Telangana Jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ..

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

Written By: NARESH, Updated On : January 31, 2024 10:26 pm
Follow us on

Telangana Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలో 15 వేల పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్డీ స్టేడియంలో బుధవారం 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందించారు. అనంతరం సీఎం మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలారోజులుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఖాళీలపై సమీక్ష చేసి నియామకాలు జరిగేలా చూశారన్నారు.

పదేళ్లలో నెరవేరని ఆకాంక్ష..
తెలంగాణ సాధించుకుని పదేళ్లయినా నిరుద్యోగుల ఆకాంక్ష మాత్రం ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఉద్యోగా ఖాళీల భర్తీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబం గురించి మాత్రమే ఆలోచించిందని ఆరోపించారు. నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన యువతపై గత పాలకులు కేసులు పెట్టారని గుర్తుచేశారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ..
టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేశామని, త్వరలోనే కొత్త చైర్మన్, కమిటీ బాధ్యతలు చేపడుతుందని తెలిపారు. ఆ తర్వాత ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహిస్తామని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.