Shah Gupta Rafique: ఆమె జీవితం ఓ గొంగళి పురుగు లాంటిది. నేడు ఆమె అందమైన ‘సీతాకోక చిలుక’లా కనిపించొచ్చు. కానీ, ఆ అందమైన ఆమె జీవితం వెనుక.. హేయమైన గొంగళి పురుగుల గాధ ఉంది. దేవుడు.. భరించే వారికే భాద్యతలని, కష్టించే వారికే కన్నీళ్లను, సహించే వారికే సమస్యలనీ పరిచయం చేస్తాడు అంటారు. ఇవన్నీ ఆమె దాటుకుని వచ్చింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా ఎలా పరిణీతి చెందుతుందో.. అలాగే ఆమె కూడా వ్యభిచార రొంపలో నుంచి నేడు బాలీవుడ్ నే ఏలే స్థాయికి ఎదిగింది.

ఆమె పేరు ‘షగుఫ్తా రఫీక్’. ఆమె నిజ జీవితాన్ని పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నారు. ఈ పేరే ఎప్పుడు వినలేదు, ఇంతకీ ఎవరు ఈమె ? అని నెటిజన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కొందరు ఆమె జీవితం గురించి విని ఆశ్చర్యపోతున్నారు. అవును, ఆమె గురించి వింటే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎందుకంటే.. ఆమె జీవితం సినిమాకి మించిన డ్రామా.
Also Read: Krishna Vamsi Khadgam Movie: ఆ దర్శకుడితో సంగీత బెడ్ రూమ్ సీన్.. కృష్ణవంశీ టార్గెట్ అదేనా ?
షగుఫ్తా రఫీక్ కు అసలు తన అమ్మనాన్న ఎవరో కూడా తెలియదు. పసికందుగా ఉన్నప్పుడే, ఆమె తల్లి షగుఫ్తా రఫీక్ ను గోడ మీద వదిలేసింది. అది చూసిన ఓ పెద్దావిడ షగుఫ్తా రఫీక్ ను చేరదీసింది. ఐతే, ఆ పెద్దావిడ ఆసరా ఇచ్చింది గానీ, అమ్మ కాలేకపోయింది. అన్నం పెట్టింది గానీ, అమ్మ ప్రేమను పంచ లేకపోయింది.

ఎన్నో కష్టాలు అవమానాలు అనంతరం ‘షగుఫ్తా’ బార్ డ్యాన్సర్ గా అవతారం ఎత్తింది. దాదాపు పదేళ్లు పాటు ఆమె బార్ డ్యాన్సర్ గా పని చేసింది. అర్ధరాత్రి తాగిన మత్తులో ఎందరో ఆమె పట్ల అతి దారుణంగా ప్రవర్తించేవారు. జీవితంపై విరక్తి చెందింది. ఓ దశలో చనిపోవాలని నిర్ణయించుకుంది. ధైర్యం సరిపోలేదు.
అప్పుడే, ఆమె జీవితంలో విక్రమ్ అనే యువకుడు వచ్చాడు. ప్రేమిస్తున్నా అన్నాడు, నమ్మేసింది. ఆ తర్వాత రోజూ డబ్బులు కావాలని వేధించే వాడు. అతని కోసం ‘షగుఫ్తా రఫీక్’ వ్యభిచారం కూడా చేసింది. అలా తన కుటుంబాన్ని తనను తాను పోషించుకుంది. ఎన్నో చీకటి రాత్రుల్లో భరించలేని బాధలు అనుభవించిన ఆమెకు లోకం తీరు అర్ధం అయ్యింది.

లోకాన్ని చదివిన ఆమెలో ఓ రచయిత్రి పుట్టుకొచ్చింది. కథలు రాయడం మొదలు పెట్టింది. కానీ, ఏ నిర్మాత, ఏ దర్శకుడు ఆమె కథలు వినడానికి ముందుకు రాలేదు. ఆమె రచనలు ఎవ్వరూ తీసుకోలేదు. పుట్టిన క్షణం నుంచి ఆమె కన్నీళ్లు కష్టాలు మాత్రమే అనుభవించింది. ఆమె బాధలు చూసి దేవుడు కూడా చలించ పోయినట్టు ఉన్నాడు. ఆమెకు కాలం కలిసొచ్చేలా పరిస్థితులు మారాయి.

నేడు హిందీ తెర పై ఆమె ఒక వెలుగు వెలుగుతుంది. ఆమె వరుసగా ‘ఓ లాంహే, మర్డర్ 2, రాజ్ 3, జన్నత్ 2 వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసింది. అలాగే తెలుగులో కూడా ‘నీజతగా నేనుండాలి’ అనే చిత్రానికి కూడా ఆమె రచన చేసింది. ప్రస్తుతం ఆమె కథే సినిమా కథగా రాబోతుంది. ‘షగుఫ్తా రఫీక్’ బయోగ్రఫీకి మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించని దాన్ని చూడటానికి మనసు కావాలి అని ‘షగుఫ్తా రఫీక్’ ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఓ సందర్భంలో ఆమె తన గురించి చెబుతూ.. ‘రోడ్ల మీద తిండిలేక ఫుట్ ఫాత్ మీద పడుకున్న రోజుల్లో.. పోలీసులు నా పై పడి కోరికలు తీర్చుకునే వారు. కానీ.. చిల్లర దొంగలు మాత్రం నా కడుపు నింపేవారు. ఇదే నిజమైన మన సమాజం’ అని షగుఫ్తా ఎమోషనల్ అవుతూ చెప్పారు. కింద పడకపోవడం కాదు. పడిన ప్రతిసారీ తిరిగిలేవడమే గొప్ప అని షగుఫ్తా నిరూపించింది.
Also Read:Nagarjuna: ఆయన వల్లే నాగార్జున కొన్ని వేల కోట్లు కూడబెట్టారట.. సంచలన నిజాలు!