Nara Lokesh Padayatra: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల పాటు నడిచారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా తొలిరోజు పాదయాత్ర పూర్తిచేశారు. అయితే లోకేష్ రాజకీయ విమర్శలు కంటే రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలనే టార్గెట్ చేశారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభలో ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తాను చేస్తున్న రాజకీయం తన కోసం కాదని.. ప్రజల కోసమేనని చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తూ అందులోనూ తన మార్కును చూపించగలిగారు. మంత్రులకు కౌంటర్లు ఇచ్చారు. ఎక్కడా గందరగోళానికి తావులేకుండా.. తత్తరపాటుకు గురికాకుండా లోకేష్ ప్రసంగం సాగింది.

సీఎం జగన్ కు లోకేష్ కొత్తపేరు పెట్టారు. ఆయన జాదూరెడ్డిగా పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏం పీకిందని ప్రశ్నించారు.పొట్టి శ్రీరాములు వల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే… ఆంధ్రప్రదేశ్ ను దేశ పటంపై అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. అవశేష ఏపీని అభివృద్ధపథంలో నిలిపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కానీ మూడున్నేళ్లలో ఏపీని అధోగతి చేశారని,, -67 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ఘనత మాత్రం జగన్ రెడ్డికే దక్కుతుందని లోకేష్ ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరిట మూడున్నరేళ్లు కాలయాపన చేశారే తప్ప.. ఒక్క ఇటుక అయినా పేర్చారా? అని ప్రశ్నించారు.
యువగళం పేరు ప్రకటించిన వెంటనే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిచిపోయాయని లోకేష్ ఘాటైన వ్యాఖ్య చేశారు. తాను యువత భవిత కోసమే పాదయాత్ర చేస్తున్నానని.. అందుకే యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తనకు చీర, గాజులు పంపిస్తానని ఒక డైమండ్ అన్నారని.. వాటిని మా అక్క చెల్లెళ్లకు ఇచ్చి వారి కాళ్లు మొక్కుతానని దీటైన కౌంటర్ ఇచ్చారు. తాను తల్లిని, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు. జేబ్రాండ్ మద్యంతో అక్క చెల్లెళ్ల మెడలో మంగళసూత్రాలు తెంపుతున్న జాదూరెడ్డి అని జగన్ పై మండిపడ్డారు. ఏపీలో రైతు లేని రాజ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు.

‘జే ట్యాక్స్ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. పరిశ్రమలన్నీ బై.. బై.. ఏపీ అంటూ వెళ్లిపోతున్నాయి’ అంటూ లోకేష్ కొత్త స్లోగన్ ఇచ్చారు. ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలను బెదిరిస్తున్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు జే టాక్స్ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అటువంటప్పుడు పరిశ్రమలు ఎలా ఏర్పాటవుతాయని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పారిశ్రామికరణ, పెట్టుబడుల వరద గురించి ప్రస్తావించారు. వీధుల్లో డ్యాన్స్ చేస్తేనో.. కేసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావన్న విషయం గుర్తుపెట్టుకోవాలని లోకేష్ హితవుపలికారు. మొత్తానికైతే లోకేష్ తొలిరోజు యాత్ర సజావుగా సాగిపోయింది. ఆయన స్పీచ్ ద్వారా యువతే టార్గెట్ అన్నది తేలిపోయింది.