Pawan Kalyan : పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టిడిపి, జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, అచ్చెనాయుడు, నాదెండ్ల మనోహర్ లాంటి కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాలను ప్రకటించారు. పవన్ పేరును మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు ట్రెండింగ్లోకి వచ్చాయి. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని.. కాకినాడ ఎంపీగా బరిలో దిగుతారని ఇలా లేనిపోని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేదని ఈరోజు క్లారిటీ వచ్చింది.
గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? లేక ఒక అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతారా? పోటీ చేస్తే ఎక్కడి నుండి చేస్తారు? అన్న ప్రశ్నలు బలంగా వినిపించాయి. అయితే పొత్తుల నేపథ్యంలో భీమవరం నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. మరోవైపు పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అక్కడ 90 వేలకు పైగా కాపు ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన అక్కడి నుంచి పోటీ చేస్తే భారీ విజయం దక్కుతుందని అంచనా వేశారు. అదే సమయంలో ఎంపీగా పోటీ చేస్తారని.. కాకినాడ నుంచి బరిలో దిగాలని కేంద్ర పెద్దలు ఆదేశించినట్లు సైతం వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది.
ఇదే సమయంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేయబోవడం లేదని.. అక్కడ టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరతారని.. పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహగానాల నేపథ్యంలో రామాంజనేయులు మంగళవారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. పవన్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి వరకు పవన్ వెంట నడుస్తానని ప్రకటించారు. అందరూ అనుకున్నట్టు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని.. ఈ నియోజకవర్గ నుంచి పవన్ పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లు అయ్యింది. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పుకార్లకు తెరదించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.