Pawan Kalyan Vaaraahi : జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ‘వారాహి’తో ఏపీ ఎన్నికల యుద్ధాన్ని చేయాలని డిసైడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ పాలన నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో ఉంటున్న పవన్ ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల రేసులో అన్ని పార్టీలకంటే ముందుండాలని భావిస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఎన్నికల వేళ నిరంతరం ప్రజల్లో ఉండేందుకు ప్రచార రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అంతే కాదు.. ఆ రథానికి ‘వారాహి’ అని సరికొత్త పేరు పెట్టారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ వాహనం ట్రయల్ రన్‌ను ఆయన పరిశీలించారు. మరి అసలు ‘వారాహి’ అంటే ఏమిటి? ఈ కొత్త రథం పేరు వెనుక అర్థమేంటి? అన్న దానిపై స్పెషల్ ఫోకస్.

-‘వారాహి’తో ఎన్నికల కదనరంగంలోకి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పటికే అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. త్వరలో బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక వాహనం సిద్ధం చేయించుకున్నారు. అది ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ వాహనంలో జనసేనానిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వంపై పోరాడనున్నారు.
-ట్విట్టర్‌లో ‘వారాహి’ అదిరిపోయే వీడియో
ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వాహనం చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ.. వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. వారాహి వాహనాన్ని పరిశీలిస్తున్న ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్, జనసేన నేతలు వైరల్ చేస్తున్నారు.

-హైదరాబాద్‌లో ట్రయల్ రన్..
ఎన్నికల యుద్ధ రథం ‘వారాహి’కి జన సేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో బుధవారం ట్రయల్ రన్ చేయించారు. ఈ మేరకు ట్రయల్‌ను పవన్ స్వయంగా పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు.
-వారాహి అంటే..
పవన్ తన యుద్ధ రథానికి వారాహి అని పేరు పెట్టారు. ఇందుకు ప్రత్యేకత ఉందంటున్నారు విశ్లేషకులు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు ‘వారాహి’. అమ్మవారి ఆశీర్వాదం ఉంటే విజయం వరిస్తుందని అందరి నమ్మకం. ఎన్నికల యుద్ధానికి రథం సిద్ధం చేసుకున్న జనసేనాని.. ఈ యుద్ధంలో అమ్మవారి ఆశీర్వాదంతో గెలవాలని భావిస్తున్నారు. అందుకే ప్రచార రథానికి ఆ అమ్మవారి విజయానికి సంకేతమైన ‘వారాహి’ పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా ‘వారాహి’ని పురాణాలు చెబుతాయి. అమ్మవారి సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాల్లో ఉంది. ఏపీ ప్రజల పాలిట జగన్ రాక్షసుడిగా మారాడని భావిస్తున్న పవన్.. ఎన్నికల్లో వైసీపీ పాలనను సంహరించడానికే తన ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టాడని జనసేన నేతలు పేర్కొంటున్నారు.
-అత్యాధునిక టెక్నాలజీతో.. మెరుగైన హంగులు..
ఎన్నికల రథాన్ని సిద్ధం చేస్తున్న జన సేనాని పవన్.. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన హంగులు ఉండేలా చూస్తున్నారు. స్వయంగా ఆయన దగ్గరుండి దీనిని తయారు చేయించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. మార్పులను సూచించారు. ఈ వాహనాన్ని మొదట పూణేలో తయారు చేయించాలని పార్టీ నేతలు భావించారు. కానీ, తరువాత పవన్ సూచన మేరకు హైదరాబాద్‌లోనే సిద్ధం చేయించారు. చివరకు అదిరిపోయే లుక్‌తో అత్యాధునిక వసతులతో ‘వారాహి’ రెడీ అయింది.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022