TRS ‘rice’ fight: ఉద్యమాలతో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం చేయడమే నేరం అవుతోంది. ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, కార్మికుల హక్కుల, ఉద్యోగుల డిమాండ్లపై ప్రజాస్వామ్యంలో ఉద్యమించే హక్కు రాజ్యాంగం కలిపించింది. అన్యాయం జరిగినప్పుడు.. హక్కులకు భంగం కలిగినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చేయడం పరిపాటు.. తెలంగాణ పుట్టుకకు కారణమైన ఉద్యమం మాట వింటేనే పాలకు ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. శాంతిభద్రత సమస్య పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై లాఠీలు ఝళిపిస్తున్నారు. ముందస్తు అనుమతి కోరితే వెంటనే తిరస్కరిస్తున్నారు. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి అనుమతి లేకుండా ఆందోళన చేసినా.. రాస్తారోకోలు, కలెక్టరేట్లు ముట్టడించినా తెలంగాణ దగ్గరుండి భద్రత కల్పిస్తున్న పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వాళ్లకేమో భద్రత.. వీళ్లకేమో అభద్రతా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

-ప్రజాస్వామ్యమా.. రాజరికమా?
తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే రాచరిక పాలన నడుస్తుందా.. లేక భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కల్వకుంట్ల రాజ్యాంగం అములు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఉద్యమం చేసే అవసరం ఉండదు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ను సీఎం కేసీఆర్ ఎత్తివేశారు. హైకోర్టు జోగ్యంతో ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ధర్నా చౌక్‌ను సాధించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు ధర్నా చేయడం నేరమవుతోంది. శాంతిభద్రతల సమస్య, ట్రాఫిక్ సమస్యల తలెత్తుతుందని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు అనుమతి కోరినా పోలీసులు వెంటనే తిరస్కరిస్తున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాలని అధికార టీఆర్‌ఎస్ మాత్రం అదే ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తే పోలీసులు వెంటనే అనుమతి ఇచ్చారు. పైగా ముఖ్యమంత్రి, మంత్రులు ఆందోళనలో పాల్గొనడంతో దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారు. ఇక జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీనగర్‌లోని తన స్వగృహంలో దీక్ష చేస్తానంటే పోలీసులు కరోనా నిబంధన, శాంతిభద్రతల సమస్య పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇంట్లో దీక్ష చేస్తే శాంతిభద్రతల సమస్య అనడంపై విమర్శలు వచ్చినా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసుల సహాయంతో బండి సంజయ్ ఇంటి తలుపులు పగులగొట్టి.. ఆయను అరెస్ట్ చేయించింది.
యాసంగిలో రైతులు వరి వేయొద్దు అన్న కేసీఆర్ తన ఫాంహౌస్‌లో వరి వేశారని ఆధారాలతో బయట పెట్టిన రేవంత్‌రెడ్డి, రైతులతో కలిసి చలో ఎర్రవల్లికి పిలుపునిచ్చారు. దీంతో ఉలిక్కి పడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసులతో రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయించారు. ఇక్కడ కూడా పోలీసులు శాంతి భద్రతల సమస్యనే సాకుగా చూపించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఆయనను అరెస్ట్ చేశారు.
ఇక ఇటీవల కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీజేపీ–టీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి నాయకులు వచ్చారు. కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన తరలివెళ్లారు. ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి స్వాగతం పలికిన పోలీసులు మరుసటి రోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందేర్, రఘునందర్‌రావు, రాజాసింగ్ సిరిసిల్ల బయల్దేరితే వారిని మార్గం మధ్యలలోనే అడ్డుకున్నారు.
-వరి పోరుకు ఫుల్ సెక్యూరిటీ..
తెలంగాణలలో యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ఈనెల 4 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. 4న మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు, 6న జాతీయ రహదారులు దిగ్బంధించారు. 7న కలెక్టరేట్లు ముట్టడించారు. ఈ ఆందోళనలకు తెలంగాణ పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. దగ్గర ఉండి సపర్యలు చేస్తున్నారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆందోళనలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. 7న విద్యుత్ సౌధ ముట్టడిని కాంగ్రెస్ నాయకులు చేపట్టారు. కలెక్టరేట్ల ముట్టడికి సెక్యూరిటీ ఇచ్చిన పోలీసులు విద్యుత్ సౌధ ముట్టడిని భగ్నం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకులను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును ముందే పసిగట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందురోజే కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలను అణచివేసేందుకు టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నాయకుల జాతీయ రహదారుల దిగ్బంధంతో రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినా.. ప్రజలు ఎంత ఇబ్బంది పడినా పట్టించుకోని పోలీసులు గంటలపాటు సాగిన రహదారుల దిగ్బంధానికి మద్దతు ఇచ్చారు. విద్యుత్ సౌధ ముట్టడికి వెళితే మాత్రం ట్రాఫిక్ అంతారయం.. శాంతిభద్రతల సమస్య అంటూ అనుమతి ఇవ్వవకపోగా, నాయకులను అరెస్ట్ చేశారు.
ఇలాంటి పరిస్థితి చూస్తుంటే పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయి. మరోవైపు రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కు అణచివేత చూస్తుంటే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగమే అమలు చేస్తున్నట్లు అర్థమవుతోందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.