TRS MLAs Purchase Case -BJP: ఫామ్‌హౌస్ ఫైల్స్, నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. ముగ్గురు నిందితులను విచారణ చేసిన సిట్ ఇన్‌చార్జి సీవీ.ఆనంద్ విచారణ చేశారు. ఆ తర్వాత వీరితో సబంధం ఉందని బీజేపీ ముఖ్యనేతలకు సిట్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు మొన్న నోటీసులు ఇచ్చింది. తాజాగా బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా పేరున్న బీఎల్.సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీ జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కీలకంగా ఉన్న బీఎల్.సంతోష్‌కు 41ఏ నోటీసులు ఇవ్వటం సాధారణమైన విషయం కాదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారనే అభయోగాలతో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు బీఎల్.సంతోష్ పేరు ప్రస్తావించడం గమనార్హం.

తరువాత ఎవరు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులుగా ఉన్న ముగ్గురు నెంబర్ 1, నెంబర్ 2 కూడా సంతోష్ ఇంటికి వచ్చి చర్చలు చేస్తారంటూ చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఈనెల 21న విచారణకు రావాలంటూ బీఎల్.సంతోష్‌కు నోటీసులు జారీ చేసింది. అందులో ఫోన్ నంబర్ తో సహా సూచించింది. సహకరించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో బీఎల్.సంతోష్‌తోపాటుగా బండి సంజయ్ కు సన్నిహితుడుగా పేరున్న శ్రీనివాస్ రామచంద్రభారతికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడని నోటీసులు అందాయి. ఈ ఇద్దరి నోటీసులు రద్దు చేయాలని, వీరికి కేసుతో సంబంధం లేదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.
జాతీయస్థాయిలో చర్చ..
బీఎల్.సంతోష్‌కు నోటీసులు ఇవ్వటం ద్వారా ఈ కేసులో ఏ స్థాయికి అయినా వెళ్లాలని డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. బీఎల్ సంతోష్ బీజేపీ వ్యవహారాల్లో కీలక పాత్రో పోషించే వ్యక్తే అయినా.. ప్రచారానికి దూరంగా ఉంటారు. కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా ఉన్న రామచంద్ర భారతి నోటీ నుంచి ఆడియో.. వీడియోల్లో పలు మార్లు సంతో‹ష్ పేరు ప్రస్తావనకు వచ్చింది. హైకోర్టులో రిలీఫ్ దొరక్కుంటే బీఎల్.సంతోష్ సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, బీఎల్ సంతోష్ విషయంలో సిట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది. అయితే, ఇప్పుడు సంతోష్ తరువాత ఇంకా లిస్టులో ఎవరున్నారు.. ఇంకా నోటీసులు ఎవరికైనా జారీ అవుతాయా అనేది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ చెప్పినట్లుగా సిట్ విచారణ?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ మొత్తం కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన విధంగానే నడవడం అనుమానాలకు తావిస్తోంది. మీడియా సమావేశంలో కేసీఆర్ ఏ పేర్లు చెప్పారో.. సిట్ వారికే నోటీసులు ఇస్తోంది. బీజేపీ పెద్దల టార్గెట్‌గానే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు స్కెచ్ వేసినట్లు అందరికీ అర్థమవుతోంది. ఆడియో కాల్స్ పేరిట రిలీజ్ చేసిన ఆడియోలు మొత్తం ఫోన్ ట్యాపింగ్ రికార్డులని స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. కేసీఆర్ బీజేపీని దెబ్బకొట్టేందుకే చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అర్థమవుతోంది. ఆడియోలో.. ముగ్గురు నిందితుల కంటే.. పైలట్ రోహిత్ రెడ్డి.. తానే స్వయంగా పార్టీ మారాలనుకుంటున్నట్లు.. తనతోపాటు మరో ముగ్గురిని తీసుకొస్తామని స్పష్టంగా ఉంది. అయినా సిట్ ఎమ్మెల్యేలను, వారికి నేతృత్వం వహించిన పైలట్ రోహిత్‌రెడ్డిని సిట్ విచారణ చేయకుండా.. వారి ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా.. కేవలం బీజేపీ టార్గెట్‌గానే సిట్ నోటీసులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

కేసీఆర్ డైరెక్షన్‌లోనే..
సిట్ విచారణ మొత్తం సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఫామ్‌హౌస్ కేసులో.. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు కోర్టులో హాజరు పర్చారు. నిందితులకు ఇచ్చే 41ఏ నోటీసులు ఆడియోలో పేర్లు ఉన్న సంతోష్‌కు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసిన సమయంలోనే సీఎం కేసీఆర్ ఈ విషయంలో ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. ఈ దిశగానే విచారణ జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో హైదరాబాద్ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.