Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికలు : పోటాపోటీ.. ఎవరో మేటి?

రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కొత్తగా మరిన్ని హామీలను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 10, 2023 9:52 pm

Telangana Politics

Follow us on

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు ప్రజలను ఆకట్టుకోవడానికి విస్తృత హామీలు ఇస్తూనే.. మరోవైపు తమ పార్టీకే ఎందుకు ఓట్లు వేయాలి? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా ఎన్నికల్లో ప్రత్యేక స్లోగన్‌ను ఎంచుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అయినా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ప్రతిపక్షానికే పరిమితమయింది. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకోసం కేంద్ర పార్టీ పెద్దలు కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి వారు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాము గెలిస్తే… ఏం చేస్తామో చెబుతూ ఆరు హామీల పేరిట వివిధ స్కీములను కూడా ప్రకటించారు. త్వరలోనే బస్సు యాత్ర కూడా చేపడుతున్నారు. ఎమోషనల్‌గా కూడా ప్రజలతో అనుబంధం పెంచుకోవాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకే రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను అడగాలని నిర్ణయించారు. ఇకపై నిర్వహించే ప్రచారంలో ఈ అంశానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

మరోవైపు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ను సాధిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటిస్తున్నారు. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా తమకు మద్దతు ఇవ్వాలనే కోణంలో మొదటి రెండు ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ.. ఈసారి మాత్రం కొంత భిన్నమైన ప్రచార శైలిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూనే.. మరోవైపు తమ పార్టీ గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇతర పార్టీలతో పోలిక తీసుకువచ్చి, ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి వీలైన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కొత్తగా మరిన్ని హామీలను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు.

అనూహ్య ఫలితాలపై బీజేపీ ఆశలు..

బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో మ్యాజిక్‌ చేయాలని భావిస్తోంది. ఇటు బీఆర్‌ఎస్‌, అటు కాంగ్రెస్ పై ఏకకాలంలో విమర్శలు సంధిస్తూ ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం ద్వారా డబుల్‌ ఇంజన్‌ పద్ధతిలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు రూ.9 లక్షల కోట్ల ఆర్థికసాయం చేసిందని, అయినా.. ఆశించిన మేర రాష్ట్ర అభివృద్ధి జరగలేదని పేర్కొంటున్నారు. ఈ నిధుల మళ్లింపు జరిగిందని, అవినీతి పెరిగిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ కుటుంబం అవినీతి వల్ల రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ఫ్యామిలీ బాగుపడిందని, ఈ ధోరణి కి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, చైతన్యం కలిగించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తద్వారా తమ పార్టీ ఊహించని విధంగా ఫలితాలను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.