తెలంగాణ వారు తరచూ విమర్శించే పదం ఒక్కటే.. ‘ఈ ఆంధ్రా పాలన నుంచి.. పాలకుల నుంచి తమకు విముక్తి కావాలని.. వారు పోరాడారు.. ఆంధ్రుల పాలన నుంచి బయటపడి స్వరాష్ట్రం సాధించుకున్నారు. అయితే ఇంతగా తెలంగాణ ప్రజలు, నేతలు ఆంధ్రోళ్ల పాలన అని ఎలుగెత్తి చాటినా కూడా.. ఆంధ్రాలోని మొత్తం ప్రాంతానికి ఈ అధికార పగ్గాలు దక్కలేదంటే అతిశయోక్తి కాదు. అవును ఇది నిజంగా నిజం.. ఉభయ గోదావరి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ ఏ ఒక్కరూ ఆ ప్రాంతం నుంచి సీఎంలు కాలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువగా రాయలసీమ వాళ్లు ఆ తర్వాత కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏపీలో మెజార్టీ ఉన్న కాపులు, ఉభయ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లాల వరకూ ఏ ఒక్కరూ సీఎం కాలేదు. ఇది నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉన్న చరిత్ర చెబుతున్న వాస్తవం ఇదే.. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. గోదావరి జిల్లాలకు చెందిన మొగల్తూరు వాసి పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశం దక్కింది. స్వాంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా కూడా ఈ ప్రాంత వాసి సీఎం కాలేని లోటు స్పష్టంగా ఉంది. మరి ఆ ప్రాంత ప్రజలు ఈసారి అయినా పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తారా? జనసేనను ఆదరిస్తారా? తమ ప్రాంతానికి ముఖ్యమంత్రి సీటును తెచ్చుకుంటారా? అన్నది వాళ్ల చేతుల్లోనే ఉంది. దీనిపై స్పెషల్ ఫోకస్..

-మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రరాష్ట్రంగా అవతరణ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. ఆంధ్ర ప్రాంతం నాడు మద్రాసు రాష్ట్రంలోనే ఉండేది. కాలక్రమేణ ఆంధ్రప్రాంతం వివక్షకు గురవుతుందనే కారణంగా ‘జై ఆంధ్ర’ ఉద్యమం వచ్చింది. దాని ఫలితంగా 1955 అక్టోబర్ 1న కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ‘ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పడింది. అనంతరం తెలంగాణను వివిధ ఒప్పందాలతో విలీనం చేసిన ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల పెత్తనంతో తెలంగాణ ఉద్యమం ఎగిసి చివరకు 1960వ దశకంలో పోరాటం ఉధృతమైంది. అలా ఆ భావన 2014 వరకూ కొనసాగి ఆంధ్రుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.
-రాయలసీమ నేతలదే ఏపీ ముఖ్యమంత్రి పీఠం..
ఉమ్మడి ఏపీలోనైనా.. విడిపోయిన ఏపీలోనైనా ఇన్ని వైరుధ్యాలు ఏ రాష్ట్రంలో లేవు. వింతవింత అనుభవాలు.. కోస్తా ఆంధ్రా వాళ్లు దోపిడీగాళ్లు అన్న భావన చాలా ఎక్కువగా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే.. గణాంకాలు వేరుగా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీలో 175 అసెంబ్లీ స్థానాలుంటే.. కోస్తా ఆంధ్రాలో 120 స్థానాలు, రాయలసీమకు 55 స్థానాలు ఉంటాయి. కోస్తా ఆంధ్రాలో మూడింట రెండొంతుల సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రుల పరంగా చూస్తే.. 1953న ఏపీ ఏర్పడినప్పటి నుంచి గమనిస్తే.. ఎవరు ఎక్కువ కాలం పరిపాలించాలని లెక్కలు చూస్తే ఆశ్చర్యకలుగకమానదు. రాయలసీమ వాసులు 35 ఏళ్లు పాలించారు. కోస్తా ఆంధ్రా నేతలు 21 ఏళ్లు పాలించారు. తెలంగాణ నుంచి 10 ఏళ్లు పాలించిన వారు ఉన్నారు. మిగతా అంతా రాష్ట్రపతి పాలన.. సాంకేతికంగా పరంగా చూస్తే ఇంకా ఎక్కువనే సీమ నుంచి సీఎంలు ఉన్నారు. రాయసీమ వాళ్లే ఎక్కువ కాలం సీఎం చేశారు. కోస్తాంధ్ర వాళ్లు దోపిడీదారులుగా ఇప్పటికీ ముద్రపడ్డారు. మరి దీనికి కారణం ఏంటంటే ఆంధ్రాలో ఉన్న సామాజికస్థితియే దీనికి ఆసలు కారణం.
-కోస్తాంధ్రాలో కూడా శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకూ సీఎంలే లేరు..
కోస్తాంధ్రా వాసులు 21 ఏళ్లు ఏపీని పాలించినా కూడా కోస్తాంధ్రాకు చెందిన శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లాల వరకూ ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి కాలేదంటే అతిశయోక్తి కాదు. ఏపీలో అత్యధిక సీట్లు, అత్యధిక జనాభా ఉండి కూడా ఈ ఉత్తరాంధ్ర వాసులు వీళ్లెవరూ ముఖ్యమంత్రులు కాలేదు. కారణం ఏంటన్నది అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న. ఆంధ్రలో ముఖ్యమంత్రులు అయినవారిని గమనిస్తే గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల వారే ముఖ్యమంత్రులయ్యారు. జనాభా అత్యధికంగా ఉన్న పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖ్యమంత్రులు కాలేదు.
-అత్యధికంగా ఉన్న కాపులు, బీసీలు ఎందుకు సీఎంలు కాలేరు..
ఏపీలో అత్యధిక జనాభా కాపులే. దాదాపు 28శాతం వరకూ ఉన్నారు. ఇక బీసీలు మెజార్టీగా ఉన్నారు. అయితే వీరిలో నాయకుల కొరత అనేది వెంటాడుతోంది. ఈ కాపు, బీసీల్లోంచి బలమైన రాష్ట్ర స్థాయి నాయకులు రాలేదు. కోస్తా ఆంధ్రా నుంచి ఈ 21 ఏళ్లు సీఎంలుగా చేసిన వారిని గమనిస్తే కృష్ణ నుంచి ఎన్టీఆర్, గుంటూరు నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలుగా చేశారు. అయితే వీళ్లంతా కాపులు, బీసీలు కాదు.. కమ్మ, రెడ్డి సామాజికవర్గం వారే కావడం గమనార్హం. ఉత్తర కోస్తాలో కాపులు, బీసీలు ఎక్కువగా ఉంటారు. మధ్య దక్షిణ కోస్తాలో దళితులు కాపుల జనాభా ఎక్కువ. వీళ్లు ఎవ్వరికీ ఎప్పుడూ అధికారం రాలేదు. సమాజంలో ప్రభావిత వర్గాలు ముఖ్యమైనవి. వాళ్లు యాక్టివ్ గా లేరు. నోరు తెరవలేని కాపులు, బీసీలు ఏరోజు ముఖ్యమంత్రి కాలేదు. అగ్రకులాల వారే ప్రభావితం చేసే వారే సీఎంలు అయ్యారు.
-1/3 వంతు ఉన్న రాయలసీమ నుంచే ఎక్కువమంది పాలకులు.. ప్రస్తుతం వాళ్లే
ఇప్పటి ఆంధ్రాలో కేవలం 1/3 వంతు మాత్రమే రాయలసీమ జనాభా ఉంది. అయినా ఎక్కువమంది ముఖ్యమంత్రులు వాళ్లే. ప్రస్తుతం చంద్రబాబు, జగన్ లు సీమవారే కావడం గమనార్హం. వీరే కాదు.. ఇప్పటికీ గతంలో ఏపీని పాలించిన వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఎక్కువ మంది సీమ వాసులే.. వారు 35 ఏళ్లు పాలించారు.
-ఈసారి ఉత్తరాంధ్ర వ్యక్తి సీఎం కావాల్సిందే.. పవన్ కు ఛాన్స్
ఇప్పటికైనా అధిక జనాభా ఉండి వాయిస్ లేకుండా ఉన్న కాపులు, బీసీలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఈసారి సీఎం పీఠం దక్కాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న ప్రాంతానికి సీఎం పీఠం దక్కాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మెజార్టీ ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఇన్నాళ్లు సీఎంలు అయ్యారు. 1/3 వంతు జనాభా ఉన్న రాయలసీమ వారికే ఎక్కువ కాలం పాలకులుగా ఉన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా ఎక్కువ జనాభా ఉన్న వారు అధికారానికి దూరంగా ఉన్న దాఖలాలు దేశంలో లేవు. కోస్తా ఆంధ్రాకు ఇప్పటికైనా అధికారం చవిచూడాల్సిన అవసరం ఈసారి ఏర్పడింది. వీళ్లమీదనే దోపిడీదారులు, పాలకులుగా ముద్రవేశారు. అందుకే ఈసారి ఈ ప్రాంతానికి చెందిన పవన్ ను సీఎంగా చేయాలి. ఈ వెనుకబడిన అధికారానికి దూరమైన వర్గానికి సీఎం పీఠం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
