AP Politics Pawan Kalyan: ఏపీ రాజకీయాలు మరీ దిగజారిపోయాయి. బురదలో పంది బొర్లినట్టు నేతలు బూతులతో రెచ్చిపోతున్నారు. ఏపీలో సఖ్యత రాజకీయాలే లేవు. నీతిమంతమైన రాజకీయాలు చేయలన్న కనీస సృహ అధికార ప్రతిపక్షాల్లో కొరవడింది. 2014కు ముందు టీడీపీ మొదలుపెట్టిన ఈ బూతుల రాజకీయం, కక్షసాధింపు, వ్యక్తిగత విమర్శలను.. అధికారంలోకి వచ్చాక వైసీపీ అందిపుచ్చుకుంది. టీడీపీని మించి వైసీపీ ఎదురుదాడులు చేస్తోంది. దానికి ఇప్పుడు టీడీపీ అనుభవిస్తోంది. చంద్రబాబు మీడియా సాక్షిగా బోరున ఏడ్చారంటే వైసీపీ టీజింగ్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బూతుల రాజకీయాలను 2014లో టీడీపీ మొదలుపెట్టగా.. దాన్ని వైసీపీ ఇప్పుడు పతాకస్థాయికి చేర్చింది. వైసీపీ ధాటికి ఆఖరుకు ఎంతో సంయమనంతో తనది పాతికేళ్ల రాజకీయం అన్న పవన్ కళ్యాణ్ కూడా సహనం కోల్పోయారు. నిన్న చెప్పులు చూపించి.. వైసీపీ నేతలను తిట్టి పోస్తూ ఈ రాజకీయ రగడలో తనూ కూడా చెడిపోయిన పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల బూతులకు కౌంటర్లు ఇవ్వడానికి పవన్ కూడా ఆ యావలో పడిపోయిన వైనం అందరినీ విస్తుగొలిపేలా చేస్తోంది.

-2014లో మొదలుపెట్టిన అచ్చెన్నాయుడు, బోండా ఉమ
ఏపీలో ఈ బూతుల రాజకీయానికి ఆజ్యం పోసింది మాత్రం టీడీపీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది 2014 ఎన్నికల సమయం. జగన్ ను లక్ష కోట్ల దోపిడీదారు అని.. రౌడీ అని.. హంతకుడు అంటూ ఎన్నో మాటలను టీడీపీ నేతలు, చంద్రబాబు, దాని అనుకూల మీడియా అన్నది. జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. కోడికత్తి, వైఎస్ వివేకా నందరెడ్డి హత్యను జగన్ కే అంటగట్టారు. ఎన్నో హననాలు చేసింది టీడీపీ. వాటన్నింటిని భరించి, సహించి నాడు ప్రతిపక్షంలో ఏమీ అనలేక అధికారంలోకి వచ్చాక జగన్ కొరఢా ఝలిపిస్తున్నాడు. 2014లో గెలిచాక నాటి టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, బోండా ఉమాలు అసెంబ్లీ సాక్షిగా జగన్ ను ఎన్ని అనరాని మాటలు అనాలో అన్నీ అన్నారు. బూతులతో తిట్టిపోశారు.టీడీపీ అధికారంలో ఉండడంతో జగన్ ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అంత అవమానాలన్నీ భరించాడు. ఓర్పు వహించాడు. అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వడం మొదలుపెట్టాడు.
-2019 నుంచి ప్రత్యర్థుల పని పడుతున్న జగన్
2014లో గెలిచిన టీడీపీ జగన్ ను, రోజాను అసెంబ్లీలో ఎంతో అవమానించారు. తన మీడియా, సోషల్ మీడియాతో ట్రోల్స్ చేయించారు. వాటన్నింటిని మనసులో పెట్టుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక ముందుగా అచ్చెన్నాయుడు పని పట్టారు. అవినీతి కేసులో జైలుకు పంపారు. చుక్కలు చూపించారు. ఆయనపై వ్యక్తిగతంగా విమర్శలు దాడుల వరకూ వెళ్లింది. ఆ తర్వాత నీటి పారుదల శాఖ చూసిన బోండా ఉమా లూప్ హోల్స్ వెతికి మరీ బయటకు తీసి కేసులు పెట్టారు. ఆయనపై దాడులు, వ్యక్తిగత విమర్శలతో వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు టీడీపీలో కీలకంగా ఉండే అచ్చెన్నాయుడు, బోండా ఉమలు జగన్ ధాటికి సైలెంట్ అయిపోయారు. మీడియాలో, బయట కనిపించడమే మానేశారు. ఎవరూ యాక్టివ్ గా ఉంటే వారి మీద పడిపోయి ఆగమాగం చేసే దూకుడు పాలిటిక్స్ జగన్ చేస్తున్నారు. ఎవరు నోరెత్తితే చాలు ఆ సామాజికవర్గం నేతలను రంగంలోకి దించి బూతులు తిడుతూ వారిని మానసికంగా, శారీరకంగా హింసించే కొత్త ఎత్తుగడను జగన్ అమలు చేస్తున్నారు. ప్రజలు క్లియర్ కట్ మెజార్టీ ఇవ్వడం.. ఉప ఎన్నికల్లో గెలిపిస్తుండడంతో జగన్ ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది..
-పవన్ కళ్యాణ్ యే ఇప్పుడు వైసీపీ టార్గెట్
ప్రత్యర్థి టీడీపీ పని పట్టిన జగన్ కు ఇప్పుడు ప్రధాన టార్గెట్ పవన్ మాత్రమే. పవన్ ఎక్కడా తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నారు.మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ పై వ్యక్తిగత దాడిచేసినా ఆయన తొణకడం లేదు. మానసిక స్థైర్యం కోల్పోవడం లేదు. ఎంత తిట్టినా బెదరడం లేదు.. అదరడం లేదు. అందుకే వైసీపీ రూట్ మార్చేసింది. పవన్ కళ్యాణ్ ను నిర్బంధాలతో.. ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా పోలీసులను ప్రయోగిస్తోంది. విశాఖలో పవన్ ను ఎంతలా కట్టడి చేసిందో చూశాం.. నోటితో బదులిస్తే అంతకుమించి పవన్ ప్రతిస్పందన వస్తుండడంతో ఇక చేతలతోనే పవన్ ను కంట్రోల్ చేసే ఎత్తుగడను వైసీపీ అమలు చేస్తోంది. పవన్ ను ప్రజల్లోకి పోకుండా.. ఆయనకు క్రేజ్ దక్కకుండా ఫస్ట్రేషన్ కు గురిచేసి బరెస్ట్ అయ్యేలా చేస్తోంది.. వైసీపీ ఉచ్చులో ఇప్పుడు పవన్ పడిపోయాడనే చెప్పాలి..
-వైసీపీ ఉచ్చులో పవన్.. బూతులతో బరెస్ట్
వైసీపీ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ కూడా మారిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘సినిమాల్లో ఎంతో కూల్ గా.. బయట కూడా ప్రశాంతంగా ఉండే పవన్ అలా బరెస్ట్ అవ్వడం చూసి బాధ కలిగి తాను ఆయనకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను’ అని చంద్రబాబు అన్నారంటే పవన్ ఎంత విచక్షణ కోల్పోయి నిన్న మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఏది ఆశించి ఇదంతా చేసిందో అదే నిజమైంది. పవన్ సైతం ఈ బూతు రాజకీయంలోకి వచ్చేశారు. వైసీపీ బూతు నేతలకు అదే బూతులతో సమాధానం ఇస్తున్నారు. చెప్పు చూపించి.. ‘రండి రా నా కొడకల్లారా’ అంటూ ఠంగ్ స్లిప్ అయ్యారు. పాతికేళ్ల రాజకీయం అని.. ప్రజాక్షేమమే అజెండా అని.. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ బూతు రాజకీయం ఊబిలోకి వైసీపీ ట్రాప్ లోకి పడిపోతున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవు.
తెలంగాణలో బలమైన రాజకీయ పక్షాలు, నేతలు లేరు. ఇక్కడంత వేడి లేదు. కానీ ఏపీలో జగన్, చంద్రబాబు, పవన్ లాంటి ముగ్గురు ఉద్దండులు ఉన్నారు. జగన్ ను ఏడిపించడానికి.. నైతికస్థైర్యం దెబ్బతీయడానికి 2014లో టీడీపీ మొదలుపెట్టిన ఈ బూతుల రాజకీయం తిరిగి టీడీపీ మెడకే చుట్టుకుంది. జగన్ ను తిట్టిన దానికి పదింతలు చంద్రబాబు,టీడీపీ అనుభవిస్తోంది. అదే ఊపులో పవన్ కళ్యాణ్ ను బాధితుడిగా మార్చేసింది. ఈ ఏపీ బూతు రాజకీయాల్లో ‘నీతి నిజాయితీ’ అంటూ ఎవరు తెల్లచొక్కతో నీట్ గా వచ్చినా కానీ ఆ బురదలోకి లాగేస్తున్నారు. వారికి బురద బూతు పూసేస్తున్నారు. సో సచ్చీలమైన రాజకీయాలు ఏపీలో ఆశించడం అత్యాశే. ఆ బూతులతోనే సహజీవనం చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా మినహాయింపు కాకపోవడమే గమనార్హం.