Homeక్రీడలుIND vs PAK: విరాట్ పుణ్యమా అని భారత్ లో ఒకరోజు ముందుగానే దీపావళి

IND vs PAK: విరాట్ పుణ్యమా అని భారత్ లో ఒకరోజు ముందుగానే దీపావళి

IND vs PAK:  ఇది కదా ఆట అంటే.. ఇది కదా నరాలు తెగే ఉత్కంఠ అంటే. ఏ బంతికి ఏమవుతుందోనన్న టెన్షన్. మెల్బోర్న్ మైదానంలో 90,000 మంది,, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కోటిన్నర మంది సాక్షిగా విరాట్ కోహ్లీ బ్యాట్ తో తాండవం చేశాడు. ఒక ఎండులో వికెట్లు మొత్తం టపా టపా రాలిపోతుంటే.. హార్దిక్ పాండ్యా తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. చివరి బంతి వరకు పోరాడి భారత జట్టు గెలిపించాడు. పోరాడితే పోయేది ఏముంది డ్యూడ్.. మహా అయితే గెలుస్తాం.. అన్నట్టుగా విజయ స్వర్గాన్ని ముద్దాడించాడు. భారతదేశానికి ఒకరోజు ముందే దీపావళి పండుగ తెచ్చాడు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవ్వలేని కిక్ దాయాది జట్లు ఇచ్చాయి

భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎందుకు ప్రత్యేకమో మరొకసారి ప్రపంచ క్రికెట్ కు తెలిసి వచ్చింది. బంతి బంతికి మారుతున్న సమీకరణాలతో క్రికెట్ అభిమానులకు అసలైన కిక్ లభించింది. టి20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రీడామైదానంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఆసియా కప్ లో విజయం సాధించిన అనంతరం తలపడుతున్న మ్యాచ్ ఇదే కావడంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. అంతకుముందు రాత్రి మెల్బోర్న్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో.. మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకోవాలని భావించి టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అతడి అంచనాలు నిజం చేస్తూ భువనేశ్వర్ కుమార్, హర్షిదీప్ సింగ్ బౌలింగ్ చేశారు. ప్రమాదకరమైన ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజంను హర్షదీప్ సింగ్ పెవిలియన్ బాట పట్టించాడు. అయితే ఈ దశలో మసూద్, అహ్మద్ బాధ్యతాయుతంగా ఆడి ఆప్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాట్స్మెన్ కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 159 పరుగులు చేసింది.

విరాట్ విశ్వరూపం

లక్ష్య చేదనకు దిగిన భారత్ కు ఆశించిన ఆరంభం లభించలేదు. పాకిస్తాన్ యువ బౌలర్ నసీంషా నిప్పులు చెరిగే బంతులు వేయడంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్ పెద్దగా ఆడలేకపోయారు. ఈ దశలో వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూనే స్కోర్ బోర్డును కదిలించారు. కీలకమైన ఐదో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గెలుపు వాకిట్లోకి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా ఒక పేలవమైన షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ దశలో అతడి స్థానంలో వచ్చిన దినేష్ కార్తీక్ ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయాడు. అతడు స్టంప్ అవుట్ అయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ క్రిజ్ లోకి వచ్చి మిగతా లాంఛనం పూర్తి చేశాడు. ఫలితంగా ఇండియా నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. పాకిస్తాన్ పై మ్యాచ్ అంటే వీరవిహారం చూపించే విరాట్ కోహ్లీ ఈసారి కూడా రెచ్చిపోయాడు. ప్రారంభ ఓవర్లలో ఆచితూచి ఆడిన విరాట్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరి ముఖ్యంగా రౌఫ్ బౌలింగ్లో అతడు కొట్టిన వరుస సిక్సర్లు మ్యాచ్ కే హైలైట్. ఒక రకంగా ఆటను ఇవే మలుపు తిప్పాయి. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన విరాట్.. జట్టు విజయంలో మూల స్తంభంగా నిలిచాడు. చివరి వరకు నాటౌట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

చివరిలో నాటకీయ పరిణామాలు

12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన సమయంలో.. విరాట్ బ్యాట్ ఝులిపించడంతో ఒక ఓవర్లో 13 దాకా పరుగులు వచ్చాయి. ఆ సమయంలో పాకిస్తాన్ బౌలర్లు ఒత్తిడికి గురి కావడంతో వరుస వైర్లు వేశారు. చివరి ఓవర్ లో మూడు పరుగులు బైస్ రూపంలో వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరి బంతి వరకు ఆడి విజయం సాధించడం భారత జట్టుకు ఇది తొలిసారి కాదు. 2016లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్ని వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఇదే విధంగా గెలుపొందింది. 2018లో బంగ్లాదేశ్ తో కొలంబోలో జరిగిన ఆర్ పి ఎస్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఇదే విధంగా విజయం సాధించింది. 2018లో చెన్నై వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోనూ బంతి వరకు భారత జట్టు పోరాడి విజయం సాధించింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ లో తాము ఆడబోమంటూ బీసిసిఐ సెక్రటరీ జై షా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పాక్ పై గెలుపొందడంతో బీసీసీఐ లో వర్షం వెల్లువెత్తు తుండగా, పాక్ క్రికెట్ బోర్డులో నైరాశ్యం అలముకుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version