
మనలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కొందరు ఇల్లు కట్టుకోవడం లేదా కొనడం కొరకు డబ్బులను కూడబెట్టుకుంటే మరి కొందరు హోం లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. అయితే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. ఇల్లు కావాలనుకునే వారి కోసం బంపర్ ఆఫర్ ను తెచ్చింది.
ఎవరికైతే ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటుందో వాళ్లు ఎస్బీఐ మెగా ఈవేలంలో పాల్గొని సరసమైన ధరకే ఇల్లు లేదా ఫ్లాట్ ను సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మెగా ఈవేలంకు రిజిష్టర్ చేసుకుని నచ్చిన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. డ్రీమ్ ప్రాపర్టీపై బిడ్ వేసి తక్కువ ధరకే ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.
ఈ నెల 30వ తేదీన ఈవేలం జరగనుంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ, హౌస్, ఫ్లాట్స్, షాప్స్ లాంటి 1000కు పైగా ప్రాపర్టీలను ఈవేలం ద్వారా ఎస్బీఐ వేలం వేయనుంది. ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకుని సకాలంలో చెల్లించకుండా ఉంటారో వారి ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయిస్తోంది. వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎస్బీఐ వెబ్ సైట్ లో కూడా వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. కొంత మొత్తాన్ని కేవైసీ డాక్యుమెంట్లను ముందుగానే బ్యాంకులో సబ్మిట్ చేసి ఎస్బీఐ ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఈవేలంలో పాల్గొనాలంటే కొంత డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను పొందవచ్చు. ఈ వేలంలో పాల్గొనడం ద్వారా తక్కువ ధరకే ఇల్లు, షాప్ లాంటివి సొంతమవుతాయి.