Bangalore Floods-KTR: బీజేపీని సమయం సందర్భం చూసి కొట్టడంలో తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు ముందుంటున్నారు. గతంలో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బీజేపీ నేతలు చేసిన యాగీ అంతా ఇంతాకాదు.. మోడీ, అమిత్ షా నుంచి కర్ణాటక, మహారాష్ట్ర బీజేపీ నేతలు, ఇతర కేంద్రమంత్రులు కేసీఆర్ సర్కార్ ను తిట్టిపోశారు. ఇప్పుడు టైం టీఆర్ఎస్ నేతలకు వచ్చింది. అందుకే కేటీఆర్ రెచ్చిపోయారు. వరదలతో మునిగిన బెంగళూరు ఫొటోలు, వీడియోలు చూపిస్తూ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఆ వరదల్లో కడిగిపారేస్తున్నారు. వరదలతో మునిగి బెంగళూరువాసులు చస్తుంటే.. ఈనేతలమే బురద రాజకీయం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

దేశంలోనే అతిపెద్ద ఐటీ సిటీ బెంగళూరును వరదలు ముంచేశాయి. వరదలతో నగరం అతలాకుతలం అవుతోంది. వీధులన్నీ నీట మునిగాయి. ఏకధాటిగా మూడు అడుగుల మేర కొట్టిన వర్షానికి ఇళ్లు, ఆఫీసుల్లోకి వరదనీరు వచ్చి చేరింది. పోయే దారి లేక అలానే నీళ్లు నిలవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగళూరు వరద కష్టాలు ట్విట్టర్ లో వైరల్ అవుతుండడంతో మంత్రి కేటీఆర్ వాటిని ట్వీట్ చేసి అక్కడి బీజేపీ ప్రభుత్వ అసమర్థత, కేంద్రం తీరును కడిగేశారు.
బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళుతున్న దుస్థితి నెలకొంది. నగరమంతా మోకాలు లోతు నీరు చేరి ఉంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి అక్కడి పరిస్థితికి బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపలేదని.. అందుకే ఇలాంటి వరదలను తట్టుకోలేదని అన్నారు. గతంలో హైదరాబాద్ వరదలను ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు వారి పరిపాలనలోని బెంగళూరు మునిగితే మాట్లాడాలని కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. అభివృద్ధిలో మార్పులు, నగర ప్రణాళికలు వేసుకోవాలని.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు.

బెంగళూరు వరదలపై కేటీఆర్ వరుస ట్వీట్లకు కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదతో మునిగి బెంగళూరువాసులు ఏడుస్తుంటే మీ ఎద్దేవా చేసుడు ఏంటని నిలదీస్తున్నారు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే హైదరాబాద్ రోడ్లను ముందు బాగుచేయండి అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్ల దుస్తితి గురించి మొదట మాట్లాడాలంటూ రీట్వీట్లతో కౌంటర్లు ఇస్తున్నారు.