CM Jagan: విధేయత, వీర విధేయత.. అధికార వైసీపీలో వినిపించే మాట ఇది. ఎక్కడో ఉన్న తనను తెప్పించి ఎమ్మెల్యే చేశాడు జగనన్న అని ఒకరు. తనపై ఐరన్ లెగ్ అని ముద్ర వేసి సర్వనాశనం చేస్తే అండగా నిలిచాడు జగనన్న అని మరొకరు. తన కట్టె కాలే వరకూ జగనన్న వెంటే నడుస్తానని..చివరకు తన అంత్యక్రియలకు కూడా జగనన్నే రావాలని భావోద్వేగాన్ని పలికించింది మరొకరు.. ఈ మూడున్నరేళ్లలో ఇటువంటి మాటలు, వ్యాఖ్యలు, దృశ్యాలను ఎన్నెన్నో ఏపీ ప్రజలు చూశారు. కాలం కరిగిపోతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు నేతల స్వరం మారుతోంది. విధేయత నుంచి ఎంతో నమ్మాం జగనన్న.. ఇదేంటి మాకు ఈ పరిస్థితి అని ఒకరు? అసలు తాము అధికార పార్టీలో ఉన్నమా అని మరొకరు. తమ ఫోన్లనే ట్యాప్ చేయించడం తగునా జగనన్న? అని ఒకరు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రశ్నల పరంపరలో బయటకు వెళ్లి విమర్శలు చేయడం ప్రారంభించారు.

జకీయాల్లో విధేయతకు చోటెక్కడుంది? విధేయత ప్రదర్శించిన వారికి దక్కేది శూన్యమే. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పట్ల విధేయత చూపించిన వారు అధికం. కిందిస్థాయి కేడర్ నుంచి ఎమ్మెల్యేల వరకూ ఇది నా పార్టీ. జగనన్న మా వాడు అన్న రేంజ్ లో పనిచేశారు. ఎదుటి మనిషితో ఉన్న విభేదాలను సైతం పక్కనపెట్టి సీఎంగా జగన్ ను చూడాలని పరితపించారు. కొందరు ఆస్తులను సైతం విక్రయించుకొని పార్టీ కోసం నిలబడ్డారు. పార్టీ జెండాతో ఊరూరా తిరిగిన వారూ ఉన్నారు. అటువంటి వారు ప్రేమ, అభిమానం నుంచి బయటపడి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.
రాజకీయాల్లో ప్రయోజనం అన్న మాటకు తప్ప మరిదేనికీ లేదు. శత్రువులు మిత్రువులు అవుతారు.. మిత్రువులు శత్రువులుగా మారిపోతారు. ఒక్కోసారి ప్రత్యర్థే చేయి అందిస్తాడు. అందుకే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమన్న పాతమాటకే ప్రాధాన్యత ఉంది. రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలే ముఖ్యం. ప్రయోజనాలు నెరవేరనప్పుడు ఎవరైనా తమ దారి తాము చూసుకుంటారు. అన్న జైలులో ఉన్నప్పుడు పార్టీ కోసం షర్మిళ పరితపించారు. ఎన్నికల్లో అన్న గెలుపొందితే ఏదో ఒక ప్రయోజనం దక్కుతుందని భావించారు.

కానీ షర్మిళ ఊహించినట్టు జరగలేదు. అన్న ఆదరణకు నోచుకోలేదు. దీంతో తల్లిని తీసుకెళ్లి మరీ తెలంగాణలో షర్మిళ కుంపటి పెట్టుకున్నారు. ఈ ఒక్క ఘటనతో రాయలసీమ రాజకీయాలు మలుపుతిప్పాయి. రెడ్డి సామాజికవర్గంలో పునరాలోచన పడింది. ‘ఆ నలుగురు’ ప్రయోజనం పొందుతున్నారే తప్ప మాకే ఏదీ లేకుండా పోయిందేనన్న అంతర్మథనం ప్రారంభమైంది. గాలివానలా మారి అధికార పార్టీని కుదిపేస్తోంది. ప్రస్తుతానికైతే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు. మున్ముందు చాలామంది బయటపడే అవకాశముంది. అందులో జగన్ భక్తులు, వీర విధేయులు సైతం ఉన్నట్టు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.