YS Sharmila: వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. తన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని టాక్ నడుస్తోంది. రాహుల్ గాంధీ జన్మదినం నాడు ఆమె చేసిన ట్విట్ తో ఈ ఊహాగానాలను మరింత బలం చేకూర్చారు. షర్మిళ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు చర్చలు పూర్తయ్యాయని.. చేరడమే తరువాయి అని.. జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు కీలక ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు షర్మిళ పునరాలోచనలో పడినట్టు సమాచారం. కాంగ్రెస్ తో పొత్తు వరకూ ఒకే కానీ.. విలీనం విషయంలో కాస్తా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
షర్మిళ సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలన్న విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో పనిచేయాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. కానీ దానికి ఆ పార్టీ నేతలే అడ్డు తగులుతున్నారు. తెలంగాణలో కావాల్సిన నాయకులు ఉన్నారని.. ఆమె సేవలు ఏపీకే అవసరమని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గం ఆమె రాక విషయంలో అభ్యంతరాలు తెలుపుతోంది. అటు హైకమాండ్ సైతం రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమె ఏపీ రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటోంది.అయితే తాను తెలంగాణలో పార్టీ పెట్టాను కనుక తుది వరకూ తెలంగాణలో ఉంటానని తేల్చి చెబుతున్నారు.
ఇప్పటికే ఆమె తరుపున కర్నాటకు చెందిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ఆపై తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సపోర్టు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జానారెడ్డితో ఆమె భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఉండేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడి నేతల మద్దతు కూడగడుతున్నారు.కానీ మెజార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఏపీకి పంపించాలని హైకమాండ్ కు సూచిస్తున్నారు.
తాజాగా తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ ఇదే విషయమై లోకల్ నాయకులతో చర్చించినట్టు సమాచారం. గతంలో చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడంతో బీఆర్ఎస్ కు అవకాశమిచ్చినట్టే.. ఇప్పుడు షర్మిళతో అదే జరుగుతుందని నేతలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏపీకి పంపితే ఉత్తమమని ఎక్కువ మంది నేతలు తమ అభిప్రాయాలను హైకమాండ్ వద్ద కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. అందుకే షర్మిళ కాంగ్రెస్ లో చేరిక, పార్టీ విలీన ప్రకటనలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.