Modi punjob Tour: దేశానికి ప్రధాని.. అన్ని రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించే నేత.. అలాంటి నేత దేశంలో పర్యటించినా.. విదేశాల్లోకి వెళ్లినా ఎంతో భద్రత ఉంటుంది. అంతటి దేశాధినేతకు ఈ పంజాబ్ వాళ్లు షాకిచ్చారు. నడిరోడ్డుపై నిలబెట్టి అవమానించారు. అక్కడి ప్రభుత్వం ఇతోధికంగా దీనికి సాయం చేసింది. పంజాబ్ వాళ్లు చేసిన అవమానాన్ని మోడీ తన జన్మలో మరిచిపోలేడేమో.. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా నెత్తిన పెట్టుకునే మోడీని ఈ పంజాబ్ వాళ్లు అవమానించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పంజాబ్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్నీ మధ్య అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం అయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్ వాదిలాగానే ఉన్నట్టున్నాడు. ఏకంగా ప్రధాన మంత్రి పర్యటనకు సెక్యూరిటీ కల్పించకుండా తమ ప్రత్యర్థి పార్టీ అధినేతకు గట్టి షాక్ ఇచ్చారు.
పంజాబ్ లో పర్యటిస్తున్న ప్రధాన మోడీకి నిరసన సెగ గట్టిగా తగిలింది. ఆందోళనకారులు రహదారిని నిర్భందిచడంతో మోడీ ఏకంగా 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయారు. ఫలితంగా మోడీ తన పర్యటననే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మండిపడింది..
ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా హుస్సేనీవాలాలో జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించేందుకు నేడు భఠిండా చేరుకున్నారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం సరిగా లేకపోవడంతో హెలిక్యాప్టర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గాన బయలు దేరారు. ఇదే పంజాబ్ లోని నిరసనకారులకు వరమైంది.
అయితే మోడీ రోడ్డు మార్గంలో కాన్వాయ్ లో వస్తున్నాడని పంజాబ్ డీజీపీకి, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయినా కూడా వాళ్లు నిర్లక్ష్యం చేశారు. మోడీకి కావాలనే షాకిచ్చినట్టున్నారు.
మోడీ ప్రయాణించే మార్గంలో భద్రత అధికారులు సరైన సెక్యూరిటీ కల్పించలేదు.మోడీ కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునే సరికి అప్పటికే కొందరు ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో ఫ్లైఓవర్ పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాని మోడీ కాన్వాయ్ కూడా ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది.
ప్రధాని వెంట ఉండే హైసెక్యూరిటీ వాహనాల నుంచి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు మోడీ ఫ్లైఓవర్ పైనే కాన్వాయ్ లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ అవమానానికి ఏమైందో కానీ మోడీ వెనుదిరిగి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు.
నిజానికి ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో కఠినమైన భద్రత ప్రోటోకాల్స్ ఉంటాయి. చుట్టుపక్కల కి.మీల వరకూ ఎవరిని అనుమతించరు. కానీ ప్రధానినే ట్రాఫిక్ లో చిక్కుకునేలా చేసి పంజాబ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఈ పరిణామం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది.

