజేశారు. ఈ క్రమంలో పరిశ్రమలో జరుగుతున్న రాజకీయాలు. ఆధిపత్య పోరు మీద సుచాయిగా మాట్లాడారు. తాను ఈసారి ఎన్నికల్లో నిలబడటం లేదన్నారు. గతంలో కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థన మేరకే పదవిలో కూర్చన్నానన్నారు. ఈసారి ఎలక్షన్స్ బరిలో ఉన్న నిర్మాత ప్రసన్న కుమార్ కి సప్పోర్ట్ చేయాలని పరోక్షంగా చెప్పారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేన్నారు . ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి తలుపు తట్టినా సమస్యను తీర్చే నాయకుడిని విజ్ఞతతో ఎన్నుకోవాలన్నారు.  సి కళ్యాణ్ ఈ క్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్, గిల్డ్ మధ్య ఉన్న అభిప్రాయం బేధాలు. పవర్ వార్ గురించి ప్రస్తావించారు. 
 
దిల్ రాజు పేరు నేరుగా ప్రస్తావించిన సి కళ్యాణ్… దిల్ రాజు ప్యానల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ అంటున్నారు. కానీ అది నిజం కాదు. అంత ఒక ప్యానెలే. 30-70 రేషియోలో ఎన్నికలు వెళదామని ఆయన చెప్పినట్లు సి. కళ్యాణ్ అన్నారు. అయితే దిల్ రాజును కొందరు తప్పుదోవ పట్టించారన్నారు.  ఒక సానుకూల ఒప్పందంతో ముందుకు వెళుతున్న తమ మధ్య మనస్పర్థలు సృష్టించారని చెప్పకనే చెప్పాడు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటే చాలు, గిల్డ్ అనేది అవసరం లేదు. రెండూ ఏకం చేద్దామన్న తన ప్రయత్నం కొందరి స్వార్ధపూరిత ఆలోచనల వలన విఫలమైందన్నారు. అసలు చిన్న నిర్మాతల సమస్యలు చర్చించే వారే లేకుండా పోయారన్నారు.
 
మొత్తంగా సి కళ్యాణ్ ప్రెస్ మీట్ సారాంశం ఏమిటంటే… తాను మద్దతు తెలిపిన ప్యానెల్ ని గెలిపించండి. మేము మాత్రమే మీకు అండగా ఉంటామని. అయితే రెండు పర్యాయాలు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా ఉన్న సి కళ్యాణ్ ఏం చేశారు? ఆయన పదవిలో ఉండగా ఎందరు చిన్న నిర్మాతల సమస్యలు తీర్చారు? ఇంతకీ ఆయన చిన్న నిర్మాత అవుతాడా? అసలు చిన్న నిర్మాత? చిన్న సినిమా అనే పరిధిలోకి ఎవరు వస్తారు?… ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. 
 
దాసరి నారాయణరావు బడ్జెట్ సినిమాను బ్రతికించాలి. చిన్న సినిమా మనుగడ పరిశ్రమకు అవసరమని పెద్దోళ్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ నలుగురు నినాదం తెరపైకి తెచ్చింది ఆయనే. థియేటర్లు గుప్పెట్లో పెట్టుకొని కొందరు చిన్న సినిమాను చంపేస్తున్నారని ఆయన వేదన చెందారు. పరిష్కారంగా రోజుకు ఐదు షోలు చేసి ఒక షో ప్రత్యేకంగా చిన్న సినిమాకు కేటాయించాలన్నారు. ఆయన కన్నుమూశాక ఆ ప్రతిపాదన కూడా మరుగున పడిపోయింది. 
 
సి కళ్యాణ్ చిన్న నిర్మాతేమీ కాదు. తన సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకోగలడు. దిల్ రాజు అనే ఒక వ్యక్తి శక్తిగా ఎదిగి శాసిస్తుంటే అప్పుడు ఆయనకు తాను చిన్న నిర్మాతను అనే విషయం గుర్తుకు వచ్చింది. మన ముడ్డి క్రిందకి నీళ్ళొస్తే కానీ నొప్పేంటో తెలియదన్నట్లు. దిల్ రాజును కాదని పెద్ద హీరోలు కూడా తమ సినిమాను విడుదల చేసుకునే పరిస్థితి లేదు. కాదని రిలీజ్ చేస్తానంటే థియేటర్స్ దొరకవు. దొరికినా బొమ్మ ఎక్కువ రోజులు ఉండనివ్వరన్న ఒక విమర్శ ఇండస్ట్రీలో ఉంది. 
 
చిన్న నిర్మాత కష్టం ఏ కౌన్సిల్, అసోసియేషన్ పట్టించుకోదు. సినిమా మీద ఫ్యాషన్ తో ఐదు కోట్లు పది కోట్లు  పోగు చేసి సినిమా తీస్తే… పట్టించుకునే నాథుడే ఉండడు. అయ్యా మాదో సినిమా ఉంది, కొన్ని థియేటర్స్ ఇవ్వమంటే, పెద్దోళ్ళకే దిక్కులేదు పక్కకు పో అంటారు. ఏళ్లుగా విడుదలకు నోచుకోని సినిమాలు టాలీవుడ్ లో వందకు పైగా ఉంటాయి. మూవీ మాఫియా రాజకీయాలకు ఆ సినిమాలన్నీ బలైపోతున్నాయి. 
 
వాళ్ళ గురించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ పెద్దలు కానీ ఎవరూ మాట్లాడరు. సంక్రాంతి వాళ్లకే కావాలి దసరా వాళ్ళకే కావాలి. సమ్మర్, వింటర్ అన్ని సీజన్స్ వాళ్ళవే. పెద్దోళ్ల చిత్రాలు లేనప్పుడు ఖాళీగా థియేటర్స్ ఉంటే విడుదల చేసుకోవాలి. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫ్రెండ్స్ ఫండింగ్, బడ్జెట్ చిత్రాలను బ్రతికించేందుకు ఒక్కొకరు ముందుకురారు. వేదికల మీద మాత్రం సినిమా ఓ కుటుంబం, మేము కళామతల్లి ముద్దు బిడ్డలమని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ ఉంటారు. తమ స్వార్థం కోసం చిన్నోళ్లను తొక్కేసే సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్, సి కళ్యాణ్, స్టార్స్, సూపర్ స్టార్స్ అందరూ విలన్సే. కాకపోతే దిల్ రాజు మెయిన్ విలన్.. వీరందరూ సైడ్ విలన్స్. అంతే తేడా అని చిన్న నిర్మాతలంతా ఆఫ్ ది రికార్డుగా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. వారి కష్టాన్ని బయటకు చెప్పుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు.  ఇలా నిర్మాతల మండలి ఎన్నికల వేళ చాట్లో తవుడు పోసి కుక్కల కొట్టాట పెట్టుకుంటున్న తీరుగా సినిమా పరిశ్రమను మరింతగా గబ్బు పుట్టిస్తున్నారని కొందరు సినీ ప్రముఖులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి నెలకొంది.    

YouTube video player

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version