pawan kalyan yuva shakti sabha : జనసేనాని పవన్ కళ్యాణ్ ‘రణస్థలం’ వేదికగా అధికార వైసీపీతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటంలో ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. జనం కోసం చచ్చిపోవడానికి నేను రెడీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడే నన్ను చంపుతామని బెదిరించారని.. వీళ్ల అయ్యను తట్టుకున్న నాకు జగన్ ఓ లెక్క కాదంటూ పవన్ వ్యాఖ్యానించారు.

మహా అయితే ప్రాణం పోతుందని.. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతానని పవన్ అన్నారు. మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినో తిట్టడానికి సభ పెట్టలేదన్నారు.

వైసీపీ నేతలు, జగన్ తనను టార్గెట్ చేశారని.. తన గొంతు నొక్కాలని చూస్తున్నారని.. సెక్యూరిటీ ముప్పు కూడా తనకు ఉందని పవన్ తెలిపారు. ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రజల మద్దతు కావాలంటూ పిలుపునిచ్చారు. తాను రోడ్ల మీదకు వస్తానని.. జనం కోసం దెబ్బలు తింటానని.. మీరు నాతోపాటు ప్రజస్వామ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని కోరారు. కేసులు, దెబ్బలు తట్టుకొని నిలబడితేనే నాడు స్వాతంత్ర్యం వచ్చిందని.. నేడు వైసీపీ పాలన నుంచి విముక్తి కలుగుతుందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు పోతాయని భయపడవద్దని.. తాను వస్తే ఆ పథకాలను నీతిగా నిజాయితీగా మరింతగా పెంచి పారదర్శకంగా ఇస్తానని.. జనసేనకే ఓటు వేయాలంటూ పవన్ కోరారు. మీ ఆవేశాన్ని సీఎం సీఎం అంటూ అరవడంలో కాదు.. కేవలం ఓటు వేయడంలో చూపించాలని యువతకు హితబోధ చేశారు.
ప్రతీ వెధవ, సన్నాసి చేత తాను మాటలు పడుతున్నారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తనకు ఆ బాధ లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకపోతే తనను తిట్టే వాళ్లు కూడా తనతో ఫొటోలు దిగేవాళ్లేనని పవన్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం కూడా తాను విజయంగానే భావిస్తానని జనసేననా స్పష్టం చేశారు.
https://www.youtube.com/watch?v=isNbBhadnck