Telangana Congress: అధికారమే లక్ష్యంగా.. తెలంగాణ కాంగ్రెస్ సెట్ రైట్

తెలంగాణ కాంగ్రెస్లో గతంలో పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందరినీ పార్టీ అధిష్టానం లైన్లో పెడుతుండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Written By: Bhaskar, Updated On : September 21, 2023 2:13 pm

Telangana Congress

Follow us on

Telangana Congress: ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ అవకాశాన్ని కూడా జార విడుచుకోకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే అంతర్గత స్వేచ్ఛకు కొన్ని హద్దులు నిర్ణయిస్తున్నది. గతంలో సానుకూల పవనాలు ఇచ్చినప్పుడు నేతల తీరు వల్ల చేజేతులా అధికారాన్ని ఎలా కోల్పోయారో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు. దానివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటునాయో ఆ పార్టీ నేతలకు తెలుసు. అందుకే ఈసారి నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల ముంగిట పార్టీ కకావికలం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్లో గతంలో పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందరినీ పార్టీ అధిష్టానం లైన్లో పెడుతుండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విపరీతమైన స్వేచ్ఛకు, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం పట్ల రాజకీయ వర్గాలు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో ప్రాధాన్యం దక్కడం లేదని అనుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి గౌడ్ కు తాజాగా స్క్రీనింగ్ కమిటీ లో చోటు కల్పించారు. మరోవైపు సీనియర్ నేతలకు టికెట్ పై ఇబ్బంది లేదని చెప్పడానికి 40 మంది పేరుతో ఒక జాబితాను విడుదల చేశారు. విశ్వసనీ వర్గాల సమాచారం ప్రకారం తొలి జాబితాలో కొంతమంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈ జాబితాలో సీనియర్ నేతలందరికీ టికెట్ లభించినట్టు తెలుస్తోంది. తీవ్రమైన పోటీ ఉన్నచోట పెండింగ్ పెట్టినట్టు సమాచారం. వైపు త్వరలో ప్రారంభించబోయే బస్సు యాత్రకు కాంగ్రెస్ హై కమాండ్ ప్లాన్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఈ యాత్రను మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ యాత్రలో పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం పాల్గొనే అవకాశం ఉంది.

ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉందని, స్థిరమైన పాలన అందిస్తుందని ప్రజలకు చాటి చెప్పడమే దీని ఉద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా అసంతృప్తి స్వరాలు తగ్గిపోయాయి. రేవంత్ రెడ్డి ఆధిపత్యం పెరిగిపోయిందని మొన్నటిదాకా విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు చల్లారిపోయారు. హై కమాండ్ కూడా రేవంత్ రెడ్డికి పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదనే సంకేతాలు ఇవ్వడంతో అసంతృప్తి స్వరాలు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ లైన్లోకి వచ్చిందని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇప్పటికైతే పరిస్థితి బాగానే ఉంది గాని ,ఎన్నికల వరకు ఏం జరుగుతుందోనని వారు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.