Smart Meters: ఏపీ ప్రజలు ఆలస్యంగా కరెంటు బిల్లు కడతామంటే కుదరదు ఇక. ఏ నెలకు అనెల విద్యుత్ బిల్లులు ఇక ముందుగానే చెల్లించుకోవాలి. సెల్ ఫోన్ మాదిరిగా ఎంత రీచార్జ్ చేస్తే అంతే వినియోగమన్న మాట. జగన్ సర్కారు త్వరలో స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి తేనుంది. ఇప్పటికే వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చింది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చినా.. అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. తాను అనుకున్నట్టు పంపుసెట్లకు మీటర్లు మిగించింది. ఇప్పుడు ఇతర గృహ, వాణిజ్య, పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు విస్తరించే పనిలో ఉంది. 2025 నాటికి అన్నిరకాల వినియోగదారులకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న కృతనిశ్చయంతో జగన్ సర్కారు అడుగులు వేస్తోంది.దీనిపై విపక్షాలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. దీంతో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఖాయంగా తేలుతోంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా మొండిగా ముందుకెళ్లేందుకే జగన్ సర్కారు నిర్ణయించింది.

2025 నాటికి దేశ వ్యాప్తంగా అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకత కనబరచాయి. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు ఇది రైతుల మెడలో కత్తి కట్టడమేనని భావించి బాహటంగానే తప్పుపట్టాయి. తాము అమలుచేయలేమని తేల్చిచెప్పాయి. అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం సమ్మతించలేదు. జగన్ సర్కారు మాత్రం కేంద్ర ప్రభుత్వ చర్యలను ఆహ్వానించింది. దీనికి కారణం కొన్ని రకాల రాయితీలు, అప్పులకు అనుమతులు రావన్న భయంతో జగన్ సర్కారు తలుపింది. అత్యుత్సాహంతో దేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ మీటర్ల యోచనను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అమలు చేస్తోంది. అటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు సైతం స్మార్ట్ మీటర్లు అంటగట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో 1.5 కోట్ల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లు దాదాపు 20 లక్షల వరకూ ఉన్నాయి. వీటికి ఇప్పటికే స్మార్ట్ మీటర్లు వచ్చేశాయి. మిగతా 1.30 కోట్ల మీటర్లకు సంబంధించి స్మార్ట్ మీటర్లు అవసరమని ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు, తరువాత 200 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులకు, 300 యూనిట్లు దాటిన వాణిజ్య సంస్థలకు, పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది ప్రభుత్వ వ్యూహం. అందుకు తగ్గట్టుగానే జగన్ సర్కారు పావులు కదుపుతోంది. 2025 నాటికి పూర్తిస్థాయి స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. విద్యుత్ ద్వారా ఆదాయం రెట్టింపు చేసుకోవడమే అభిమతంగా కనిపిస్తోంది.

స్మార్ట్ మీటర్ల వినియోగంతో ఉచిత విద్యుత్ కు జగన్ సర్కారు మంగళం పాడనుంది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉచిత విద్యుత్ పథకంపైనే తొలి సంతకం చేశారు. రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేశారు. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత పథకాన్ని కొనసాగించాయి. కానీ తొలిసారిగా ఆయన కుమారుడు జగనే బ్రేక్ చేస్తున్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి అభిమానులకు సైతం రుచించడం లేదు. అటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాదాపు ఉచిత విద్యుత్ ను సామాన్యులకు దూరం చేసినట్టే..