క‌రోనా మ్యారేజెస్ః నో సౌండ్.. ఓన్లీ యాక్ష‌న్‌!

జీవితంలో వ‌చ్చే అత్యంత పెద్ద పండుగ పెళ్లి. ఏ వేడుక అయినా దాని త‌ర్వాతే! అందుకే.. సంబ‌రాలు అంబ‌రాన్నంటిపోతాయి. సంతోషాలు ఎవ‌రెస్టును తాకుతాయి. ఎంత పేద‌లైనా.. త‌మ‌కున్న స్థాయిలో ఘ‌నంగా పెళ్లి వేడుక జ‌రుపుకుంటారు. బంధుమిత్ర గ‌ణాన్ని స‌కుటుంబ స‌ప‌రివారంగా పిలిచి సంద‌డి చేస్తారు. అలాంటి వేడుక‌ను.. న‌లుగురి న‌డుమ ‘‘మ‌మ‌’’ అనిపించేయమంటోంది కరోనా. కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైన‌వారు.. ఇంకా ఏవేవో కార‌ణాలు ఉన్న‌వారు కొవిడ్ […]

Written By: Bhaskar, Updated On : May 17, 2021 3:15 pm
Follow us on


జీవితంలో వ‌చ్చే అత్యంత పెద్ద పండుగ పెళ్లి. ఏ వేడుక అయినా దాని త‌ర్వాతే! అందుకే.. సంబ‌రాలు అంబ‌రాన్నంటిపోతాయి. సంతోషాలు ఎవ‌రెస్టును తాకుతాయి. ఎంత పేద‌లైనా.. త‌మ‌కున్న స్థాయిలో ఘ‌నంగా పెళ్లి వేడుక జ‌రుపుకుంటారు. బంధుమిత్ర గ‌ణాన్ని స‌కుటుంబ స‌ప‌రివారంగా పిలిచి సంద‌డి చేస్తారు. అలాంటి వేడుక‌ను.. న‌లుగురి న‌డుమ ‘‘మ‌మ‌’’ అనిపించేయమంటోంది కరోనా.

కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైన‌వారు.. ఇంకా ఏవేవో కార‌ణాలు ఉన్న‌వారు కొవిడ్ టైమ్ లోనూ పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వారి వారి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటున్న ప్ర‌భుత్వాలు.. ప‌లు ఆంక్ష‌ల మ‌ధ్య పెళ్లిళ్ల‌కు అనుమ‌తులు ఇస్తున్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తి ప్ర‌కారం.. పెళ్లి వేడుక‌లో వ‌ధూవ‌రుల‌తో క‌లిపి 50 మందికి మించి క‌న‌ప‌డ‌కూడ‌దు.

అయితే.. ఈ నిబంధ‌నపై జ‌నం పెద్ద‌గా అభ్యంత‌రం కూడా చెప్ప‌ట్లేదు. కార‌ణం.. ప్ర‌జ‌లు కూడా గ‌తంలో మాదిరిగా పెళ్లిళ్లు, వేడుక‌లకు హాజ‌ర‌య్యేందుకు సిద్దంగా లేక‌పోవ‌డ‌మే. మే నెల మొద‌లైన త‌ర్వాత ప‌రిస్థితుల్లో మ‌రింత మార్పు వ‌చ్చింది. దేశంలో ల‌క్ష‌లాది కేసులు, వేలాదిగా మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌డంతో.. ఎవ్వ‌రూ పెద్ద‌గా ధైర్యం చేయ‌ట్లేదు. ఇవాళ, రేపు పెళ్లికి వెళ్ల‌డం అనేది సాహ‌స చ‌ర్య‌గానే భావిస్తున్న జ‌నాలు.. అంత అవ‌స‌రం ఉందా? అని ఆలోచిస్తున్నారు. మ‌నం వెళ్లినా వెళ్ల‌క‌పోయినా.. పెళ్లి మాత్రం ఆగ‌ద‌ని మిన్న‌కుంటున్నారు.

బంధుమిత్రుల హాజ‌రుపై అభిప్రాయాలు ఎలా ఉన్నా.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు మాత్రం ఓ విధంగా సంతోషంగానే ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంత సింపుల్ గా పెళ్లి జ‌రిపించాల‌ని అనుకున్నా.. నాలుగైదు ల‌క్ష‌ల‌కు త‌క్కువ‌గా ఖ‌ర్చు కాదు. అలాంటిది ప‌ది ఇర‌వై మందితో పెళ్లి తంతు ముగుస్తుండ‌డంతో.. ఆ మొత్తం మిగిలిపోతోంది. అప్పుల భారం మోయాల్సిన ప‌నిలేకుండానే కార్యం గ‌ట్టెక్కుతోంద‌ని నిట్టూర్చేవాళ్లు కూడా ఉన్నారు.

మొత్తానికి కొంచెం ఇష్టం.. కొంచెం క‌ష్టం అన్న‌ట్టుగా ఉంది పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి పెళ్లిళ్ల ప‌రిస్థితి. ఇక‌, ధ‌న‌వంతుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డ‌బ్బుకు లోటులేని వాళ్లు.. బ్యాండ్ బాజా బ‌రాత్ లేద‌ని, డీజే డ్యాన్స్ మిస్స‌య్యింద‌ని కూడా బాధ‌ప‌డుతుంటారు. మొత్తానికి.. క‌రోనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో రీసౌండ్ లేకుండా.. కొన్ని చోట్ల సౌండ్ అన్న‌దే లేకుండా పెళ్లి తంతు ముగిసిపోతోంది.