Fireworks pollution : దీపావళి.. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఇది ఒకటి. ప్రతి ఏటా కార్తీకమాసంలో ఈ పండుగ వస్తుంది. దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు కాబట్టి.. దానిని ప్రజలంతా దీపాల కాంతుల వెలుగుల్లో జరుపుకుంటారు. వెనుకటి రోజుల్లో ఈ బాణాసంచా కాల్చడం వంటివి ఉండేవి కాదు. రాను రాను పండగల పరమార్థం మారుతున్నట్టే.. దీపావళి అర్థం కూడా మారిపోయింది. దీపావళి అంటే ప్రమిదలను వెలిగించడంతోపాటు బాణాసంచా కూడా కాల్చాలనే ఒక సంప్రదాయం తెర పైకి వచ్చింది. సరే దీని వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనే విషయాన్ని పక్కన పెడితే.. కేవలం దీపావళి పండగ సందర్భంగా విక్రయించే బాణాసంచా ద్వారా వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. గతంలో డ్రాగన్ దేశం నుంచి బాణాసంచా మన దేశానికి దిగుమతి అయ్యేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల చైనా నుంచి బాణాసంచా దిగుమతి కావడం లేదు. ఇక ఈసారి బాణసంచా కాల్చే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆంక్షలు జారీ చేసింది.

-కాలుష్యం పెరుగుతోంది
గత దశాబ్దంతో పోలిస్తే వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. కాలుష్యాన్ని నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. పైగా కాలుష్యకారక పరిశ్రమలు వెలువరించే ఉద్గారాల వల్ల శ్వాస కోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం.. దేశంలో గాలి కాలుష్యం వల్ల ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మంది దాకా కన్నుమూస్తున్నారు. ఇక వాయు కాలుష్యంలో అధిక వాటా థర్మల్ పవర్ ప్రాజెక్టు లదే. ఆ తర్వాతి స్థానం వాహనాలది. అయితే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో గాలి నాణ్యత నానాటికి పడిపోతుంది. కాలుష్యాన్ని నివారించేందుకు సరి, బేసి సంఖ్యలో వాహనాల వినియోగాన్ని తెరపైకి తీసుకొచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. పైగా ఢిల్లీకి సరిహద్దులోని హర్యానా, పంజాబ్ ప్రాంతంలో రైతులు వరి పంటను కోసిన తర్వాత ఆ వ్యర్ధాలను తగలబెడుతున్నారు. ఆ పొగ మొత్తం ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తుంది. ప్రతి ఏటా ఈ తంతు కొనసాగుతున్నప్పటికీ దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా ఢిల్లీలో దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి పలు ఆంక్షలు విధిస్తోంది. అయితే ఈసారి ఢిల్లీ మాదిరే దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బాణాసంచా కాల్చే విషయంలో నిబంధనలు విధించాలని యోచిస్తోంది. దీపావళి రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ ఈనెల 24న జరుపుకోనున్న నేపథ్యంలో పండగ వేళ బాణాసంచా ఏ ఏ సమయంలో పేల్చాలో అనే వివరాలను అందులో వెల్లడించారు. ఈ మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దంతో కూడిన బాణసంచా ఉపయోగించవద్దని, కేవలం పర్యావరణహితమైన టపాసులనే పేల్చాలని సూచించారు.
-ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే
కేవలం ఢిల్లీ నగరం మాత్రమే కాకుండా.. దేశంలోని హైదరాబాద్, ముంబాయి, కోల్ కతా, చెన్నై వంటి నగరాల్లో కాలుష్యం స్థాయి నానాటికి పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లో గాలిలో సీసం రేణువులు అధికంగా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యం పై తీవ్రంగా ఉంటుందని చెబుతోంది. అయితే బాణసంచా తయారీలో కార్బన్ సంబంధిత మూలకాలు వాడుతారు కాబట్టి.. అవి మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే కాలుష్య నియంత్రణ మండలి బాణాసంచా కాల్చే విషయంలో నిబంధనలు విధిస్తోంది.

కాగా దీనిపై పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఏ పండుగలకు లేని ఆంక్షలు తమ పండగలపై ఎందుకని ధ్వజమెత్తుతున్నాయి. గత మూడేళ్ల క్రితం దీపావళి విషయంలో సుప్రీంకోర్టు ఇలానే కలగజేసుకుంది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీపావళి పండుగ ముందే కాలుష్య నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకోవడంతో.. హిందూ సంఘాలు ఏం చేస్తాయో వేచి చూడాల్సి ఉంది.