Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికలు : రైతుల చుట్టే పార్టీల రాజకీయాలు

రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభం చేసిన ఘనతను రైతుల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Written By: NARESH, Updated On : October 13, 2023 9:00 pm

Are-both-Congress--TRS-falling-i

Follow us on

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల వేటకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి ప్రత్యేకించి రైతుల ఓట్లే లక్ష్యంగా కార్యాచరణకు పదును పెడుతున్నాయి. ‘ధరణి’ పోర్టల్‌, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల లెక్క ప్రకారం.. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. వీరు కాకుండా.. సుమారు 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ‘రైతు స్వరాజ్య వేదిక’ ఇటీవల చేయించిన సర్వేలో తేలింది. అంటే రైతులు, కౌలు రైతులు కలిపి 90 లక్షల మంది ఉన్నారు. ఈ 90 లక్షల కుటుంబాల ఓట్లు రాబోయే ఎన్నికల్లో చాలా కీలకం కానున్నాయి. దీంతో రైతులు, రైతు కుటుంబాలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాయనే ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ మాత్రం రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, వారు తమవైపే ఉన్నారనే ధీమాతో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌.. రైతులను తమవైపు తిప్పుకొనేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌, ఇటీవల తుక్కుగూడలో ప్రకటించిన ఆరు గ్యారంటీలతో.. రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పీఎం-కిసాన్‌, ఎరువుల సబ్సిడీ పథకాలపై విశ్వాసంతో ఉంది. పీఎం-కిసాన్‌ సాయాన్ని 6 వేల నుంచి 8 వేలకు పెంచాలని యోచిస్తోంది.

రైతుబంధుపై సీఎం గురి..

రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికగా బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుంటారు. పంటల సాగుకు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందిపడకుండా ప్రభుత్వమే ఈ పథకం కింద సాయం చస్తుంది. అయితే తొలి ఏడాది ఎకరానికి రూ.8 వేలు ఇచ్చిన సర్కారు.. ప్రస్తుతం రూ. 10 వేలు ఇస్తోంది. అయితే ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. పైగా కాంగ్రెస్‌ పార్టీ ‘రైతు భరోసా’ కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించడంతో.. కేసీఆర్‌ సర్కారు కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఒక పంటకు, ఒక ఎకరానికి ప్రస్తుతం రూ.5 వేలు ఇస్తుండగా, దానిని రూ.7,500 కు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక రైతుబీమా పేరుతో ప్రభుత్వం మరో పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే! రైతులు ఏ కారణంతో చనిపోయినా.. వారి కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. దీంతోపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్నీ కొనసాగించనున్నారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి రెండుసార్లు రుణమాఫీ చేశారు. మరోసారి రుణమాఫీ పథకంపై హామీ ఇస్తారా? లేదా? అనే అంశంపై ఈ నెల 15న ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోతో స్పష్టత రానుంది. అయితే.. రైతులకు విత్తనాల సబ్సిడీని కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎత్తివేసింది. పావలా వడ్డీ-సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయడంలేదు. వ్యవసాయ యాంత్రీకరణకు కూడా చరమగీతం పాడింది. పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలు కావడంలేదు. దీంతో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నష్ట పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా రైతులకు అందడంలేదు. ఈ అంశాలపై మ్యానిఫెస్టోలో స్పష్టత వస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

రైతుభరోసా.. 2 లక్షల రుణమాఫీతో కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. గతంలో వరంగల్‌లో సభ నిర్వహించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ‘రైతు డిక్లరేషన్‌’ ప్రకటించింది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని, పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. తాజాగా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆరు గ్యారంటీలు ప్రకటించింది. ఇందులో రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. అదే క్రమంలో ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు పంపిణీ చేస్తామని కూడా పేర్కొంది. అంతేకాకుండా.. వరి పంటకు మద్దతు ధరపై రూ.500 బోనస్‌ కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ హామీలను, గ్యారంటీలను కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. రైతుల ఓట్లే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

బీజేపీది మరో దారి..

బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో కూడా ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పటివరకు బీజేపీ నేతలు పెద్దగా హామీలు కూడా ప్రకటించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ‘పీఎం- కిసాన్‌’ (ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి) పథకాన్ని రైతుల్లోకి మరింత తీసుకెళ్లాలని ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు అందజేస్తున్న రూ.6 వేల సాయాన్ని రూ.8 వేలకు పెంచే యోచనలో ఉన్నారు. అదే క్రమంలో ఎరువుల సబ్సిడీ ద్వారా రైతులకు ఎంత మేలు కలుగుతుంది? ఒక ఎకరానికి ఎంత సాయం అందుతుంది? అనే వివరాలను రైతులకు విడమరిచి చెప్పాలని నిర్ణయించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభం చేసిన ఘనతను రైతుల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే రైతుబంధు పథకం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే చర్చ ఆ పార్టీ నేత ల్లో ఉండటం గమనార్హం.