Homeట్రెండింగ్ న్యూస్New Parliament Building : అమృతోత్సవ స్ఫూర్తి.. ఆత్మ నిర్భరత దీప్తి: కొత్త పార్లమెంట్ భవన్...

New Parliament Building : అమృతోత్సవ స్ఫూర్తి.. ఆత్మ నిర్భరత దీప్తి: కొత్త పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవం నేడే

New Parliament Building : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రజాస్వామ్యానికి గుండె కాయ లాంటి నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించుకోబోతోంది. నూతన పార్లమెంటు నిర్మాణంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రాధాన్యత కనిపిస్తోంది.. అడుగడుగునా భారత నిర్మాణశైలి ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. ఆదివారం నూతన పార్లమెంట్ భవనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోనుంది. ప్రస్తుత వృత్తాకార పాత భవనం పక్కన స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు 1200 కోట్లకు పైగా వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ పార్లమెంటు నూతన భవనం రూపుదిద్దుకుంది. ఈ కొత్త భవంతి, రాజ్ పథ్ ఆధునికీకరణ, ప్రధానమంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, రాష్ట్రపతికి కొత్త కార్యాలయం వంటివి ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
ఆదివారం నుంచి అందుబాటులోకి..
కొత్త పార్లమెంట్‌ భవనం ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. రూ.1200 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్లలో త్రికోణాకారంలో నిర్మించిన ఈ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు సెషన్లుగా కొనసాగనుంది. ఉదయం 7.15 నుంచి 9.30 వరకు జరగనున్న మొదటి సెషన్‌లో కేవలం ప్రధాని మాత్రమే పాల్గొంటారు. ఉదయం 7.15కు కొత్త పార్లమెంట్‌ భవనానికి చేరుకోనున్న ప్రధాని.. అక్కడ జరిగే పూజ, హోమం కార్యక్రమాల్లో పాల్గొంటారు. 8.30కు ప్రధాని లోక్‌సభ చాంబర్‌లోకి ప్రవేశిస్తారు. సరిగ్గా 9 గంటలకు సెంగోల్‌(రాజదండం)ను స్పీకర్‌ చాంబర్‌ సమీపంలో ప్రతిష్ఠిస్తారు. 9.30కు లాబీలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. దీంతో ప్రారంభోత్సవ తంతు ముగుస్తుంది. రెండో సెషన్‌ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సెషన్‌లో పలువురు అతిథులు, ఎంపీలు, అధికారులు పాల్గొంటారు..
హరివంశ్‌ ప్రసంగంతో..
 మధ్యాహ్నం 12.10 గంటలకు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే.. ఆయన తన ప్రసంగంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ సందేశాలను చదివి వినిపిస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే ప్రధాని, స్పీకర్‌ ఓంబిర్లా సంయుక్తంగా ఈ భవనాన్ని జాతికి అంకితం చేస్తారు. 12.17 గంటలకు రెండు షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తారు. 12.38 గంటలకు రాజ్యసభలో విపక్ష నేత(మల్లికార్జున ఖర్గే) ప్రసంగానికి స్లాట్‌ కేటాయించారు. అయితే.. కాంగ్రెస్‌ సహా 20 రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడంతో.. ఆయన హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రసంగం పూర్తయ్యాక.. ప్రధాని మోదీ రూ.75 నాణేన్ని విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1.10 నుంచి 2 గంటల వరకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. ఆయన ప్రసంగం పూర్తయ్యాక.. కార్యక్రమం ముగుస్తుంది. కాగా తమిళనాడు తిరువావదుతురైకి చెందిన సాధువులు ప్రధాని మోదీకి సెంగోల్‌(రాజదండం)ను అందజేశారు.
ఇవీ విశేషాలు 
త్రికోణాకారంలో ఉండే కొత్త పార్లమెంట్‌ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటికి జ్ఞాన ద్వారం, శక్తిద్వారం, కర్మ ద్వారం అని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకుల ప్రవేశానికి వేర్వేరు మార్గాలుంటాయి. కాగా.. కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పలు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నిర్మాణ సామగ్రిని వినియోగించారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ ప్రత్యేకమైన కార్పెట్లను తెప్పించారు. కొన్ని చోట్ల ఫ్లోరింగ్‌కు త్రిపుర వెదురు, స్పీకర్‌ చాంబర్‌ వద్ద అధికార రాజదండానికి చిహ్నాన్ని తమిళనాడు నుంచి తీసుకువచ్చారు. దర్వాజాలు, కిటికీలు, ఇతర ఇంటీరియర్‌కు ఉపయోగించిన టేకును మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి, ఇసుకరాయి, కేసరియా గ్రీన్‌స్టోన్‌, పాలరాతిని రాజస్థాన్‌ నుంచి తెప్పించారు. కాంస్య పనులను గుజరాత్‌లో చేయించారు. కాగా
సెంగోల్‌(రాజదండం) విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. స్వాతంత్ర్యానంతరం రాజదండానికి సముచిత గౌరవం కల్పించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. కానీ, పవిత్ర రాజదండాన్ని చేతికర్రగా పేర్కొంటూ ఆనంద్‌ భవన్‌ మ్యూజియంలో పెట్టడం దారుణమన్నారు. ‘‘మీ(ప్రజల) సేవకుడు(మోదీ) ఇప్పుడు సెంగోల్‌ను ఆనంద్‌ భవన్‌ నుంచి బయటకు తెప్పించి, సముచిత గౌరవ స్థానాన్ని కల్పించాడు’’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కాగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా తమిళ నటుడు రజనీ కాంత్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, పలువురు మోదీ కి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular