Sri Lanka vs Bangladesh : మూడు పరుగులతో ముప్పు తప్పింది.. లేకుంటే బంగ్లా చేతిలో లంకా దహనమయ్యేదే

శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బంగ్లాదేశ్ ఓడిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ 7, 8 వికెట్లను కేవలం 17 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం. ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ అసలంక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇక రెండవ టి20 బుధవారం బంగ్లాదేశ్లో జరగనుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 4, 2024 10:49 pm
Follow us on

Sri Lanka vs Bangladesh : మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుపై శ్రీలంక జట్టు విజయం సాధించింది. సోమవారం బంగ్లాదేశ్ లోని సైల్ హెట్ స్టేడియంలో జరిగిన తొలి t20 లో శ్రీలంక జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టి20 సిరీస్ లో 1-0 తేడాతో ముందంజ వేసింది. చివరి వరకు ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్.. అభిమానులకు అసలు సిసలైన టి20 మజా అందించింది. ఒత్తిడిలో బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో శ్రీలంక విజయం సాధ్యమైంది. లేకుంటే బంగ్లాదేశ్ వేదికగా లంకా దహనం జరిగేదే.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు.. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్( 36 బంతుల్లో 59), సమర విక్రమ (48 బంతుల్లో 61), కెప్టెన్ అసలంక (21 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ అసలంక చివరిలో దూకుడైన బ్యాటింగ్ కొనసాగించాడు. అతడు కేవలం 21 బంతులు ఎదుర్కొని 42 పరుగులు చేశాడు. అందులో ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లాం, అహ్మద్, హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే బంగ్లాదేశ్ బౌలర్లు ఎక్ ట్రా ల రూపంలోనే 19 పరుగులు ఇవ్వడం విశేషం.

అనంతరం 207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించింది. 68 పరుగులకు లిటన్ దాస్(0), సౌమ్య సర్కార్ (12), షాంటోయ్(20), హృదోయ్(8) నిరాశపరచడంతో 68 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో మహమ్మదుల్లా (54), జాకీర్ అలీ(68) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ స్కోరు పరుగులెత్తింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 47 పరుగులు జోడించారు. 115 పరుగుల వద్ద మహమ్మదుల్లా ఐదో వికెట్ గా వెనుదిరిగిన తర్వాత.. క్రీజ్ లోకి మహేది హసన్ వచ్చాడు. హసన్ తో కలిసి జాకిర్ అలీ శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 75 పరుగులు జోడించారు. వీరి బ్యాటింగ్ చూస్తే బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించేలా కనిపించింది. 17.5 ఓవర్ వద్ద తీక్షణ బౌలింగ్లో హసన్(16) క్యాచ్ అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ శ్రీలంక చేతిలోకి వచ్చింది. అప్పటికి బంగ్లాదేశ్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు. చివరి రెండు ఓవర్లలో బంగ్లాదేశ్ విజయానికి 27 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటికి జాకీర్ అలీ క్రీజ్ లో ఉన్నప్పటికీ.. అతడికి సహచర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడం.. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. బంగ్లాదేశ్ ఓడిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ 7, 8 వికెట్లను కేవలం 17 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం. ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ అసలంక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇక రెండవ టి20 బుధవారం బంగ్లాదేశ్లో జరగనుంది.