Telangana Governor Tamilisai: తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్‌భవన్ వైరం ముదురుతోంది. ఇంతకాలం వార్ వన్‌సైడ్ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను పక్కన పెడుతూ వచ్చింది. ప్రొటోకాల్‌ను పూర్తిగా విస్మరించింది. వ్యక్తిగా కాకపోయినా.. గవర్నర్ పోస్టుకు కూడా గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయి. గవర్నర్ ‘సమ్మక్క–సారలమ్మ’ జాతరకు వెళ్లిన సందర్భంగా ప్రభుత్వం ప్రొటోకాల్ విస్మరించడాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా గవర్నర్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం, గవర్నర్ పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. అనూహ్య పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందన్న చర్చ సాగుతోంది.

-ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..
దాదాపు ఏడాదిగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాకిచ్చి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన హుజూరాబాద్ నేత పాటి కౌషిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం పంపిన ఫైల్ ను గవర్నర్ పక్కన పెట్టడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత జూన్‌లో రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు. ఆయనే కాదు మంత్రులు, అధికారులు కూడా రాజ్‌భవన్ గడప తొక్కడానికి జంకుతున్నారు. ప్రభుత్వంతోపాటు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గవర్నర్‌ను దూరం పెట్టారు. ఇంతకాలం ఓపికగా భరించిన గవర్నర్ తమిళిసై ఒక్క ఫిర్యాదుతో సీఎం కేసీఆర్, ఆయన మంత్రివర్గం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇరుకున పెట్టారు. గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందన్న సమాచారం తెలియడంతోనే రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఇటు కేసీఆర్ మంత్రివర్గ సహచరులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులూ గవర్నర్ ఢిల్లీ పర్యటనతో ఉలిక్కి పడ్డారు.
-ప్రధాని, హోం మంత్రితో గవర్నర్ భేటీ..
రెండు రోజులు ఢిల్లీలో ఉన్న గరవ్నర్ తమిళిసై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమితషాను కలిశారు. ఇద్దరితో సుమారు గంటపాటు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో పరిస్థితులపై నివేదిక కూడా ఇచ్చారు. అనంతరం గవర్నర్ మీడియాతో కూడా మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఓపెన్ సీక్రెట్ అన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని చెబుతూనే సీఎం కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో తనకు తెలియదన్నారు. కౌషిక్‌రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్‌కు కోపం వచ్చినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రాజ్యాంగ పదవి అయిన గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ సీఎస్‌కు కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో తాను ప్రభుత్వంతోపాటు అధికారులపై ఫిర్యాదు చేసినట్లు పరోక్షంగా చెప్పారు. తెలంగాణలో గవర్నర్ ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్డు లేదా రైలులో వెళ్లాలా? అది ఎందుకో ప్రభుత్వాన్ని అడగాలని విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఈనెల 11న భద్రాచలంకు కూడా రైలులో వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని, కేసీఆర్‌తో మాట్లాడటానికి చాలాసార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని ప్రకటించారు. పైగా తన తల్లి చనిపోయినప్పుడు కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదని పేర్కొన్నారు. గవర్నర్‌గా కాకపోయినా.. మహిళగా అయినా గౌరవం ఇవ్వారా అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రజలందరినీ కదిలించాయి.

-గౌరవిస్తాం అంటూనే ఎదురు దాడి..
ఢిల్లీలో గవర్నర్ మీడియాకు వెల్లడించిన విషయాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఉన్నాయి. తమిళిసై వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెంట్‌గా ఉంటూ తన మంత్రులతో విమర్శలు చేయించడం మొదలు పెట్టారు. అవే ఇప్పుడు చిచ్చుపెడుతున్నాయి. గవర్నర్ తో ఓపెన్ ఫైట్ కు టీఆర్ఎస్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
– గవర్నర్ వ్యాఖ్యలపై మొదట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. గవర్నర్ గవర్నర్‌లా ఉండడం లేదని, బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
– హోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఐటీ శాఖ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్పందించారు. గవర్నర్ గవర్నర్‌లా ఉంటే తప్పక గౌరవిస్తామని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తమకు గవర్నర్ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కౌషిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం కారణమైతే.. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైకి గవర్నర్ పోస్టుకు ఎలా అర్హురాలని.. గవర్నర్ అర్హతనే కేటీఆర్ ప్రశ్నించడం సంచలనమైంది.
– టీఆర్‌ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు. కావాలనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
– తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాలకు వెళ్తూ ప్రొటోకాల్ పాటించ లేదనడం సరికాదన్నారు. యాదాద్రికి వెళ్లే గంట ముందే తమకు సమాచారం ఇచ్చారని, ఆ సమయంలో తాము వేరే పనుల్లో ఉన్నామని తెలిపారు. తమకు ఒక రోజు ముందు సమాచారం ఇస్తేనే సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
గవర్నర్ వ్యవస్థపై గౌరవం ఉందంటూనే.. గవర్నర్‌పై టీఆర్ఎస్ ఎదురు దాడి చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.