Vizag MP family Kidnap : నేర ప్రవృత్తి వెనుక చాలా వ్యధలు ఉంటాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మనసును కకావికలం చేస్తాయి. నేరాల వైపు పురిగొల్పుతాయి. పుట్టుకతోనే ఎవరూ నేరస్థుడు కాడు. నేర ప్రవృత్తి కలిగిన కుటుంబాల్లో కూడా మంచి వారుంటారు. అలాగే మంచి కుటుంబం నుంచి నేరాల వైపు అడుగులు వేసిన వారూ ఉన్నారు. ఇదంతా విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ నిందితుడు గురించే. ఈ కిడ్నాప్ లో ప్రధాన భూమిక పోషించింది హేమంత్. విలాసాలకు అలవాటుపడిన ఈ యువకుడు ఓ సాధారణ కుటుంబానికి చెందిన వాడు. చార్డండ్ అకౌంటెంట్ కోర్సులో చేరి డిస్కంటీన్యూ చేశాడు. విలాసవంతమైన జీవితానికి, వ్యసనాలకు అలవాటుపడి నేర ప్రవృత్తిని ఎంచుకున్నారు.
కోలా వెంకట హేమంత్ అలియాస్ హేమంత్ ది చాలా సాధారణ కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. హేమంత్ తో పాటు మరో సోదరుడు ఉన్నాడు. దంపతులిద్దరూ కష్టపడి పనిచేసి పిల్లలిద్దర్నీ చదివించారు. హేమంత్ ను చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులో చేర్పించారు. తమ్ముడు బాగా చదివి ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే విలాసాలకు, వ్యసనాలకు అలవాటుపడిన హేమంత్ సీఏ కోర్సును డిస్కంటిన్యూ అయ్యాడు. గంజాయి, మద్యం తాగుతూ కొన్ని ముఠాలతో దగ్గరయ్యాడు. నేరాలకు దిగి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు.
హేమంత్ పై ఇప్పటివరకూ 12 కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసు, 3 కిడ్నాపింగ్ లు, 3 గంజాయి కేసులు తీవ్రమైనవి. విశాఖ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇతడిపై రౌడీషీట్లు సైతం తెరిచారు.కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డిని ఇంట్లో హతమార్చిన ఘటనలో ప్రధాన ముద్దాయి. బెదిరింపుల్లో స్పెషలిస్ట్. రియల్టర్, సీనియర్ పొలిటీషియన్ పాసి రామక్రిష్ణను బెదిరించి కోటి రూపాయలు పట్టుకుపోయాడు. మరో రియల్టర్ మధును కిడ్నాప్ చేసి రూ.7.50 లక్షలు వసూలు చేశాడు. పోలీసులకు పట్టుబడడంతో జైలు జీవితం అనుభవించాడు. మేలోనే జైలు నుంచి విడుదలయ్యాడు. డేగ గ్యాంగ్ తో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ నకు వ్యూహరచన చేశాడు.
కిడ్నాప్ ఉదంతంలో చాలారకాలుగా అనుమానాలున్నాయి. ఒక్క డబ్బు కోణంలో కాకుండా వ్యాపార, రాజకీయ కోణాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎంపీతో హేమంత్ కు పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. సెటిల్ మెంట్ ఇతరత్రా లావాదేవీల ఫలితం మూలంగానే కిడ్నాప్ జరిగినట్టు చర్చ నడుస్తోంది. లేకుంటే విశాఖకే బిగ్ షాట్, ఆపై ఆర్థిక, రాజకీయ, అంగ బలమున్న ఎంపీ కుటుంబసభ్యులపై కత్తిపెట్టారంటే ..ఏదో బలమైన కారణముందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మరి తెర వెనుక ఏం జరిగి ఉంటుందో పోలీసులకే తెలియాలి. అయితే ఇప్పటివరకూ విశాఖ నగరానికే పరిమితమవుతూ వస్తున్న హేమంత్ దందా ఈ ఇష్యూతో బయట ప్రపంచానికి తెలిసింది.