Pawan Chandrababu’s alliance : పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై సరికొత్త సంకేతాలిచ్చారు. అయితే వీరి భేటీపై రకరకాల ప్రచారం ఊపందుకుంటోంది. పొత్తుల లెక్క తేలిపోయిందని.. ఇక సీట్లు ప్రకటించడమే ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే రాజకీయ ప్రత్యర్థులు, వారిని సపోర్టు చేసే మీడియా మాత్రం రకరకాల కథనాలు వండి వార్చుతోంది. రెండు పార్టీల మధ్య అయోమయం, గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. జగన్ సొంత మీడియా సాక్షిలో అయితే అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. పవన్ ను రాజకీయంగా పలుచన చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
తేలిన పొత్తు?
ప్రధానంగా పవన్, చంద్రబాబుల మధ్య పొత్తులు, సీట్ల లెక్క తేలిపోయిందన్న ప్రచారం ప్రారంభించారు. సీఎం పదవి విషయంలో షేరింగ్ కు సైతం చంద్రబాబు ఒప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. తొలి రెండున్నరేళ్లు చంద్రబాబు, తరువాత రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ సీఎం పదవిలో ఒప్పందం చేసుకున్నారని సైతం ప్రచారం చేయడం ప్రారంభించారు. తద్వారా టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఒకరకమైన భావోద్వేగాలు సృష్టించి.. రెండు పార్టీల శ్రేణుల మధ్య అగాధం సృష్టించాలన్నదే ప్లాన్. అందుకే నీలి మీడియా పనిగట్టుకొని.. పదేపదే ఇటువంటి కథనాలనే ప్రసారం చేస్తోంది.
రెండు పార్టీల మధ్య స్నేహం..
చంద్రబాబును పవన్ కలవడం నిజం. చర్చలు జరపడం వాస్తవం. గత కొద్దిరోజులుగా వైసీపీ సర్కారుపై జనసేన దూకుడుగా కలబడుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ వైఖరిపై పోరాటం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ సైతం గట్టిగానే యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కలిసి పోరాటం చేద్దామని ఇరువురు నేతలు ఎనాడో చెప్పారు. అందుకు అనుగుణంగా భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించారన్న రీతిలో వారి భేటీకి విభిన్న ప్రచారం కల్పించడంలో నీలి మీడియా ముందంజలో ఉంది.
అభిమానుల ఆరాటం
పవన్ ఈసారి ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు, జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో సమీకరణలతో ఆ చాన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. సీట్లు, ఓట్లు పరంగా నిర్ణయాత్మక శక్తిగా మారతామని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ విముక్త ఏపీ కోసం పవన్ గట్టిగానే పరితపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో భాగస్వామ్య ప్రభుత్వంతోనే రాజ్యాధికారం సాధ్యమని భావిస్తున్నారు. అటు పవన్ లేకుండా ఒంటరిగా వెళ్లడం అసాధ్యమని చంద్రబాబుకు తెలుసు. అందుకే పవన్ అంటే ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. ఈ క్రమంలో టీడీపీని బతికించుకోవాలంటే సీఎం పదవి షేరింగ్ ఇచ్చేందుకు సిద్ధపడినట్టు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పవన్ నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.,