Homeజాతీయ వార్తలుRevanth Rahul vs KCR : టీఆర్ఎస్ సర్కార్ కంబంధ హస్తాల్లో ‘ఓయూ’.. కేసీఆర్ దెబ్బకు...

Revanth Rahul vs KCR : టీఆర్ఎస్ సర్కార్ కంబంధ హస్తాల్లో ‘ఓయూ’.. కేసీఆర్ దెబ్బకు రేవంత్ ఫెయిల్?

Revanth Rahul vs KCR : రాజకీయాలంటేనే ఒక చదరంగం.. ఎదుటివారి ఆలోచనలను ముందే పసిగట్టి ఎత్తులు వేస్తేనే ఇక్కడ విజయం.. లేదంటే ఓటములే. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో కీలకమైన ‘ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ’లో కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారు. ఒకవేళ ఇదే జరిగి ఉంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు బాగా మైలేజ్ వచ్చింది. అసలే కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేస్తున్న విద్యార్థి లోకం ఇక్కడి మీటింగ్ తో కాంగ్రెస్ ను ఓన్ చేసుకునేది. విద్యార్థులను తమ వైపు తిప్పుకునేది. తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువైన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన జరిపితీరాలన్న కాంగ్రెస్ ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. ఆయన వ్యూహాత్మక ఎత్తుగడల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్లు వెలవెలబోయాయి.. అసలు ఓయూలోనే రాహుల్ పర్యటన ఎందుకు పెట్టుకున్నారు? కేసీఆర్ ఎందుకు అడ్డుకున్నారు? రేవంత్ రెడ్డి వైఫల్యం ఇందులో ఎంత ఉందన్న దానిపై స్పెషల్ ఫోకస్..

Revanth Rahul vs KCR
Revanth Rahul vs KCR

– ఓయూలోనే రాహుల్ పర్యటన ఎందుకు పెట్టుకున్నారు?
తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ. కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోగానే ఉద్యమాన్ని రగిలించింది ఓయూ యూనివర్సిటీ. నాడు విద్యార్థులు కదం తొక్కి రాష్ట్రాన్ని కదిలించారు. ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. అంతటి నిప్పు కణికలాంటి ఓయూలో రాహుల్ సభ జరిగితే అది వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బాగా కలిసివచ్చేది. ఎందుకంటే కేసీఆర్ అన్నింటిని నెరవేర్చి ఒక్క నెరవేర్చనిది ఏదైనా ఉందంటే అది ఉద్యోగాలే. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ తాత్సారం చేస్తున్నారు. అందుకే దాన్నే ఆయుధంగా చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఓయూలో సభ పెట్టి అక్కడి విద్యార్థి నేతలను ఆకర్షించి యువతను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేశారు. అంతేకాదు.. ఓయూ విద్యార్థి నేతలకు పలు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేలా కూడా రాహుల్ తో ప్రకటన చేయించడానికి రెడీ అయినట్లు తెలిసింది. ఇదే జరిగితే విద్యార్థి లోకం అంతా కాంగ్రెస్ వైపు మరలడం ఖాయం. దీన్ని ముందే ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన కేసీఆర్ చక్రం తిప్పారని తెలిసింది. ఓయూలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీ సభ పెట్టకుండా అడ్డుకున్నారు. విజయం సాధించారు.

Also Read: BJP Leader Arrested: పేకాట ఆడుతూ మహిళలతో పట్టుబడ్డ బీజేపీ నేత

-కేసీఆర్ ఎందుకు అడ్డుకున్నారు?
ఉస్మానియా లాంటి ఉద్యమాల గడ్డలో ప్రతిపక్ష కాంగ్రెస్ కార్యక్రమాలు విజయవంతం అయితే అదొక ఉద్యమరూపాన్నే సంతరించుకుంటాయి. ప్రశాంతంగా ఉన్న టీఆర్ఎస్ సర్కార్ పాలన కాళ్లకిందకు నీళ్లు వస్తాయి. ఓయూలో ఏది రగిలించినా అది రావణకాష్టంలా రాష్ట్రమంతా రగులుతుందన్న విషయం కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే రాష్ట్రమంతటా తిరిగే కేసీఆర్ మాత్రం ఓయూలో పర్యటించరు. టీఆర్ఎస్ నేతలు సైతం అడుగు పెట్టరు.. ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఇప్పటికే టీఆర్ఎస్ పై ఒంటికాలిపై నిరుద్యోగులు లేస్తున్నారు. వారంతా రాహుల్ పర్యటించి ఆకర్షిస్తే టీఆర్ఎస్ మొదటికే మోసం వస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా కేసీఆర్ చక్రం తిప్పారని టాక్. ఈ క్రమంలోనే ఓయూ వీసిని అర్జంటుగా సెలవుపై పంపారు. ఆ తర్వాత రిజిస్ట్రార్ తో రాహుల్ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసి షాక్ ఇచ్చారు.

-హైకోర్టుకెక్కినా కాంగ్రెస్ కు ఫలితం లేదే?
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన శుక్రవారం ఉంది. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అయితే ఇందుకు ఓయూ రిజిస్ట్రార్ నిరాకరించడంతో కాంగ్రెస్ వాదులు దీనిపై హైకోర్టుకెక్కారు. ఓయూ రిజిస్ట్రార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మానవతా రాయ్, మరో ముగ్గురు అత్యవసరంగా హైకోర్టులో రాహుల్ కార్యక్రమానికి అనుమతి కోసం పిటీషన్ దాఖలు చేశారు.ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓయూలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో ముఖాముఖికి అనుమతిని హైకోర్టు నిరాకరించింది. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా వినియోగించడం సరికాదని పేర్కొంది. ఈ క్రమంలోనే పిటీషనర్ స్పందిస్తూ.. ‘గతంలో సీఎంలు, మాజీ సీఎంల జన్మదిన వేడుకలు.. బీజేపీ మాక్ అసెంబ్లీ, జార్జిరెడ్డి జయంతి జరిగాయని’ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అనుమతించారన్న కారణంగా రాహుల్ గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని.. ఓయూ పాలక మండలి తీర్మానానికి విరుద్ధంగా అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక నుంచి జయంతులు, వర్ధంతులు ఇతరు కార్యక్రమాలు కూడా ఓయూలో నిర్వహించవద్దని హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకే కానీ నెగెటివ్ విషయాలకు కాదని తేల్చిచెప్పింది. రాహుల్ నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించే ఠాగూర్ ఆడిటోరియంకు 2. కి.మీల దూరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని.. యూనివర్సిటీలో ఏ కార్యక్రమం సరైందో కాదో రిజిస్ట్రారే సరైన నిర్ణయం తీసుకోగలరని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. యూనివర్సిటీలు అంటే విద్య, శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని.. యూనివర్సిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించరాదని హైకోర్టు అభిప్రాయపడింది. క్యాంపస్ లో రాజకీయ కార్యక్రమాలను నిషేధించేలా సమగ్ర, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఓయూ రిజిస్ట్రార్ కు హైకోర్టు సూచించింది.

Revanth Rahul vs KCR
Revanth Rahul vs KCR

-రేవంత్ రెడ్డి వైఫల్యమే ఇదీ
యూనివర్సిటీల్లో సభలు, సమావేశాలను సైలెంట్ గా ప్లాన్ చేయాలి. అనుమతులు దక్కవని తెలిసి కూడా రేవంత్ రెడ్డి మొండిగా ముందుకెళ్లారు. అభాసుపాలయ్యారు. కానీ రాహుల్ గాంధీ పర్యటనకు హైప్ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి చేసిన హంగామానే ఆయన కొంప ముంచేసినట్టైంది. రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా విశ్వ విద్యాలయాల్లో రాజకీయాలు వద్దన్న కోణంలో హైకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలివిగా వాదించింది. ఈ వాదన నెగ్గి రాహుల్ సభకు హైకోర్టు అనుమతి నిరాకరించేలా చేసింది. పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ సర్కార్ ఇలా ముందస్తుగా వీసీతో సెలవు పెట్టించి రిజిస్ట్రార్ తో ఇలా చేయించి రాహుల్ పర్యటనను తెలివిగా హైకోర్టు ద్వారా తమ చేతులకు మట్టి అంటకుండా అడ్డుకుందన్న వాదన వినిపిస్తోంది.కేసీఆర్ ప్లాన్లు తెలియక కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి అభాసుపాలయ్యారని.. ఆయన ప్లాన్లు ఫెయిల్ అయ్యాయని తెలుస్తోంది.

-రాహుల్ గాంధీపై కేటీఆర్ వైట్ ఛాలెంజ్
ఇక కేటీఆర్ ను ఇరుకునపెట్టేందుకు రేవంత్ రెడ్డి లేవనెత్తిన‘వైట్ చాలెంజ్’ ఇప్పుడు రాహుల్ గాంధీ మెడకే చుట్టింది టీఆర్ఎస్. ఈ విషయంలో ఇప్పుడు రేవంత్ కక్కలేక మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం డ్రగ్స్ అడిక్ట్ అని.. ఆయన టెస్ట్ చేసుకోవడానికి ముందుకు రావాలని ‘వైట్ చాలెంజ్’ పేరిట రేవంత్ రెడ్డి అప్పట్లో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. అయితే తాజాగా నేపాల్ నైట్ క్లబ్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ దొరికిన రాహుల్ గాంధీపై ఇదే వైట్ చాలెంజ్ ను విసిరి టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాహుల్ హైదరాబాద్ లో పర్యటించే ప్రాంతాల్లో అంతటా ‘రాహుల్ వైట్ చాలెంజ్ కు రెడీనా?’ అంటూ ఫ్లెక్సీలు వెలియడం సంచలనమైంది. దీంతో రేవంత్ రెడ్డి అస్త్రానే ఆయన అధినేతపై విసిరి రేవంత్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేస్తోంది టీఆర్ఎస్ దండు. ఇలా ఒక్కటేమిటీ.. కేసీఆర్, టీఆర్ఎస్ వ్యూహాల ముందు రేవంత్ రెడ్డి ప్లాన్లు అట్టర్ ఫ్లాప్ అయిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ వ్యూహాల ముందు రేవంత్ తేలిపోతున్నారు. ముందస్తు ఆలోచన లేకుండా గుడ్డిగా వెళుతున్న రేవంత్ ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేసేలా టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. రేవంత్ నే కాదు.. రాహుల్ ను కూడా ఇరుకునపెడుతోంది.

Also Read:CM Jagan and Roja Tongue Slip : సీఎం జగన్, రోజా టంగ్ స్లిప్.. వీళ్లకు జర తెలుగు నేర్పండయ్యా!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular