Nirmala Sitharaman: ఏపీలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. శేష జీవితం అనుభవించి పెన్షనర్లకు పింఛన్లు అందించడం లేదు. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు నిధులు అందించడం లేదు. నెలనెలా ఓడీకి వెళ్లడం.. ఆస్తులు కుదువపెట్టి ఆర్బీఐకి చెల్లింపులు చేసి.. మళ్లీ ఓడీకి వెళ్లడం రివాజుగా మారింది. కేంద్రం అనుమతికి మించి అప్పులు చేయడం, బ్యాంకు నుంచి తీసుకుంటున్న అప్పులు మేనేజ్ చేయడం.. ఇదీ మూడున్నరేళ్లుగా జగన్ సర్కారు మార్కు పాలన. పోనీ కేంద్రం నియంత్రిస్తుందంటే అదీ లేదు. కేంద్రానికి తెలియకుండా, లెక్క చెప్పకుండా చాలా రకాలుగా ఏపీ సర్కారు అప్పులు చేస్తోంది. వాటి జమా ఖర్చులు,వివరాలు కేంద్రానికి వివిధ మార్గాల ద్వారా తెలుస్తున్నా కట్టడి చేయడం లేదు. దీంతో ప్రభుత్వ ఆస్తులు కుదవలోకి వెళుతుండగా.. అప్పులు అమాంతం పెరిగిపోయాయి.

కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోంది. అసలు ఏపీ సర్కారు తప్పు చేస్తోందని స్ట్రయిట్ గా చెప్పేందుకు కూడా సాహసించడం లేదు. పార్లమెంట్ లో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ‘ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులంతా రహదారులపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. సదరు ప్రభుత్వం మాత్రం ప్రకటనలకు భారీ మొత్తం వెచ్చిస్తోంది. మీకు ఆదాయం ఉంటే ఉచితాలు ఇవ్వొచ్చు. కానీ అప్పులు తెచ్చి మరీ పంచడం ప్రమాదకరం’ అంటూ ఆమె హెచ్చరికలు ఏపీ ప్రభుత్వానికే. డిసెంబరు మూడో వారానికి కానీ ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేయలేకపోయారు. పథకాల ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నది జగన్ సర్కారు. కాబట్టి నిర్మలా సీతారామన్ హెచ్చరికలన్నీ ఏపీకేనని అందరికీ తెలిసిన విషయమే.
ఏపీ గురించి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏపీ ఇప్పుడు ఆర్థికంగా డేంజర్ జోన్ లో ఉంది. ఏపీలో ఆదాయం పెరగకపోగా.. అప్పులు రెట్టింపవుతున్నాయి. ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. వడ్డీభారం రోజురోజుకూ పెరుగుతోంది. ఓడీలపై ఆధారపడాల్సిన దౌర్భాగ్య స్థితికి చేరుకుంది. జరగాల్సింది జరిగాక.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించినా లాభం లేదు. ఎందుకంటే జగన్ సర్కారు తప్పటడుగులు వెనుక కేంద్ర ప్రభుత్వం అండదండలున్నాయని ఒక ప్రచారం ఉంది. దీంట్లో నిజమెంతో,, అబద్ధమెంతో తెలియకున్నా.. ఏపీ సర్కారు ఆర్థిక క్రమశిక్షణారాహిత్యాన్ని కట్టడి చేయాల్సిన విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరించింది. అది ఏపీ ప్రజల పాలిట శాపంగా మారింది. అందుకే ఇప్పుడు జగన్ సర్కారు తప్పిదాల్లో కేంద్రం భాగస్వామ్యం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణ పరిమితిని మిగతా రాష్ట్రాలు ఏడాది పొడవునా వినియోగించుకుంటున్నాయి. ఒక్క ఏపీ తప్ప. తన ఉచిత పథకాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు జగన్ అప్పులు తెస్తున్నారు. ఇలా ఆరు నెలలు పూర్తికాకుండానే కేంద్ర రుణ పరిమితిని దాటేస్తున్నారు. ఇదేమని కేంద్రం అడగడం లేదు. కార్పొరేషన్ల పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. వీటికి సంబంధించి వివరాలేవీ ఆర్బీఐకి పంపడం లేదు. అయినా సరే కనీస హెచ్చరికలు లేవు. అటు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాల నివేదికలు కేంద్రానికి అందుతున్నా స్పందించడం లేదు. అయితే రాజకీయ కారణాలు, ఇతరత్రా విషయాలో తెలియదు కానీ.. కేంద్రం ఉదాసీనత ఏపీకి శాపం కానుంది. అది తిరిగి ఎవరిని దహిస్తుందో చెప్పాల్సిన పనిలేదు.