https://oktelugu.com/

Nara Lokesh : లోకేష్ వ్యూహాత్మక అడుగులు

మొత్తానికైతే అటు జనసైనికులను, ఇటు నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు లోకేష్ వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇచ్చినట్లే కనిపిస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 2:14 pm
    Follow us on

    Nara Lokesh : నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి సభలను ప్రారంభించారు. ఉత్తరాంధ్రతో పాటు పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాల్లో శంఖారావం సభలు కొనసాగనున్నాయి. అయితే ఈ సభల్లో లోకేష్ వ్యూహాత్మక అంశాలను తెరపైకి తెస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, జనసేన శ్రేణులను మెప్పించడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. ఇవి వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత విషయంలో లోకేష్ చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సైతం పూర్తయిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిజెపి కోసం ఆ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే టిడిపి తన స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే జనసేన శ్రేణులు పవర్ షేరింగ్ కోరుకుంటున్నాయని.. పవన్ సీఎం అయితేనే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందని భావిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రమే సీఎం అవుతారని తేల్చేశారు. దీంతో ఈ కామెంట్స్ పై జనసేన శ్రేణులు మండిపడ్డాయి. కాపు సామాజిక వర్గం రియాక్ట్ అయ్యింది. పెను దుమారానికి దారితీసింది.

    అయితే ప్రస్తుతం లోకేష్ శంఖారావ సభలు కొనసాగుతున్నాయి. మొన్నటి ఎపిసోడ్ ను గుర్తు చేసుకున్న లోకేష్ పవన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తనకు, తన కుటుంబానికి పవన్ అండగా నిలిచిన విషయాన్ని సభల్లో గుర్తు చేస్తున్నారు. జనసేనతో టిడిపి పొత్తు చిరకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని లోకేష్ ఆరోపణలు చేయడం విశేషం. ఇదంతా జనసైనికుల కోసమేనని.. పొత్తు విషయంలో కరెక్ట్ గా ఉన్నామని సంకేతాలు పంపించేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.

    ఇప్పటికే వైసీపీ సర్కారుపై ఉపాధ్యాయులు,ఉద్యోగులు,నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ సైతం వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. నిరుద్యోగులకు మాట ఇచ్చి జగన్ తప్పారని.. దారుణంగా మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారని.. అధికారానికి వచ్చిన తర్వాత 6000 పోస్టులకు తగ్గించారని.. ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ ప్రశ్నిస్తున్నారు. టిడిపి, జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇస్తున్నారు. నిరుద్యోగ యువతని ఈ ప్రకటన ఆకట్టుకుంటోంది. మొత్తానికైతే అటు జనసైనికులను, ఇటు నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు లోకేష్ వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇచ్చినట్లే కనిపిస్తున్నాయి.