Jamili Election : ‘ఒక దేశం.. ఒకేసారి ఎన్నికలు’ అనే విధానం కొత్తదేమీ కాదు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1951-1967 మధ్య ప్రతి ఐదేళ్లకోసారి లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించారు. 1952, 1957, 1962, 1967 సంవత్సరాలలో దేశ ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఏకకాలంలో ఎన్నుకొన్నారు. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ , కొత్తరాష్ట్రాల ఆవిర్భావం ప్రారంభమయ్యాక లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దవడంతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఏకకాలంలో ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలని 1983లో ఎన్నికల కమిషన్ తన వార్షిక నివేదికలో సూచించింది. అనంతరం 1999లో లా కమిషన్ కూడా తన నివేదికలో ఇదే సూచన చేసింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక, ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ ఆవశ్యకతను బీజేపీ గట్టిగా ప్రస్తావించింది. ఆ తర్వాత కూడా దాన్ని అమలు చేసే ఉద్దేశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తరచుగా వ్యక్తం చేస్తోంది. 2018లో ఏకకాలంలో ఎన్నికల భావనకు మద్దతుగా లా కమిషన్ ముసాయిదా నివేదికను సమర్పించింది…
మార్పులు చేయాలి
ఎన్నికల చట్టాలు, రాజ్యాంగ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా లా కమిషన్ సిఫారసు చేసింది. ఇందుకు న్యాయ, రాజ్యాంగ పరంగా ఉన్న అడ్డంకులనూ పరిశీలించిన లా కమిషన్.. రాజ్యాంగంలో తగిన సవరణలు చేసిన తర్వాత మాత్రమే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించగలరని తేల్చిచెప్పింది. ఈ అంశంపై నిర్వహించే రాజ్యాంగ సవరణకు కనీసం 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాలని కూడా పేర్కొంది. 2019లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’పై అవగాహన కల్పించే, అభిప్రాయ సేకరణ జరిపే బాధ్యతను బీజేపీ నాయకత్వం రాజ్యసభ మాజీ సభ్యుడు వినయ్ సహస్రబుద్దే(బీజేపీ)కి అప్పగించింది. దీనిపై రెండు రోజుల సెమినార్ నిర్వహించిన ఆయన తన నివేదికను ఆ ఏడాది చివర్లో ప్రధాని మోదీకి అందజేశారు. చివరగా 2020లో అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ప్రధాని మోదీ మరోసారి ఏకకాలంలో ఎన్నికలు, ఒకే ఓటర్ల జాబితా అవసరమని నొక్కి చెప్పారు.
అవిశ్వాస తీర్మానంతోపాటే
అవిశ్వాస తీర్మానం లోక్‌సభ, లేదా ఏదేని అసెంబ్లీ ముందుగానే రద్దవడం వల్ల మిగిలిన కాలానికి మధ్యంతర ఎన్నికలు నిర్వహించే పరిస్థితిని నివారించడానికి అవిశ్వాస తీర్మానంతోపాటే, తదుపరి ప్రధానమంత్రిగా, లేదా తదుపరి సీఎంగా ప్రతిపాదించే నాయకుడి విశ్వాస తీర్మానాన్ని ఏకకాలంలో ప్రవేశపెట్టి, సభలో ఆ రెండింటికీ ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని ఈసీ గతంలో సూచించింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ కోసం రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించిన సమయంలో ఈసీ ఈ సూచన చేసింది. నిర్ణీత కాలానికి చాలా ముందుగా లోక్‌సభను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి, సభ రద్దును నివారించలేని పరిస్థితి ఉత్పత్నమైతే ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా ఈసీ పేర్కొంది. అసెంబ్లీలకు కూడా అలాంటి సూచననే ఈసీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీలకు నిర్ణీత గడువుకు ఎంత ముందుగా ఆ పరిస్థితి ఏర్పడితే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిని స్టాండింగ్ కమిటీ నిర్ణయించాలని పేర్కొంది.