
Pawan Kalyan : ఏ రంగంలోనైనా పరాజయం ఎదురైతే ఎదురెళ్లి ఫైట్ చేసేవారు తక్కువ. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని పక్కకు తప్పుకున్న వారే ఎక్కువ. ప్రధానంగా రాజకీయ రంగంలో ప్రతికూల ఫలితాలు ఎదురైతే చాలామంది మనకెందుకొచ్చింది ఈ గొడవ.. ప్రజలు పట్టించుకోనప్పుడు మనమెందుకు వారి గురించి పట్టించుకోవాలన్న కాన్సెప్ట్ తో సైడయిపోతారు. మరికొందరు మొండిగా ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తారు. అయితే ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఇటువంటి పట్టుదల గుణం కనిపిస్తోంది. అటు సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలో రాణించడం గొప్ప విషయం. విపరీతమైన స్టార్ డమ్ ఉండి.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన్ను ప్రజా క్షేత్రంలో ఓడిపోయినా నిరాశ చెందలేదు. ప్రజలను నిందించలేదు. పరాజయానికి కృంగిపోలేదు. గెలుపు కోసం పోరాడుతునే ఉన్నారు.

వరంగల్ నిట్ లో మెరిసిన పవన్…
రాజకీయేతర వేదికలను పవన్ పంచుకున్న సందర్భాలు తక్కువ. కానీ వరంగల్ నిట్ కాలేజీలో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు అక్కడి నిర్వాహకులు పిలిచారు. దీంతో హాజరైన పవన్ తాను ఎందుకీ కార్యక్రమానికి హాజరైంది విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశారు.ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
నేర్చుకోవడంఎప్పుడూ మానకూడదని.. ఫెయిల్యూర్స్ విజయానికి సోపానాలుగా మలచుకోవాలని స్టూడెంట్స్‌కు సూచించారు.ఇవాళ ఫెయిల్ అయితే .. రేపు విజయం సాధిస్తా. తానేప్పుడు ఫెయిల్యూర్స్ నుంచి మాత్రం పారిపోలేదని చెప్పారు. చిన్నప్నటి నుంచి లియోనార్డో డావిన్సీ నా రోల్ మోడల్‌గా తీసుకున్నానని చెప్పారు. ఖుషీ సినిమా సమయంలో న్యూజిలాండ్ దేశానికి వలస వెళ్లిపోదామనుకున్నానని.. ఇమ్మిగ్రేషన్ పేపర్స్ కూడా తెప్పించుకున్నానంటూ కీలక కామెంట్స్ చేశారు పవన్. ఒక నెల పాటు ఆ పేపర్స్‌ని తనదగ్గర పెట్టుకొని.. కష్టమో నష్టమో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఇంటర్ ఫెయిల్ పై…
అయితే గతంలో విద్యా సంస్థల్లో కార్యక్రమాలకు వెళ్లే సమయంలో కూడా పవన్ తన ఫెయిల్యూర్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన విద్యార్థి దశలో జరిగిన ఘటనలన్నీ విద్యార్థులతో పంచుకున్నారు. ఇంటర్ లో ఫెయిలైన సంగతిని ప్రస్తావించారు. విద్యార్థులతో మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే చేశారు. ఇంటర్ పరీక్షల్లో తన తోటి విద్యార్థులు చీటిలు తీసుకెళ్లారని.. తాను మాత్రం ఫెయిలైతే అవుతాని కానీ.. స్లిప్ లను పట్టుకెళ్లనని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైనా.. నైతికంగా విజయం సాధించానని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను పవన్ కీర్తించారు. నెహ్రూ ముందుచూపుతో వ్యవహరించి నిట్ లను ఏర్పాటుచేశారని కొనియాడారు. ఇక్కడి విద్యార్థులు మంచి కొలువులను సాధించాలని ఆకాంక్షించారు.

ఆలోచింపజేసిన కామెంట్స్..
పవన్ కామెంట్స్ విద్యార్థులను ఆలోచింపజేశాయి. ఆయన పరిణితితో చేసిన మాటలు ఆకట్టుకున్నాయి. విద్యార్థి దశలో ఫెయిలైనా కృంగిపోకుండా.. సినిమారంగంలో ఎదగడం, రాజకీయ పార్టీ స్థాపించి ఫెయిల్యూర్స్ ఎదురైనా పవన్ చెక్కుచెదరక పోరాడుతున్న వైనం వారిని ఆకట్టుకుంటోంది. ఫెయిల్యూర్స్ కు భయపడకుండా.. గెలుపు కోసం పోరాటం చెద్దామన్న పవన్ మాటాలకు నిట్ విద్యార్థులు ఫిదా అవుతున్నారు. పవన్ అంతరంగాన్ని గుర్తెరిగిన ఉత్తరాధి రాష్ట్రాల విద్యార్థులు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఆయన హిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ తన మాటలతో విద్యార్థిలోకాన్ని ఆలోచింపజేశారు.