Sudarshan Setu: దేవ భూమి ద్వారకలో “సుదర్శన్ సేతు”.. నేడు ప్రధాని ప్రారంభిస్తున్న ఈ వంతెన విశిష్టతలు ఇవీ

ఇటీవల ఐఎన్ఎస్ షికారా నుంచి నవీ ముంబై కి దేశంలో అతి పెద్దదైన సముద్ర వంతెన "అటల్ సేతు"ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరో అద్భుతానికి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు.

Written By: Suresh, Updated On : February 25, 2024 9:26 am

Sudarshan Setu

Follow us on

Sudarshan Setu: రహదారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సాఫీగా వెళ్లడానికి సహకరిస్తాయి. వంతెనలు దుర్భేద్యమైన ప్రాంతాల నుంచి రాకపోకలు సాధించేందుకు తోడ్పడతాయి. రోడ్లు, వంతెనలు నిర్మించిన ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందేది అందుకే. మన దేశంలో అన్ని ప్రాంతాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని ప్రాంతాలను కలపాలంటే రోడ్డు రవాణా మార్గం సరిపోతుంది. కొన్ని ప్రాంతాలను కలపాలంటే జలాల మీదుగా వంతెనలు నిర్మించాల్సిందే. ఇలాంటి వంతెనలు ఎన్నో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. దీనికోసం 980 కోట్లు ఖర్చు చేసింది. 2.32 కిలోమీటర్ల పొడవుతో దీనిని నిర్మించింది. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన అని కేంద్రం చెబుతోంది. ఇవే కాదు ఈ వంతెనకు సంబంధించి ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి.

ఇటీవల ఐఎన్ఎస్ షికారా నుంచి నవీ ముంబై కి దేశంలో అతి పెద్దదైన సముద్ర వంతెన “అటల్ సేతు”ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరో అద్భుతానికి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారక ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తారు.. దీనిని దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా కేంద్రం అభివర్ణిస్తోంది. ఈ సుదర్శన్ సేతు ప్రత్యేకమైన ఆకృతి కలిగి ఉంది. భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించిన ఫుట్ పాత్ ను నిర్మించారు. రెండు వైపులా శ్రీకృష్ణ భగవానుడి చిత్రాలను ఏర్పాటు చేశారు. ఫుట్ పాత్ పై భాగంలో సౌర శక్తి ప్యానల్స్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక – భేట్ ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేస్తుంది. ప్రయాణ సమయాన్ని చాలా వరకు ఆదా చేస్తుంది. ఈ వంతెన నిర్మించక ముందు భేట్ ద్వారక వెళ్లడానికి భక్తులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. పడవపైనే స్వామి వారి దర్శనానికి వెళ్లేవారు. ఒకవేళ వాతావరణం ప్రతికూలంగా ఉంటే అంతే సంగతులు. ప్రస్తుతం ఈ ఐకానికి వంతెన నిర్మాణం పూర్తి కావడంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి. కాదు దేవ భూమిగా ప్రఖ్యాతి చెందిన ద్వారకలో ఈ ఐకానిక్ వంతెన ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలువనుంది.

Sudarshan Setu

ఈ వంతెన నిర్మాణానికి బిజెపి ప్రభుత్వం కొలువుతీరిన తొలినాళ్లలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆమోదం తెలిపారు. 2016లో దీని నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2017 అక్టోబర్ 7న ఓఖా – భేట్ ద్వారకను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో దీని అంచనా వ్యయం 962 కోట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత దీని వ్యయం 980 కోట్లకు పెరిగింది.. ఈ వంతెన వల్ల లక్షద్వీప్ లో నివసించే సుమారు 8,500 మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ వంతెనను “డెక్ మిశ్రమ ఉక్కు – రీన్ఫోర్డ్స్ కాంక్రీట్” తో నిర్మించారు. దీని వెడల్పు 89 అడుగులు. వంతెనకు ఇరువైపులా 8 అడుగుల వెడల్పు గల ఫుట్ పాత్ నిర్మించారు. ఈ వంతెన మొత్తం పొడవు 7,612 అడుగులు.

Sudarshan Setu

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాతిలో అది – సోమ వారాల్లో పర్యటిస్తారు. దాదాపు 5250 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆదివారం ఉదయం భేట్ ద్వారక ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం సుదర్శన్ సేతును సందర్శించి ప్రారంభించారు. అనంతరం ద్వారకా ధీష్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ద్వారకలో 4150 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి రాజ్ కోట్ ఎయిమ్స్ ను సందర్శిస్తారు..దాంతో పాటు బటిండా, రాయ్ బరేలి, కళ్యాణి, మంగళగిరి ప్రాంతాల్లో నిర్మించిన ఎయిమ్స్ లను జాతికి అంకితం చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా న్యూ ముంద్రా – పానిపట్ పైప్ లైన్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఇవి మాత్రమే కాకుండా ఆరోగ్యం, రోడ్డు, రైలు, ఇంధనం, పెట్రోలియం, సహజవాయువు, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారని సమాచారం.

Sudarshan Setu