Kapu Politics In AP: ‘కాపులే’ పావులుగా ఏపీలో రాజకీయ చదరంగం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ చాటున నేతలందరూ విడిపోయి మూడో ప్రత్యామ్మాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో కొందరు టీడీపీ సానుభూతి పరులు ఉండగా.. మరికొందరు వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. కాపులు , కాపు నేతలు నిజంగా ఐక్యంగా ఉండి ఒక గొడుగు కిందకు వస్తే వారే ఏపీలో రాజ్యాధికారాన్ని సాధించగలరు. కానీ వైసీపీ, టీడీపీ లోపాయికారి రాజకీయం కాపులను విభజించి పాలిస్తూ అధికారానికి దూరం చేస్తోంది. రెడ్డి, కమ్మ సామాజికవర్గాల పల్లకీ మోసే కాపరులుగా మాత్రమే కాపులను పరిమితం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఏపీలో కీలకమైన కాపు నేతలంతా విడిపోయి ఎవరికి వారు సొంత పార్టీల కోసమంటూ మీటింగ్ లు పెట్టుకోవడం.. మరికొందరు దిగ్గజ కాపు నేతలు పార్టీలను ప్రకటించడంతో ఏపీలో ‘కాపు రాజకీయం’ రాజుకుంది.

-విశాఖలో ‘కాపు కీలక నేతల’ కీలక భేటి
విశాఖపట్నంలో కాపు సామాజికవర్గంలోని వివిధ పార్టీల్లో ఉన్న కీలక కాపు నేతల భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, జనసేన నుంచి బయటకు వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణతోపాటు మరికొందరు కీలక కాపు నేతలు వైజాగ్ లో భేటి అయ్యి కాపులకు రాజ్యాధికారం కోసం కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇందులోని ముగ్గురు మూడు పార్టీలకు చెందిన వారు.. ఎవరి పంథా వారికుంది. వారివెనుక ఆయా పార్టీల ప్రభావం ఉంది. దీంతో వీరి రాజకీయం కాపులకు రాజ్యాధికారం కోసమా? లేక తమ వెనుకున్న పార్టీకి భవిష్యత్తులో సహకరించేందుకు ఇలా తెరపైకి తెచ్చారా? అన్న అనుమానాలు కలుగకమానవు.
-సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాపు గళం నిజమేనా?
* సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గతంలో జనసేనలో చేరారు. టీడీపీకి సపోర్టుగా ఆయన ఆది నుంచి వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఇక జేడీకి పరోక్షంగా చంద్రబాబు సపోర్టు చేశారని.. చంద్రబాబు చెబితేనే పవన్ కళ్యాణ్ ఏకంగా విశాఖ ఎంపీ టికెట్ ను జేడీకి ఇచ్చారన్న గుసగుసలు వినిపించాయి. ఈక్రమంలోనే విశాఖలో డమ్మీ అభ్యర్థిని కూడా చంద్రబాబు తన పార్టీ తరుఫున పెట్టించి జేడీకి గెలుపునకు సహకరించాడన్న వాదన ఉంది. కానీ వైసీపీ గాలిలో జేడీ కూడా కొట్టుకుపోయాడు.. ఈ క్రమంలోనే రాజకీయ భవిష్యత్తు లేకనే ఇప్పుడు ‘కాపులకు సొంతంగా రాజ్యాధికారం’ అంటూ బయలుదేరారు. గంటా, కన్నా లాంటి నేతలను కలిసి రాజకీయం మొదలుపెట్టారన్న వాదన కాపు సామాజికవర్గంలో వ్యక్తమవుతోంది.
-గంటా శ్రీనివాస్.. ఏ ఎండకాగొడుగేనా?
*టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజకీయం ఎప్పుడూ ఏ ఎండకాగొడుగు పట్టినట్టుగా ఉంటుందన్న విమర్శలున్నాయి.ప్రతిసారి అధికారంలోకి వచ్చే పార్టీని ఎంపిక చేసుకొని తన మందీ మార్బలంతో చేరి మంత్రి పదవులు కొట్టేస్తుంటారాయన..కానీ ఈసారి జగన్ ముందు ‘గంటా’ కొట్టలేకపోయారు. వైసీపీలో చేరి మంత్రి పదవి కొట్టేయాలని సంప్రదింపులు జరిపినా జగన్ సమ్మతించకపోవడంతో ఆయన ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీలోనూ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. అటు జగన్ కాదనడంతో వైసీపీలో చేరలేక.. ఇటు టీడీపీలో ఉండలేకపోతున్నాడు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు ‘కాపుల ఐక్యత’ పేరుతో కాపులను ఏకం చేసే పని పెట్టుకున్నాడు. విశాఖలో మీటింగ్ పెట్టి జేడీ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ సహా కాపు నేతలను ఆహ్వానించి రాజకీయం మొదలుపెట్టారు. ఇదే గంటా గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో కాపులతో తనకు సంబంధం లేదని.. తన వ్యాపార భాగస్వాములంతా కాపులు కాదని.. ఇతర సామాజికవర్గాలతోనే తనకు సత్సంబంధాలున్నాయని అన్నారు. ఇప్పుడు కాపుల ఐక్యత పేరుతో ఆయన ఇస్తున్న పిలుపునకు విశ్వసనీయత లేకుండా పోతోంది. ఈరోజు కాపుల జపం చేసినా ఆయన సామాజికవర్గం గంటాను నమ్మే పరిస్థితి కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది.
-కన్నా లక్ష్మీనారాయణకు కాపులు గుర్తొచ్చారా?
కాపుల ఐక్యత మీటింగ్ లో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ ఫక్తు టీడీపీ మద్దతుదారుగానే ఉన్నాడన్న ప్రచారం ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగానూ ఆయన అలానే వ్యవహరించారు. చంద్రబాబు ఏదీ నెత్తిన పెట్టుకుంటే ఆ సమస్యపై పోరాడారు. అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు. రామోజీ రావు మద్దతుతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు.చంద్రబాబుకు సపోర్టుగా ఉండడంతో బీజేపీ అధిష్టానం ఆయనను ఏపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిందన్న టాక్ ఉంది. ఇప్పుడు కాపుల ఐక్యత అంటూ ముందుకు వచ్చినా ఆయన టీడీపీ ఏజెంట్ గానో.. టీడీపీకి మద్దతుగానో ఈ ఉద్యమంలో వ్యవహరిస్తారని.. కన్నాను నమ్మే పరిస్థితి లేదంటున్నారు.
-కాపు నేతలతో వరుస మీటింగ్ లు..
కాపు నేతల మీటింగ్ లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. గంటా, జేడీ, కన్నా విశాఖలో మీటింగ్ పెట్టగా.. నిన్న వల్లభనేని వంశీ ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాతో విజయవాడలో మంతనాలు జరిపారు. కాపు నేత రామ్మోహన్ రావు తాజాగా కాపు ప్రతినిధులతో హైదరాబాద్ కేంద్రంగా రెండు మూడు మీటింగులు నిర్వహించి వారిలో ఐక్యత కోసం పాటుపడ్డారు. వీరి ప్రధాన ఏజెండా సపరేట్ కొత్త పార్టీ పెడుదామని అనుకుంటున్నారు. ఇందులో జేడీ, గంటా టీడీపీకి ఫేవర్ గా ఉన్నందున కొత్త పార్టీ పెట్టినా వీరి మొగ్గు ఖచ్చితంగా టీడీపీతోనే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇక మిగతా నేతలు వైసీపీలో ఉండగా.. వారి మద్దతు వైసీపీ సైడ్ ఉండొచ్చని చెబుతున్నారు.
-ముద్రగడ కొత్త పార్టీ.. బాబుకు వ్యతిరేకం.. జగన్ కు మద్దతుగానేనా?
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ఒకేసారి ఉద్యమాన్ని రగిలిస్తాడు.. అనంతరం చప్పున చల్లారుస్తాడు. కేసీఆర్ లాగానే దాన్ని కడవరకూ ఆరకుండా తీరం దాటించలేకపోవడం ఆయన మైనస్ గా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా కాపు నేతల వరుస మీటింగ్ లో ముద్రగడ అలెర్ట్ అయ్యారు. తనే సొంతంగా పార్టీ పెట్టేశాడు. ముద్రగడ కొత్త పార్టీ పెడుతామనడం చూసి టీడీపీ ఖంగుతింది. ఎందుకంటే ఆది నుంచి ముద్రగడ చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు..కాపుల ఐక్యత మీటింగ్ లోని నాయకులంతా టీడీపీకి సపోర్టుగా ఉన్న వారే.అందుకే చంద్రబాబుకు కాపుల మద్దతు రాకుండా కౌంటర్ గా ముద్రగడ కొత్త పార్టీ పెడుతున్నారన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు అంటే పడని ముద్రగడ టీడీపీని దెబ్బకొట్టడానికే పార్టీ పెడుతున్నాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాపులు ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలుగా విడిపోయారు. వైసీపీ, టీడీపీ,జనసేనలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూడు రాజకీయ పార్టీలు కాపు నేతలకు సీఎం పోస్టు తప్ప మిగతా కీలక పదవులు ఇచ్చి కాపు ఓటు బ్యాంకును కాజేస్తున్నారు. అందుకే ఇప్పుడు కాపుల కోసం ముద్రగడ రంగంలోకి దిగాడు. వైసీపీకి మద్దతుగా ఉండే ముద్రగడ పార్టీ పెట్టడం టీడీపీకే మైనస్ అంటున్నారు.కాపుల ఐక్యతను క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు చేసే ఈ ప్రయత్నాలకు ముద్ర గడ గండికొడుతున్నాడా? అన్న చర్చ సాగుతోంది.
-వంగవీటి రగిలిస్తున్న సెంటిమెంట్ రాజకీయం కథేంటి?
ఇక కాపుల ఐక్యత పేరుతో విశాఖలో.. హైదరాబాద్ లో టీడీపీ అనుకూల బ్యాచ్ చేస్తున్న రాజకీయానికి ప్రత్యామ్మాయంగా వైసీపీ కూడా అలెర్ట్ అయ్యింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ముద్రగడ పార్టీ ప్రకటించడం.. ఇటు కాపు కీలక నేత వంగవీటి రాధాతో వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని భేటి కావడంతో ఈ కాపు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. రాధాను తిరిగి వైసీపీలో చేర్చుకుంటే కాపులను వైసీపీకి మలిచే ఈ ఎత్తుగడ ఫలిస్తుంది. మరి రాధా కూడా సెంటిమెంట్ రాజకీయాన్ని తెరతీశాడు. తన హత్యకు కుట్ర జరిగిందని కాపులను తనవైపు తిప్పుకునే ఎత్తుగడ వేశాడు. మరి ఆయన అడుగులు వైసీపీ వైపు పడితే కాపుల్లోనూ చీలిక వస్తుంది. కొందరు టీడీపీకి, మరికొందరు వైసీపీకి మధ్య చీలిపోవడం ఖాయం.. ఇలా కాపుల ఐక్యత అనేది ఏపీలో సాధ్యంకాకపోవచ్చు.
-కాపుల కొత్త పార్టీ ఒంటరిగానా? టీడీపీ, వైసీపీకి కోవర్టుగానా?
కాపుల ఐక్యత పేరుతో నాయకుల ఐకమత్యం ఇలాగే కొనసాగి ఒకవేళ నిజంగానే కొత్త పార్టీ పుడితే వారి మద్దతు ఎటు అన్నది ఇప్పుడు ప్రశ్న.. ప్రస్తుతం టీడీపీ, జనసేన, వైసీపీకి మద్దతుగా ఉన్న నేతలు ఒక గొడుగు కిందకు వచ్చారు. బహుశా జనసేన కాపుల పార్టీ కావడంతో ఆ పార్టీతో వెళితే వీరంతా బీజేపీతోనూ కలిసినట్టే. ఎందుకంటే జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఇక వీరిద్దరూ టీడీపీతోనూ కలిస్తే కాపు ఓటు బ్యాంకు చీలకుండా వైసీపీ ఓడుతుంది. అయితే వైసీపీకి మద్దతుగా నిలిస్తే ఈ మూడు పార్టీల మధ్య ఓట్లు చీలి మళ్లీ వైసీపీకే లాభం జరుగుతుంది. జనసేన-బీజేపీ వైపు కాపులు నిలబడితే వారికి మెరుగైన అవకాశాలుంటాయి. ఒకవేళ టీడీపీతో వెళదామనుకుంటే బీజేపీ పెద్దలు.. అమిత్ షా అందుకు ఒప్పుకునే అవకాశాలు లేవు. చంద్రబాబును కలుపుకోవద్దని చెప్పడం వల్ల వీరి గ్రూపు అంగీకరిస్తుందా? టీడీపీకి దూరం జరుగుతుందా? అన్నది ప్రశ్న.. కాపుల కొత్త పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నారని.. టీడీపీయే ఎంకరేజ్ చేస్తోందని ఆ పార్టీని దూరం పెట్టే అవకాశాలు లేవంటున్నారు. మరి బీజేపీ దీనికి దూరం జరుగుతుందా? అన్నది డౌటు. టీడీపీతో పొత్తు లేదని తెలిస్తే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా? బీజేపీతో కలిసి కాపుల కొత్త పార్టీతో వెళుతాడా? లేక టీడీపీని కలుపుకుంటాడా? అన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కాపుల మద్దతు కోసం చంద్రబాబు ఇలా కొత్త పార్టీ పుట్టిస్తే మాత్రం ఆయనే ఇందులో కీలక పార్టీగా ఉండే అవకాశాలున్నాయి.
పవన్ తో కనుక కాపుల పార్టీ కలిస్తే చంద్రబాబును అందులోకి ఆహ్వానిస్తే.. దీన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని దూరం పెట్టే అవకాశాలుంటాయి. చంద్రబాబును ఇందులో ఇన్ వాల్వ్ చేసేలా చేస్తే మాత్రం కాపు ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ దిశగా చొరవ చూపుతాడా? బీజేపీ పెద్దలను ఒప్పిస్తాడా? అన్నది వేచిచూడాలి. ఒకవేళ టీడీపీని కాదని కాపు పార్టీ జనసేనతో వెళితే చంద్రబాబు ఏం చేస్తాడన్నది ఇక్కడ ఆసక్తి రేపుతోంది. కాపుల కొత్త పార్టీ వెనుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ఈ పరిణామం షాక్ లాంటిది. ఈ క్రమంలోనే ఈ కాపు నేతలందరూ కలిసి ఒక వేదికపైకి వస్తారా? కాపులు వీరి వెంట రాగలరా? అన్నది కూడా ఇక్కడ కీలక పరిణామం. ఇలా కాపుల కొత్త పార్టీ వెంట ఇప్పుడు అటు చంద్రబాబు.. ఇటు జగన్ కాచుకు కూర్చున్నారు. జనసేన+బీజేపీలు కలిసి ఈ కొత్త పార్టీతో వెళితే మాత్రం ఏపీలో ఆ పార్టీకి అనూహ్యమైన మద్దతు లాభాలు..చివరకు రాజ్యాధికారం ఖాయం. ఆ దిశగా ఏపీ రాజకీయం సాగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.