Rahul Gandhi Twitter: అధికారంలో ఉంటే కొండ మీద కోతిని కూడా కిందకు దించొచ్చు అంటారు. చిటిక వేస్తే చాలు అన్నీ సౌకర్యాలు మన కాళ్ల కిందకు వస్తాయి. ప్రత్యర్థులందరూ దాసోహమవుతారు. ఎదురించే వ్యవస్థలన్నీ ‘ఎస్ బాస్’ అంటాయి. అప్పట్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు షాకిచ్చేలా వ్యవహరించిన ట్విట్టర్ విషయంలో కేంద్రప్రభుత్వం నిబంధనలను టైట్ చేసి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ట్విట్టర్ మొండికేస్తే ఏకంగా నిషేధం దిశగా అడుగులువేసింది. ఎట్టకేలకు భారత ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ ట్విట్టర్ వెనకడుగు వేసింది.

ఈ క్రమంలోనే ట్విట్టర్ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ నియామకం తర్వాత ఆ సంస్థ మరీ బెండ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా దేశంలోనే ప్రతిపక్ష పార్టీకి లీడర్ గా ఉన్న రాహుల్ గాంధీ. ట్విట్టర్ రాహుల్ గా తాజాగా నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి కావాలనే తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండా భాగస్వామి అవుతోందని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కు లేఖ రాశారు. ఈ లేఖ పై ట్విట్టర్ స్పందించింది. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది.
ప్రధాని మోడీ, కేంద్రమంతి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ల ట్విట్టర్ ఖాతాలను పోల్చి వాళ్ల ఫాలోవర్స్ రోజురోజుకు పెరుగుతుంటే తన ఫాలోవర్స్ తగ్గడంపై రాహుల్ గాంధీ లేఖలో విమర్శించారు. 2021లో తొలి ఏడు నెలల్లో తనకు ఫాలోవర్లు పెరిగారని.. ఆ తర్వాత కావాలనే తగ్గిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.
భారత్ లో వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండానే భాగస్వామిగా అవుతోందని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా.. అన్యాయంపై ప్రజల తరుఫున గళమెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే భారత్ లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేసేందుకు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలే ప్రధాన వేదికలు అని.. మా గొంతును మోడీ, ట్విట్టర్ నొక్కేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.