PM Modi In Lakshadweep: కొత్త ఏడాది 2024 ప్రారంభంలో ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు లక్షద్వీప్‌లో పర్యటించారు. జనవరి 2, 3వ తేదీల్లో లక్ష్యద్వీప్‌లోనే ఉన్న మోదీ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో ఆయన ఎక్కువ సమయం ప్రకృతి అందాలను వీక్షించేందుకు, ప్రపంచానికి తెలియజేయడానికే ఆసక్తి చూపించారు. తర్వాత తన పర్యటన వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సముద్రంలో స్నార్కెలింగ్ చేయడం, సముద్ర అలల అంచున కూర్చీ వేసుకుని కూర్చోవడం, నడుచుకూంటూ వెళ్లడం వంటి ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్ష్యద్వీప్ అందాలు, ప్రజలు చూపించిన ప్రేమ తనను ఎంతో ఆకర్షించాయని మోదీ తెలిపారు. సాహసాలు చేయాలనుకునేవాళ్లు లక్ష్యద్వీప్‌కు రావాలని సూచించారు. లక్ష్యద్వీప్ దీవులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయని తెలిపారు.
పర్యటన ఎజెండా వేరే.. ?
అయితే మోదీ లక్ష్యద్వీప్ పర్యటన ప్రధాన ఎజెండా వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. దేశంలో పర్యాటక రంగాన్ని మరింత పెంచడం, పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మోదీ లక్ష్యద్వీప్‌లో రెండు రోజులు పర్యటించారని వార్తలు వస్తున్నాయి. మన దేశంలో ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చాటేందుకు మోదీనే టూరిజం అంబాసిడర్‌గా మారిపోయారని పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఆయన లక్ష్యద్వీప్‌లో పర్యటించారని తెలుస్తోంది.
మాల్దీవులకు వెళ్లకుండా..
మన దేశంలోని సెలబ్రిటీలు, వ్యాపారులు, పర్యాటకులు ఎక్కువగా మాల్దీవులకు వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ.. మన దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తేవడానికి ఆయన లక్ష్యద్వీప్‌లో పర్యటించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాల్దీవుల ప్రధాన ఆదాయం టూరిజమే. ఈ క్రమంలో భారతీయ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకుండా చేసేందుకే మోదీ లక్ష్యద్వీప్ పర్యాటకులను ఆకట్టుకునేలా పర్యటించారని తెలుస్తోంది. తద్వారా మాల్దీవులకు వెళ్లే ఆదాయం భారత్‌కే వస్తుందని భావించినట్లు సమాచారం. పర్యాటకంగా లక్ష్యద్వీప్ అభివృద్ధి చెందుతుంది.
సెర్చ్ చేస్తున్న నెటిజన్లు..
మోదీ లక్ష్యద్వీప్ పర్యటనలో స్నార్కెలింగ్ చేయడం, బీచ్‌లో సేద తీరడం, సముద్రం అంచున ఎంతో ప్రశాంతంగా ఉండడం వంటి ఫొటోలను చూసిన నెటిజన్లు మోదీ పర్యటన తర్వాత లక్ష్యద్వీప్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలి, టూర్ ప్యాకేజీలు ఏంటి, హోటల్స్, రవాణా సదుపాయాలు ఎలా ఉంటాయి.. వంటి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో లక్ష్యద్వీప్ ఉండడం గమనార్హం.
భారత వ్యతిరేకి అక్కడ అధ్యక్షుడు కావడమే..
ఇటీవల మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత వ్యతిరేకిగా గుర్తింపు ఉన్న మహ్మద్ ముయిజ్జు గెలిచాడు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలీహ్ భారత్‌కు అనుకూలంగా ఉండేవారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచాడు. ఈ నేపథ్యంలో మాల్దీవుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు, మన పర్యాటకరంగాన్ని బలోపేతం చేసేందుకు మోదీ లక్ష్యద్వీప్ పర్యటనకు కారణమని తెలుస్తోంది.