Karimnagar Assembly Constituency: కరీంనగర్.. ఉద్యమాల పురిటిగడ్డ. తెలంణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమం కరీంనగర్ నుంచే ఉవ్వెత్తున ఎగిసింది. ఇక తెలంగాణ ఉద్యమసారథి కె.చంద్రశేఖర్‌రావును ఉప ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ వాదాని గట్టిగా వినిపించింది. పోరాటాలు, ఉద్యమాలకు నెలవైన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 15 ఏళ్లుగా గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించిన గంగుల ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గంగులకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు సొంత పార్టీ నేతలే పావులు కదుపుతున్నారు. జనరల్ రిజర్వు అయిన నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, బంధువు అయిన నేత చక్రం తిప్పుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం.
మొదటి నుంచి జనరల్ స్థానమే..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జనరల్ స్థానంగానే ఉంది. 1957న తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొదటి ఎమ్మెల్యేగా వెలమ సామాజికవర్గానికి చెందిన జువ్వాడి చొక్కారావు విజయం సాధించారు. 1962లో అల్లిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. తర్వా చొక్కారావు రెండుసార్లు, జగపతిరావు ఒకసారి ఆనంద్‌రావు ఒకసారి.. కటకం మృత్యుంజయం, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, కటారి దేవేందర్‌రావు, ఎం.సత్యానారాయణ ఒక్కోసారి గెలిచారు. వీరంతా అగ్రవర్ణాలవారే. కిషన్‌రెడ్డి, మృత్యుంజయమ మినహా మిగతా అందరూ వెలమ సామాజికవర్గానికి చెందనవారే.
వెలమ కోటలో బీసీ పాగా..
వెలమల అడ్డాగా ఉన్న కరీంనగర్లో బీసీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కమలాకర్ 2009లో టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, రాజకీయ పరిణామాలు మారడంతో గంగుల టీడీపీని వీడారు. బీఆర్ఎస్, అలియాస్ టీఆర్ఎస్లో చేరారు. 2014, 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వరుసగా మూడు పర్యాయాలు వెలమ కోటలో బీసీ అభ్యర్థి గెలవడంతో ఆ సామాజికవర్గానికి మింగుడు పడడం లేదు. దీంతో అన్ని పార్టీల్లోని వెలమలు ఒక్కటవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వెలమనే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈసారి త్రిముఖ పోరే..
వరుసగా మూడుసార్లు గెలిచిన గంగులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దానిని అధిగమించేందుకు ఆయన ఇటీవల అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. మానేరు తీగల వంతెన, నగరంంలో కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్ల నిర్మాణం. తీగలగుట్టపల్లి రైల్వే వంతెన, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
గంగులకు వ్యతిరేకంగా పావులు..
ఇక సొంత పార్టీలోని వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలు గంగులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ బంధువు అయిన కీలక నేత వచ్చే ఎన్నికల్లో వెలమ అభ్యర్థిని నిలపాలని ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్‌కు సూచించినట్లు తెలిసింది. అవసరమైతే తానే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. గత మున్సిపల్ ఎన్నికల్లో బీసీని కార్పొరేషన్ మేయర్ చేయాలని మంత్రి గంగుల యత్నించారు. కానీ తెరవెనుక చక్రం తిప్పిన వెలమ నేత సీల్డ్ కవర్లో వెలమ సామాజికవర్గానికి చెందిన సునీల్‌రావు పేరును ప్రగతిభవన్ నుంచి వచ్చేలా చేశారు. అసెంబ్లీ టికెట్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందని గులాబీ వర్గాల గుసగుస. ఆర్థిక బలం, అంగబలం ఉన్న గంగులకు టికెట్ వచ్చినా ఓడించాలని చూస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నుంచి పొన్నమే..
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. ఫైర్ బ్రాండ్ గా పొన్నం ప్రభాకర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తారని సమాచారం. 2018లో కూడా ఆయన ఎమ్మెల్యేకు పోటీచేశారు. కానీ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో మరోమారు అదృష్టం పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ శిష్యుడిగా గుర్తింపు ఉన్న పొన్నంపై తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పార్లమెంటులోనే ఎంపీ లగడపాటి దాడి చేశాడు. వరుసగా రెండుసార్లు ఓడిపోయినందున ఈసారి సానుభూతి కలిసివస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి కూడా వెలమ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెస్సార్ కుమారుడిని బరిలో నిలిపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే పొన్నం స్థానికుడు కావడంతో ఈయనకు ప్రజల్లో మాంచి ఫాలోయింగ్, మాస్ లీడర్ గా పేరుంది.
బీజేపీ నుంచి ‘బండి’
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ, బీజేపీ మాసీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో గంగుల చేతిలో ఓడిపోయాడు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో వెలమ సామాజికవర్గానికి చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్‌పై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బండిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బండిసంజయ్ టీఆర్ఎస్ అభ్యర్థిని దాదాపు ఓడించినంత పనిచేశాడు. ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ కు పడకపోతే గెలిచేవాడే.. బండి మంచి లీడర్‌గా.. స్థానికుడిగా.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే యువనేతగా దూసుకుపోతున్నారు. ఈయనకు భారీగానే ఓట్లు చీల్చే సామర్థ్యం ఉంది.
కరీంనగర్లో గెలుపెవరిదో చెప్పడం కష్టం..
కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ బలంగా ఉన్నా పొన్నం, బండిని తక్కువ అంచనావేయడానికి లేదంటున్నారు. గంగులపై ఉన్న వ్యతిరేకత, సొంత పార్టీ నేతలే ఓడించాలని చూడడం గంగులకు మైనస్‌గా ఉన్నాయి. ఇక పొన్నం, బండికి కూడా అవకాశాలుంటాయి. టీఆర్ఎస్ ఢీకొని వీరిద్దరూ నిలబడతారా అన్నది వేచిచూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Overview of karimnagar assembly constituency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com