Sankranthi Kodi Pandalu: కోడిపందెం అంటే… రెండు కోళ్లు బిర్రులో హోరాహోరీగా పోట్లాడుకోవడం… కాళ్లకు కట్టిన కత్తులు కుత్తుకలు తెగ కోస్తున్నా వెనకడుగు వేయకపోవడం.. ప్రత్యర్థి పారిపోవడమో లేదా వీరమరణం పొందే దాకా ఇంకో కోడి వదిలిపెట్టదు. స్వతహాగా శాంతస్వభావులైన కోళ్లల్లో ఇంతటి కోపం రగలాలి అంటే దాని వెనుక ఎంత శిక్షణ ఉండాలి? కోడి ఆ స్థాయిలో బలిష్టంగా ఉండాలంటే ఏ స్థాయిలో దానికి ఆహారం పెట్టి ఉండాలి? ఈరోజు సంక్రాంతి సందర్భంగా పందాలకు కోళ్లను ఎలా సిద్ధం చేస్తారు? అవి పందాలకు పనికొస్తాయని ఎలా గుర్తిస్తారు? వాటికి ఎలాంటి ఆహారం ఇస్తారు? వీటిపై ప్రత్యేక కథనం.

ఇలా గుర్తిస్తారు
కోడిపందాలకు కోడిపుంజులను మాత్రమే ఎంచుకుంటారు.. నల్లని ఈకలు ఉంటే దానిని “కాకి” అంటారు.. తెల్లని ఈకలు ఉంటే దానిని “సేతు” అంటారు. మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దానిని “పర్ల” అని పిలుస్తారు. శరీరం నల్లగా ఉండి, రెండు లేదా మూడు ఈకలు ఉంటే దానిని “కొక్కి రాయి” అంటారు. ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే దాన్ని “డేగ” అని పిలుస్తారు.. రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు.. మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని పిలుస్తారు.. ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటే దానిని “మైల” అంటారు.. ఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో ఉంటే దానిని “పూల” అంటారు. రెక్కలు ఎక్కువ తెలుపు రంగులో ఉంటే దానిని “పింగళ” అని పిలుస్తారు. నలుపు, గోధుమ రంగులో ఉంటే దానిని “నల్ల బోర” అని పిలుస్తారు. ముంగిస జూలురంగులో ఈకలు ఉంటే దానిని “ఎర్ర పొడ” అని పిలుస్తారు.. బంగారు రంగులో ఈకలు ఉంటే “అబ్రాసు” అంటారు.. లేత ఎరుపు రంగులో ఈకలు ఉంటే “గేరువా” అంటారు.
ఇలా పెంచుతారు
ఈకల ఆధారంగా కోడిపుంజులను గుర్తించిన తర్వాత వాటిని కోళ్ల నుంచి వేరు చేస్తారు. ప్రత్యేకమైన ప్రాంతాల్లో పెంచుతారు.. పామాయిల్ తోటలు, మామిడి తోటల్లో షెడ్లు వేసి వాటిని సాకుతారు.. ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయిస్తారు. ఉదయం వాకింగ్ చేయించిన అనంతరం పిస్తా, బాదం, అక్రూట్ దాణాగా పెడతారు. మధ్యాహ్నం తృణధాన్యాలతో చేసిన దాణా పెడతారు.. సాయంత్రం స్నానం చేయించిన అనంతరం మళ్లీ ఎండు ఫలాలతో కూడిన దాణా ఆహారంగా ఇస్తారు.. అనంతరం కొద్దిగా కొంచెం మద్యాన్ని కూడా పోస్తారు. వారంలో ఒకసారి కుసుమ నూనెతో మర్దన. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిపుంజులను వదిలిపెట్టరు.. వేరే వేరే స్టాండ్లు తయారుచేసి ఉంచుతారు.. ఒకవేళ కోడి సంతతి కావాలి అనుకుంటే పెట్టతో కలయిక చేపడుతారు..

పందానికి ఇలా సిద్ధం చేస్తారు
కోడి పుంజులు విడివిడిగా పెరగడం వల్ల ఒక రకమైన కోపంతో ఉంటాయి.. పైగా ఎదుటి కోడిని చూడగానే మీద పడి రంకెలు వేసే విధంగా తయారవుతాయి.. దీంతోపాటు కోడిపుంజులు పెంచేవారు సంకేతాలు ఇవ్వడంతో వాటిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇలా తర్ఫీదు ఇచ్చిన అనంతరం పందాలకు తీసుకెళ్తారు.. మిగతా కోళ్లకు పందాలను చూపిస్తారు. దీని వల్ల మిగతా కోళ్లకు కూడా పౌరుషం పెరుగుతుంది.. ఇదీ కోడిపందాల వెనుక ఉన్న చరిత్ర.