Janasena 7 Ideologies : కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అలాంటి రాజకీయాలు చేస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన వీరమహిళలకు శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.తొలి విడతగా గుంటూరు, కృష్ణా జిల్లాల వీరమహిళలు ఈ తరగతుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు దేశంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా అధికారం సంపాదించేవరకూ బీజేపీ ఎదిగిందని.. ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కూడా అంతేనన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పురుషుల ఆధిక్యమే ఉందన్నారు. మా పార్టీలో మహిళలను చైతన్యవంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు.
తెలంగాణ భాష, యాసను గౌరవించడం లేదనే తెలంగాణ ఉద్యమం మొదలైందని.. ఒకరి భాషను, యాసను మరొకరు గౌరవించాలని పవన్ అన్నారు. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయవాదం రాదన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవన్నారు.
ఒక తల్లి, బిడ్డలకు కూడా విభేదాలుంటాయని.. అలాంటిది మనం విభిన్నమైన ప్రాంతాలు, కులాల మధ్య నుంచి ఒక చోటుకు వచ్చి ఒకేలా ఆలోచించాలంటే కష్టసాధ్యమైందన్నారు. మహిళలను చైతన్య వంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
-జనవాణి జనసేన భరోసా రేపే ప్రారంభం
జనవాణి జనసేన భరోసా కార్యక్రమం రేపు ప్రారంభం కానుంది. దీని గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ వివరించారు. “జనవాణి జనసేన భరోసా” కార్యక్రమం జులై 3న ప్రారంభం కానుందన్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు జరుగుతుందన్నారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఇది జరుగుతుందని వివరించారు.





