Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao: ఇది రాజమౌళి తీయని త్రిబుల్ "ఆర్", రామోజీరావు మర్చిపోయిన "ఆర్"

Ramoji Rao: ఇది రాజమౌళి తీయని త్రిబుల్ “ఆర్”, రామోజీరావు మర్చిపోయిన “ఆర్”

Ramoji Rao
Ramoji Rao

Ramoji Rao: తన సమస్య జాతికి సమస్య, తన ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది, తన బాధ ప్రపంచం బాధ.. తెలుగు మీడియా మొగల్ అలియాస్ ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు సూత్రికరణ ఇదేవిధంగా ఉంటుంది. మార్గదర్శి మీద దాడులు చేస్తే శోకాలు పెడతాడు. జనం జగన్ సర్కార్ మీద తిరగబడాలంటూ పిలుపునిస్తాడు. నాదంతా సొక్కం అని చెప్తాడు.. లెక్కలు చూపించయ్యా అంటే నా ఇష్టం, నీకెందుకు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఉల్టా దబాయిస్తాడు. అంతేకాదు తాను చట్టానికి అతీతుడనని, తను ఏవీ ఏమీ చేయలేవని ఢంకా బజాయిస్తాడు. మీడియా మొఘల్ గా, రాజ గురువుగా చెప్పుకునే రామోజీరావు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

వాస్తవానికి రామోజీరావు తన పత్రికలో తన వ్యక్తిగత విషయాలకు, తన కుటుంబ సంబంధమైన వ్యవహారాలకు తావు ఇచ్చేవాడు కాదు.. అలా ఎందుకు సార్ అని ఎవరైనా ప్రశ్నిస్తే పత్రికలో సెంటిమీటర్ స్పేస్ కూడా చాలా విలువైందని వ్యాపార పాఠాలు చెప్పేవాడు. హఠాత్తుగా ఏమైందో తెలియదు కానీ రామోజీరావులో కొత్త కోణం తెలుగు ప్రజలకు కనిపించడం ప్రారంభమైంది.అది ఇప్పుడు పటాటోపానికి చేరింది. మార్గదర్శి మీద సిఐడి దాడులు చేస్తుంటే అది ఈనాడు బ్యానర్ వార్త అయింది. కిరణ్ కూతుళ్ళ పెళ్లి, సుమన్ కూతురు వివాహం ఈనాడు లో మూడు, నాలుగు పేజీలు ప్రచురించే స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే అది ఆయన పత్రిక, ఆయన ఇష్టం.. దీన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ దీనికంటే ముందు వల్లె వేసిన విలువల గురించి, పాఠకుల మెదళ్ళల్లో నింపిన విషం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.

అప్పట్లో ఈనాడుకు పోటీగా ఉదయం అనే పేపర్ ఉండేది. దానిని ఎలాగైనా తొక్కేయాలని రామోజీరావు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఆ ఉదయం పత్రిక ఓనర్ దాసరి నారాయణరావు వార్తల మీద పూర్తి నిషేధం ప్రకటించాడు రామోజీరావు. ఉదయం పత్రిక మూత పడిన తర్వాత రామోజీరావు శాంత పడ్డాడు. పాత ఆంధ్రజ్యోతి విషయంలోనూ రామోజీరావు ఇదే పందా అనుసరించాడు. చివరికి వార్త పేపర్ ను ఏ కీలుకు ఆ కీలు తీసేదాకా వదిలిపెట్టలేదు. సాక్షి అనే పత్రిక వచ్చింది కాబట్టి మీడియా రంగంలో వేతనాలు పెరిగాయి. లేకుంటే “బాండెడ్ లేబర్” అనే విధానాన్ని రామోజీరావు మరో స్థాయికి తీసుకెళ్లేవాడు.

ఇప్పుడు వ్యక్తిగత ప్రచారాన్ని, కుటుంబానికి సంబంధించిన ప్రచారాన్ని విపరీతంగా కోరుకుంటున్న రామోజీరావు తెలుసుకోవాల్సిన పాఠం మరొకటి ఉంది. అది 1978-79 కాలం… ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఓనర్ రామ్ నాథ్ గోయంకా మనవరాలు కవిత గోయంకా కు పెళ్లి కుదిరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆ గ్రూపులో ఉన్న వివిధ భాషా పత్రికల సిబ్బందికి పెళ్లి పత్రికలు అందాయి. రామ్ నాథ్ గోయంకా సిబ్బంది ప్రతీ ఒక్కరికి పంచెలు శుభ్రంగా ప్యాక్ చేసి పెళ్ళికానుకగా పంపించారు. ఇక పెళ్లిరోజు రానే వచ్చింది. మద్రాస్ లో పెళ్లి ఘనంగా జరిగింది. అయితే కవిత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వార్తలు, విశేషాల కోసం ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇతర భాషా పత్రికల సిబ్బంది ఎదురుచూస్తున్నారు. కానీ అవి ఎంతకీ రావడం లేదు. అప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ గా పొత్తూరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. ఆయన కూడా వాటి కోసమే హడావిడిగా తిరుగుతున్నారు. సెంట్రల్ డెస్క్ దగ్గరికి వచ్చి ఏమైనా మెసేజ్ వచ్చిందా అంటూ ఆరాతీస్తున్నారు.. టెలీ ప్రింటర్ రూమ్ లోకి వెళ్లి మరీ ఆరా తీస్తున్నారు. ఈలోగా ఫోర్ మెన్ వచ్చి ” టైమ్ అవుతోంది. పేజీలు పెట్టడానికి రండి” అంటూ సబ్ ఎడిటర్లను తొందర చేయడం ప్రారంభించాడు. దీంతో సబ్ ఎడిటర్లంతా పొత్తూరి రూం కు వెళ్లారు. అప్పటికే డైలామా లో ఉన్న ఆయన మద్రాస్ వాళ్ళను అడిగారు. మద్రాస్ లోనే ఉన్న ఓఎస్డీ వెంటనే పెళ్లి మండపానికి వెళ్లారు. రామ్ నాథ్ దగ్గరకు వెళ్ళి ” సార్ అన్ని ఎడిషన్ల వారు ఎదురు చూస్తున్నారు. పెళ్ళి వార్తలు, ఫోటోలు” అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే రామ్ నాథ్ కల్పించుకుని ” ఇది నా మనవరాలి వివాహం, ఇందులో ప్రజల న్యూస్ ఇంట్రెస్ట్ ఏముంది” అంటూ తేల్చి చెప్పేశాడు. ఎడిషన్లు అపకూడదని అందరికీ చెప్పండి అంటూ ఆయనను ఆదేశించాడు.

Ramoji Rao
Ramoji Rao

కానీ ఇదే రామోజీరావు తన మనవరాళ్ల పెళ్లిళ్ల కోసం ఎంత హడావిడి, ఎంత కవరేజ్ ఇచ్చాడో చూసాం కదా.. ఇప్పుడు మార్గదర్శి కేసులోనూ ఎన్ని నీతి వాక్యాలు చెబుతున్నాడో చూస్తున్నాం కదా.. అందుకే అంటారు చెప్పేటందుకే గురువింద నీతులు అని.. ఇది ఇప్పుడు రామోజీరావుకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది. మొదట్లోనే చెప్పాం కదా! ఇది రాజమౌళి తీయని త్రిబుల్ “ఆర్”, రామోజీరావు మర్చిపోయిన “ఆర్”! అర్థం చేసుకున్న వాళ్లకు అర్ధమైనంత.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular