Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం జన సందోహంగా మారింది. బుధవారం రాత్రి గద్దెలపైకి సారలమ్మ రానున్నారు. మంగళవారం జంపన్న ను గద్దె పైకి తీసుకొచ్చారు. అంతకుముందు సమ్మక్కకు, పగిడిద్దరాజుకు ఆరెం వంశీయులు ఘనంగా కళ్యాణం జరిపించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సారలమ్మను గద్దె పైకి తీసుకురానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు వస్తున్న క్రమంలో ప్రభుత్వం కూడా సకల సౌకర్యాలు కల్పించింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారమ్మ జాతర ప్రాశస్త్యం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం సారలమ్మ గద్దె పైకి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ” గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ మేడారం జాతర ఒకటి. సమాజ స్ఫూర్తి, భక్తి, సంప్రదాయం వంటి గొప్ప కలయికతో ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్కకు వందనం చేద్దాం. వారు ప్రదర్శించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. ఈ జాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21 నుంచి మొదలవుతుంది. సమ్మక్క సారక్క వనాన్ని వీడి గద్దెలపై కొలువు తీరుతారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొక్కుబడులు, నిలువెత్తు బంగారం సమర్పణ వంటి పూజా క్రతువులతో ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొక్కులు, దర్శనం కోసం వచ్చే భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం జనసంద్రంగా మారుతాయి. ఫిబ్రవరి 24 వరకు ఈ మహా జాతర కొనసాగుతుంది.
గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు…
— Narendra Modi (@narendramodi) February 21, 2024