Petrol Price: దున్నపోతు మీద వానపడితే చలనం ఉంటుందా? అలాగే పెట్రో మంటల్లో జనాల అరుపులు ఈ పాలకులకు వినిపిస్తాయా? అంటే అస్సలు వినిపించే ఛాన్స్ యే లేదంటారు. రాజకీయ పార్టీలు , నేతలకు ఎన్నికలొస్తేనే ప్రజాసమస్యలు గుర్తుకు వస్తాయి. ఎన్నికలు ఉంటేనే వారి కష్టాలు చెవికి ఎక్కుతాయి. నాలుగేళ్లు ప్రజలు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా స్పందించని పాలకులు ఎన్నికలు వస్తున్నాయనగానే వరాల వాన కురిపిస్తారు. తాజాగా తెలంగాణలో హుజూరాబాద్ పై అలాగే కనకవర్షం కురుస్తోంది. సీఎం కేసీఆర్ సార్ పథకాలన్నీ ఇక్కడే కుమ్మరిస్తున్నాడా? అన్నట్టుగా మారింది.

ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ వంతు వచ్చేసింది. దేశంలో చుక్కలనంటుతున్న పెట్రోల్ ధరలపై సామాన్యులు రగిలిపోతున్నారు. మోడీ సర్కార్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పుడు వారి పగ తీర్చుకునే సమయం వచ్చేసింది. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రజలంతా బీజేపీ ధరల మోతకు వాతపెట్టేందుకు రెడీ అవుతున్నారట..
ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దేశంలో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం రెడీ అవుతోందట.. అదేదో ప్రజలపై ప్రేమతో కాదు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తమను ఓడిస్తారన్న భయంతోనేనట..
పెరగడం తప్పితే ఇక తగ్గవన్నట్టుగా దేశంలో పెట్రోల్ రేట్లు పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే లీటర్ రూ.110 దాటేసింది. 200 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాలు కొండెక్కాయి. భారీగా రేట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
త్వరలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. చమురు ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆర్థికశాఖతో కేంద్రం సంప్రదింపులు జరుపుతూ పెట్రోలియం శాఖకు దిశానిర్దేశం చేయబోతున్నారట..
చమురు ధరలపై అధిక పన్నులను తగ్గించి ట్యాక్స్ విషయంలో ప్రజలపై భారం తగ్గించడానికి యోచిస్తున్నారట.. ఇక ఎల్పీజీ సబ్సిడీని కేంద్రం సమీక్షించాలని డిసైడ్ అయ్యిందట..చమురు కంపెనీలతో చర్చకు దిగుతోందట.. సౌదీ అరేబియా, రష్యా చమురు కంపెనీలతో ధరలు తగ్గించేందుకు చర్చలు జరుపుతోంది.
కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే వచ్చే మూడు నెలలు బ్యారెల్ చమురు ధర 70 అమెరికన్ డాలర్లు ఉండాలని.. అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఎన్నికల వరకూ తగ్గించి మళ్లీ మోత మోగిస్తారన్న మాట.. మరి మోడీ సార్ చేస్తున్న ఈ మాయాజాలానికి ఆయన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ప్రజలు ఇస్తారన్నది వేచిచూడాలి.