https://oktelugu.com/

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ రాజీనామా.. ఆయన జేడీయూ కు అంత బలం ఉందా?..

ఇన్నాళ్లపాటు రాష్ట్రీయ జనతా దళ్ తో నితీష్ కుమార్ అంటకాగారు. ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ను నియమించారు. ఇన్ని రోజులపాటు కాస్త అటు ఇటుగా సజావుగానే ప్రభుత్వాన్ని నడిపారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 28, 2024 11:58 am
    Nitish Kumar
    Follow us on

    Nitish Kumar: అసలే అది బీహార్. ఆర్థికపరంగా, అక్షరాస్యత పరంగా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. కానీ ఆ ప్రాంతంలో రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎన్నికల్లో పరస్పరం ప్రత్యర్థులుగా తలపడినవారు తర్వాతి కాలంలో మిత్రులవుతారు. ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నవారు తదుపరి పరిణామాలతో ప్రత్యర్థులవుతారు. వెనుకటి నుంచి మొదలు పెడితే ఇప్పటి కాలం వరకు బీహార్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఇలాంటి దృష్టాంతాలనే రుజువు చేశాయి.. తాజాగా ఇటువంటి పరిణామం మరోసారి బీహార్ రాజకీయాలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. అంతే కాదు ఇండియా కూటమికి నిలువునా బీటలు వారేలా చేసింది.

    ఇన్నాళ్లపాటు రాష్ట్రీయ జనతా దళ్ తో నితీష్ కుమార్ అంటకాగారు. ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ను నియమించారు. ఇన్ని రోజులపాటు కాస్త అటు ఇటుగా సజావుగానే ప్రభుత్వాన్ని నడిపారు. మోడీని ఎలాగైనా గద్దె దించాలని చెప్పి ఇండియా కూటమికి అడుగులు పడేలా చేశారు. బీహార్లో తన భాగస్వామ్య పార్టీ అయిన ఆర్జెడితో కలిసి దేశంలో అన్ని ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కానీ ప్రధానమంత్రి విషయంలోనే తేడాలు రావడం.. కాంగ్రెస్ పార్టీతో పొసగకపోవడంతో ఇండియా కూటమికి జెల్ల గొట్టే ప్రయత్నం చేశారు. నితీష్ చేసిన ఈ ప్రయత్నం ఇండియా కూటమిలో బీటలు వారేలా చేసింది. ఫలితంగా తమిళనాడులోని డీఎంకే, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి. ఇలా అయితే కలిసి నడవలేమంటూ స్పష్టం చేశాయి. ఫలితంగా ఇండియా కూటమి నిలబడేది అనుమానంగానే కనిపిస్తోంది. సహజంగానే రాజకీయ శూన్యత ఉంటే వెంటనే అందులో ప్రవేశించి.. పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మార్చుకునే నరేంద్ర మోడీ.. బీహార్ రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితిని తన వైపు తిప్పుకున్నారు. నిన్నటిదాకా తనను విమర్శించిన నితీష్ కుమార్ తో పొగిడేలా చేసుకున్నారు. అంతేకాదు మోడీ మీద కాలు దువ్విన తేజస్వి యాదవ్ కు, లాలూ ప్రసాద్ యాదవ్ కు ఒక్కసారిగా గర్వభంగం కలిగించారు.. అంతేకాదు కేంద్ర మంత్రి అశ్విని చౌబేను రంగంలోకి దింపి బీహార్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా తన చేతుల్లోకి తీసుకున్నారు.

    ఎప్పుడైతే మోడీ ఎంటర్ అయ్యాడో అప్పుడే బీహార్ రాజకీయం మారడం మొదలుపెట్టింది. అంతేకాదు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా ప్రకటించాడు. తనకు ఆర్జేడి మద్దతు అవసరం లేదని స్పష్టం చేశాడు. దీంతో తేజస్వి యాదవ్ తన వర్గం వారితో రాజీనామా చేయించాడు. ఎలాగూ ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు గవర్నర్ ప్రకటించారు. ఎలాగూ బిజెపి మద్దతు ఇవ్వడంతో నితీష్ కుమార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బిజెపి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బీహార్ రాష్ట్రానికి ఏడవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం కల్లా నితీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడనుంది.. నితీష్ ప్రమాణ స్వీకారానికి అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి రెండు డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి కేటాయించాలని తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీలో 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. లాలూ ప్రసాద్ ఆధ్వర్యంలోని ఆర్జెడి అతిపెద్ద పార్టీగా అక్కడ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 79 మంది ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 సీట్లు కావాలి. అందుకు ఆర్ జె డి కి 43 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది.. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో బిజెపి రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. జెడ్ యు కు 45 మంది సభ్యులు ఉన్నారు. నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీతో కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్య కూడా సరిపోతుంది. నలుగురు సభ్యులు ఉన్న హిందుస్థాన్ ఆవామ్ మెర్చా కూడా నితీష్ బిజెపి కూటమికి మద్దతు ఇస్తోంది. దీంతో అక్కడ నితీష్ ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదు. ఇక ఆదివారం సాయంత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. నడ్డా కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియా కూటమిపై ఆరోపణలు చేస్తున్న అమిత్ షా.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీహార్ ఎపిసోడ్ ను తమ పార్టీకి అత్యంత అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అద్భుతం జరిగితే తప్ప ఇండియా కూటమి బలపడే అవకాశాలు లేవు. ఒకవేళ ఆ కూటమి బలపడినప్పటికీ అధికారంలోకి వస్తుందని అంచనాలు లేవు.