Makar Sankranti 2024: అతివలు వేసే రథం ముగ్గులు.. ముగ్గు మధ్యలో కొలువుదీరే గొబ్బెమ్మలు.. వాటి పై పిండి పూలు, గరికపోచలు, చుట్టూరా నవధాన్యాలు, రేగి పండులు, బంతిపూల రెమ్మలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ల సరదాలు, హరిదాసుల నాట్యాలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ వర్ణనకు అందదు. కొన్నిచోట్ల మూడు రోజులు, మరికొన్నిచోట్ల నాలుగు రోజులు నిర్వహించే ఈ పండుగ వెనుక చాలా విశేషాలు దాగి ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఒక్కో విజ్ఞాన వీచిక.
ముగ్గులలోనూ అణు శాస్త్ర విశేషాలు
సంక్రాంతి పండుగకు ముందు నుంచే అతివలు ముగ్గులు వేస్తూ ఉంటారు. ధనుర్మాసం మొత్తం ఇంటి ముంగిట చక్కని ముగ్గులతో తీర్చి దిద్దుతారు. అయితే దీని వెనుక అణు శాస్త్ర విశేషాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలకు వేదాలలోని అణు శాస్త్రం గురించి తెలిసిన సారమే చుక్కల ముగ్గులు. అణు విచ్ఛేదన వివరాలు సాంప్రదాయంగా వేసే చుక్కల ముగ్గుల్లో ఉంటాయని చారిత్రక ఐతిహ్యం. అందుకే ముగ్గులు అంటే ఇంటి ముందుకి అందం ఇస్తుంది. ముగ్గులను తీర్చిదిద్దే క్రమంలో స్త్రీలు చుక్కలు పెడుతుంటారు. అవి శాస్త్ర జ్ఞానానికి గుర్తులని పెద్దలు నమ్ముతుంటారు. ఇక సాంప్రదాయంగా చూసుకుంటే ముగ్గు వేసేందుకు వినియోగించే సున్నం, ముగ్గు మధ్యలో ఏర్పాటు చేసే గొబ్బెమ్మలో ఆరోగ్యానికి హాని చేసే క్రీములను పారదోలే లక్షణాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
మకర సంక్రమణ నుంచి
పురాణాల ప్రకారం సూర్యుడు ధనుర్మాసంలో మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉంటాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశం ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో 12 సంక్రాంతిలు వస్తూ ఉంటాయి. సూర్యుడు సంక్రమణం జరిగేటప్పుడు ఏ రాశిలో ఉంటే దానిని ఆ సంక్రాంతి అని పిలుస్తుంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమానం ప్రకారం ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణం ఉంటుంది. సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం ఉంటుంది.
తొలి రోజు భోగి పండుగ
సంక్రాంతి పండుగ కొన్నిచోట్ల మూడు రోజులు, మరికొన్ని చోట్ల నాలుగు రోజులపాటు జరుగుతుంది. తొలి రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి అంటే భోగానికి సంబంధించిన పదం.. భుజ్ అనే సంస్కృతి ధాతువు నుంచి భోగి అనే పదం ఉద్భవించింది. భోగినాడు ప్రతి ఇంటి ముందు మంటలు వేస్తారు. అప్పటిదాకా ఆ మంటల్లో పాత వస్తువులను వేస్తారు. ఇక ఉత్తర భారత దేశంలో ఈ పండుగను లోడి అనే పేరుతో జరుపుకుంటారు. భోగిమంటల అనంతరం కుటుంబ సభ్యులు తల స్నానాలు చేస్తారు. దాంతో అంతకుముందు ఉన్న పీడ మొత్తం తొలగిపోయిందని భావిస్తూ ఉంటారు. సంక్రాంతి అంటేనే వ్యవసాయ పండుగ కాబట్టి భోగినాడు వరి కంకులను ఇంటిముందు గుమ్మాలకు వేలాడదీస్తారు. బంతిపూలతో తోరణాలు అలంకరిస్తారు. చిన్నారులకు మంగళ స్నానాలు చేయించేటప్పుడు తలమీద భోగి పండ్లు పోసి దీవిస్తారు. ఇలా భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు ప్రకృతి పై అవగాహన ఏర్పడుతుందని చారిత్రక ఐతిహ్యం. అంతేకాదు ఆరుబయట ఈ క్రతువు నిర్వహించడం వల్ల సూర్యుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని ఒక నమ్మిక.
సంక్రాంతి నాడు..
చాలామంది సంక్రాంతి నాడు వాకిళ్లను రంగురంగుల రంగవల్లులతో తీర్చి దిద్దుతారు. ఇంటి ముందుకు వచ్చే హరిదాసులకు ధన, వస్తు రూపంలో కానుకలు ఇస్తారు. అంతేకాకుండా సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. సమీపంలోని దేవాలయాలకు వెళ్లి ఇష్ట దైవాలను పూజిస్తారు. గుడులకు వెళ్లని వారు ఇంట్లోనే పూజలు చేస్తూ ఉంటారు. చెరుకు గడలతో, కొత్త బియ్యాన్ని, పాలు, బెల్లం కలిపి పరమాన్నం వండుతారు. దానిని ఇంటిల్లిపాది భుజిస్తారు. కొత్త పంటలు ఇంటికి రావడంతో ఇలా తీపి వంటకం చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం పాడిపంటలు విలసిల్లుతాయని శాస్త్రం చెబుతోంది.
కనుమనాడు పశువుల పండుగ
కనుమను పశువుల పండుగగా జరుపుకుంటారు. వ్యవసాయానికి వెన్నెముక రైతు అయితే.. అతడికి జీవనాధారం పశువులే. అందుకే కనుమ రోజు రైతులు తమ పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు పూస్తారు. అనంతరం వాటిపై నవధాన్యాలు చల్లి ఏడాది మొత్తం ఆరోగ్యంగా ఉండేలా దీవించాలని దేవుడిని వేడుకుంటారు. కొందరైతే పశువులను పూలతో కూడా అలంకరిస్తారు. వాటి మెడలో పూలదండలు వేసి.. మంగళ హారతులు ఇస్తారు. కనుమ రోజు పశువులతో ఎటువంటి వ్యవసాయ పనులు కూడా చేయించరు.
ముక్కనుమ
సంక్రాంతిలో చివరిదైన ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో విశేషంగా జరుపుకుంటారు. ఆరోజున ఇంటిల్లి పాది మాంసాహారంతో కూడిన వంటలు వండుకొని భుజిస్తారు. స్తోమత ఉన్న వాళ్ళైతే రకరకాల వంటలు వండుకొని ఆరగిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆట విడుపుగా ఉండేందుకు గాల్లోకి పతంగులు ఎగరవేస్తారు. ఇంకా కొంతమంది అయితే కోడిపందాలు చూడటానికి వెళ్తూ ఉంటారు. గత కొంతకాలంగా సంక్రాంతి పండుగ అంటే కేవలం కోడిపందాలు అనేలా పరిస్థితులు మారిపోవడం విశేషం.